High Court : కొడుకును చూడాలంటే రూ.30 లక్షలు కట్టాల్సిందే.. తండ్రికి హైకోర్టు షాక్
High Court : ఈ కేసులో తండ్రి తన బాధ్యతలను విస్మరించడం, ఆర్ధికంగా ఎలాంటి సాయం చేయకపోవడం తీవ్రమైన తప్పు అంటూ కోర్టు మందలించింది.

High Court
కుటుంబంలో తండ్రిగా తన బాధ్యతలను విస్మరించిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తెలంగాణ హైకోర్టు గట్టి షాకిచ్చింది. తన కుమారుడిని కలవాలనుకుంటే, అతని పోషణ, విద్య కోసం భార్య ఖర్చు చేసిన రూ.30 లక్షలను చెల్లించాలని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో ఇది కేవలం ఒక విడాకుల కేసులో తీర్పు కాదు, తండ్రి బాధ్యతను స్పష్టం చేస్తూ కోర్టు ఇచ్చిన ఒక బలమైన సందేశం అంటూ తెలంగాణ(High Court) వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే, ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన భార్యపై క్రూరత్వం , విడిచిపెట్టారనే ఆరోపణలతో రంగారెడ్డి జిల్లాలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. అయితే, 2023 డిసెంబరులో ఫ్యామిలీ కోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసి, అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీనితో అతను తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసు విచారణలో, హైకోర్టు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించింది. ఈ దంపతులకు 2009 అక్టోబరులో ఒక కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి భార్య తన కుమారుడితో విడిగా ఉంటున్నారు. ఆమె కేవలం గృహిణి అయినా కూడా తన కుమారుడి విద్య, పోషణ ఖర్చులన్నీ తానే భరించారు. కోర్టు రికార్డుల ప్రకారం, ఆమె ఇప్పటివరకు తన కుమారుడి చదువు, జీవనానికి సంబంధించి రూ.26.41 లక్షలు ఖర్చు చేశారు. ఈ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, భవిష్యత్ ఖర్చులతో కలిపి ఆ మొత్తాన్ని రూ.30 లక్షలకు పెంచి, ఆ మొత్తాన్ని తండ్రి చెల్లించాలని ఆదేశించింది.
ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా 2025 ఆగస్టు 18 నుంచి నవంబరు 3వ తేదీ లోపు చెల్లించాలని కోర్టు నిర్దేశించింది. ఈ మొత్తం చెల్లించిన తర్వాతే తండ్రికి తన కుమారుడిని కలిసే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసులో తండ్రి తన బాధ్యతలను విస్మరించడం, ఆర్ధికంగా ఎలాంటి సాయం చేయకపోవడం తీవ్రమైన తప్పు అంటూ కోర్టు మందలించింది.

కోర్టు తండ్రికి తన కుమారుడిని ప్రతి ఆదివారం రెండు గంటల పాటు కలుసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే, ఈ భేటీ ఒక న్యాయవాది సమక్షంలో జరగాలని, ఆ న్యాయవాది ఫీజు రూ.30 వేలను కూడా తండ్రే భరించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, కొడుకు నెలవారీ ఖర్చుల కోసం ప్రతినెలా రూ.20 వేల భరణం చెల్లించాలని కూడా ఆదేశించింది. ఈ తీర్పు తండ్రి బాధ్యతలను మరొకసారి గుర్తుచేస్తుందంటూ నెటిజన్లు హైకోర్గు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
One Comment