cricket:ఒకే ఓవర్లో 5 వికెట్లు.. టీ20ల్లో సంచలన బౌలింగ్
cricket:కాంబోడియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ప్రియాందన ఈ అరుదైన రికార్డు అందుకున్నాడు.
cricket
సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటే బ్యాటర్ల హవానే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు లేదా ఆరు ఫోర్లు లేదా 30ప్లస్ పరుగులు.. ఇలాంటి రికార్డులే కనిపిస్తుంటాయి. బౌలర్లు ఎంత బాగా రాణించినా హ్యాట్రిక్ లేదా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడం లాంటివి చాలా అరుదు. అలాంటిది టీ ట్వంటీ క్రికెట్(cricket) లో సంచలనం నమోదైంది. ఒకే ఓవర్లో రెండు కాదు మూడు కాదు ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు ఇండోనేషియాకు చెందిన పేస్ బౌలర్ గేడే ప్రియాందన..పురుషుల క్రికెట్ అయినా మహిళల క్రికెట్(cricket) అయినా అంతర్జాతీయ క్రికెట్ లో ఒకే ఓవర్లో ఇలా ఐదు వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి.
గతంలో పలువురు నాలుగు వికెట్ల ఫీట్ ను మాత్రమే నమోదు చేశారు. శ్రీలంక పేసర్ లసిత్ మలింగా, ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ పేసర్ జాసన్ హోల్డర్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్ల ఫీట్ సాధించిన వారిలో ఉన్నారు. వీరికి కూడా సాధ్యం కాని ఐదు వికెట్ల ఘనతను ఇప్పుడు ఇండోనేషియా బౌలర్ సాధించాడు.

కాంబోడియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ప్రియాందన ఈ అరుదైన రికార్డు అందుకున్నాడు. కాంబోడియా ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఈ అరుదైన ఫీట్ చోటు చేసుకుందిమొదట వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. నాలుగో బాల్ ను డాట్ చేసిన అతను తర్వాత మళ్లీ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసాడు. కాంబోడియా బ్యాటర్లు షా అబ్రార్ హొస్సేన్ , నిర్మల్ జీత్, రతనక్, మోంగ్‌దర సోక్, పెల్ వెన్నక్ ఔట్ అయ్యారు. నిజానికి కాంబోడియా ఒక దశలో ఈజీగా గెలిచేలా కనిపించింది. 106/5 స్కోరుతో విజయం దిశగా సాగుతున్న ఆ జట్టును ప్రియాందన సంచలన స్పెల్ తో దెబ్బకొట్టాడు. అతని ఐదు వికెట్ల రికార్డుతో ఇండోనేషియా 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇంటర్నేషనల్ క్రికెట్ కు సంబంధించి ఒకే ఓవర్లో 5 వికెట్లు నమోదవడం ఇదే తొలిసారి. అయితే దేశవాళీ క్రికెట్ లో మాత్రంలో గతంలోనే ఈ అరుదైన రికార్డు నమోదైంది. బంగ్లాదేశ్ బౌలర్ అమీన్ ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసాడు. అలాగే 2019-20 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్లో కర్ణాటకకు చెందిన అభిమన్యు మిధున్ ఈ రికార్డును అందుకున్నాడు.



