Telangana High Court: న్యాయపీఠంపై నారీశక్తి: తెలంగాణ హైకోర్టు నయా రికార్డ్
Telangana High Court: అద్భుతమైన గణాంకాలతో తెలంగాణ దేశంలోని అన్ని హైకోర్టులను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

Telangana High Court
పురుషాధిక్య సమాజంలో ఎన్నో శతాబ్దాలుగా స్త్రీలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో వారు సాధించే విజయాలు అద్భుతమైన మార్పులకు నాంది పలుకుతాయి. అలాంటిదే, న్యాయ దేవత స్వయంగా స్త్రీ రూపంలో కొలువైన న్యాయవ్యవస్థలో మహిళలు సాధించిన అద్వితీయ విజయం.
న్యాయపీఠంపై నారీశక్తికి పట్టం కట్టడంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court)దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలిచి ఒక కొత్త చరిత్ర సృష్టించింది. సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ (CLPR) విడుదల చేసిన ఒక నివేదిక ఈ అసాధారణమైన వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది.
దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో లింగ సమానత్వంపై చర్చ జరుగుతున్న వేళ, తెలంగాణ హైకోర్టు సాధించిన ప్రగతి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 30 మంది న్యాయమూర్తులలో ఏకంగా 10 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. అంటే, దాదాపు 33.3 శాతం ప్రాతినిధ్యం మహిళలదే.

ఈ అద్భుతమైన గణాంకాలతో తెలంగాణ దేశంలోని అన్ని హైకోర్టుల(Telangana High Court)ను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, న్యాయవ్యవస్థలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలనే తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు, అలాగే స్త్రీల సామర్థ్యాన్ని గుర్తించాలనే ఆదర్శానికి ఇది గొప్ప నిదర్శనం.
తెలంగాణ ఈ జాబితాలో శిఖరాగ్రాన నిలవగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న 30 మంది న్యాయమూర్తులలో కేవలం ఐదుగురు మాత్రమే మహిళలు. ఈ గణాంకాలు చూస్తే, తెలంగాణలో మహిళా న్యాయమూర్తుల భాగస్వామ్యం రెట్టింపు స్థాయిలో ఉండటం విశేషం.
హైకోర్టుల పరిస్థితి ఇలా ఉంటే, దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో మహిళల ప్రాతినిధ్యం ఇంకా ఆశించినంతగా లేదు. సుప్రీంకోర్టులో ఉన్న 33 మంది న్యాయమూర్తులలో కేవలం ఇద్దరు మాత్రమే మహిళలు.
మొత్తంగా తెలంగాణ హైకోర్టు (Telangana High Court)సాధించిన ఈ అసాధారణ ప్రగతి దేశవ్యాప్తంగా ఒక ఉదాహరణగా నిలిచి, న్యాయవ్యవస్థలో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. న్యాయ దేవత స్త్రీ అయినప్పుడు, ఆ పీఠంపై స్త్రీలే ఎక్కువగా ఉండటం ఒక సుందరమైన, బలమైన మార్పు. తెలంగాణ దీనికి నాంది పలికి, భవిష్యత్తుకు ఒక కొత్త బాటను వేసిందని చెప్పొచ్చు.