Vaibhav Sooryavanshi : దూసుకెళుతున్న బ్రాండ్ వాల్యూ..రేటు పెంచేసిన బుడ్డోడు
Vaibhav Sooryavanshi : ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్‌తో పాటు ఐదు అవార్డులు, రూ.55 లక్షల నగదు, ఒక కారు గెలుచుకున్న వైభవ్ కోసం ఇప్పుడు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఒప్పందాల కోసం క్యూ కడుతున్నాయి.
Vaibhav Sooryavanshi
భారత క్రికెట్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీనే(Vaibhav Sooryavanshi) హాట్ టాపిక్… నిజానికి గత ఏడాది కాలంగా ఈ బుడ్డోడి హవానే కనిపిస్తోంది. గత ఏడాది ఐపీఎల్ సీజన్ అరంగేట్రంలోనే సెంచరీతో దుమ్మురేపిన వైభవ్ ఈసారి సీజన్ మొత్తం అల్లాడించేశాడు. ఏ బౌలర్ నూ వదలకుండా ఉతికారేస్తూ సీజన్ లో పరుగుల వరద పారించాడు.
మరే క్రికెటర్ కూ సాధ్యం కాని విధంగా 237కు పైగా స్ట్రైక్ రేట్ తో ఏకంగా 776 పరుగులు చేసి ఔరా అనిపించాడు. మొన్నటి వరకూ ఒక లెక్క… ఐపీఎల్ 19వ సీజన్ ఒక లెక్క అన్న రీతిలో రెచ్చిపోయాడు. ఈ చిచ్చర పిడుగు బ్యాటింగ్ చూసిన దిగ్గజ ఆటగాళ్లంతా సలామ్ కొట్టారు. ఒకవేళ వైభవ్ వేలంలోకి వస్తే ఎంత పలుకుతాడన్న చర్చ కూడా జరిగింది.
అదే జరిగితే తానే 30 కోట్లకు కొంటానంటూ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడంటే వైభవ్(Vaibhav Sooryavanshi) రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ తో సహా ఐదు అవార్డులు, 55 లక్షలు, ఒక కారు అందుకున్న ఈ చిచ్చర పిడుగుతో ఒప్పందాల కోసం బడా కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. బుడ్డోడి బ్రాండ్ వాల్యూ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. దీంతో ఎండార్స్ మెంట్స్ రేట్లను డబుల్ చేశాడు.

ఇప్పటికే సంతకాలు చేసిన ఒప్పందాలన్నింటికీ రెట్టింపు మొత్తం అందుకోబోతున్నాడు. దీనికి కంపెనీలు కూడా సంతోషంగా ఇచ్చేందుకు అంగీకరించడం విశేషం. వైభవ్ ఇప్పటికే కాంప్లాన్, రెడ్‌బుల్ వంటి బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు వైభవ్ ఒక్కో ఒప్పందానికి సుమారు రూ.కోటి చొప్పున ఎండార్స్ మెంట్ ఫీజుగా తీసుకున్నాడు.
సీజన్ ముగిసిన తర్వాత మాత్రం అతడు ఒక్కో ఒప్పందానికి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు మార్కెటింగ్ అధికారి ఒకరు చెప్పారు. ఆట మారడంతోనే బ్రాండ్ వాల్యూ కూడా మారిపోయిందని పలువురు చెబుతున్నారు. ఐపీఎల్ ఫామ్ అంతర్జాతీయ క్రికెట్ లోనూ కొనసాగిస్తే వైభవ్ త్వరలోనే ఉన్నత శిఖరాలను చేరుకుంటాడు. అయితే ఇలాంటి ఎండార్స్ మెంట్స్ మాయలో పడకుండా ఆటపై మరింత ఫోకస్ పెడితే కోహ్లీ స్థాయికి ఎదుగుతాడని పలువురు అంచనా వేస్తున్నారు.
Ponnam Prabakar : బరాబర్ మా అయ్య జాగీరే..పవన్ కు పొన్నం కౌంటర్





