Hardik : హార్దిక్ కోసం చెన్నై మెగా స్కెచ్..ముంబైకి దూబే, బ్రెవిస్ ?
Hardik : 2015లో కేవలం రూ. 10 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టు పాండ్యాను కొనుగోలు చేసింది. లోయర్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడి, మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Hardik
ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఫ్రాంచైజీలు తమ జట్లలో మార్పులు మొదలుపెట్టాయి. దీనిలో భాగంగా గత సీజన్‌లో నిరాశపరిచిన కొంతమంది ప్లేయర్స్‌ను వదులుకోవడానికి సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగానే మిగిలిన ఫ్రాంచైజీలతో ట్రేడింగ్ బేరాలు సాగిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌ను వీడటానికి హార్దిక్(Hardik) పాండ్యా సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ ఈ స్టార్ ఆల్ రౌండర్‌పై కన్నేసింది.
అతని కోసం ముంబైకి భారీ ఆఫర్ ఇచ్చింది. హార్దిక్ పాండ్యా కోసం ఇద్దరు కీలక ఆటగాళ్లను వదులుకోవడానికి కూడా సిద్ధమైంది. పాండ్యాకు బదులుగా శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్‌లను ఇస్తామని ముంబైకి ప్రతిపాదన పెట్టింది. అయితే ముంబై ఇండియన్స్ ఆయుష్ మాత్రేను కూడా కోరుతోంది. కానీ సీఎస్కే మాత్రం ఆయుశ్ మాత్రేను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. దీంతో దానికి బదులుగా రూ.10 కోట్ల నగదు ఇస్తామని కొత్త ప్రతిపాదన ముంబై ముందుంచింది. ఆగస్టు మొదటి వారంలోగా హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం స్పష్టత ఇవ్వనుంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 2026 ఐపీఎల్ సీజన్‌లో ముంబై జట్టు పేలవ ప్రదర్శన తర్వాత, పాండ్యా జట్టు యాజమాన్యంతో మాట్లాడి ఫ్రాంచైజీ నుంచి వైదొలగాలనే తన నిర్ణయాన్ని తెలిపినట్టు వార్తలు వచ్చాయి.
నిజానికి రెండు సీజన్ల నుంచి ముంబై యాజమాన్యంతో పాండ్యాకు సంబంధాలు చెడినట్టు కూడా పుకార్లు వచ్చాయి. జట్టును విజయవంతంగా నడిపించడంలో హార్దిక్ పాండ్యా విఫలమవడం ముంబై యాజమాన్యం అసంతృప్తికి కారణమైంది. దీంతో పాటు ముంబై జట్టులో కొంతమంది ఆటగాళ్లు పాండ్యాను పట్టించుకోకపోవడం కూడా అతను ఆ ఫ్రాంచైజీని వీడడానికి మరో కారణంగా చెబుతున్నారు. దీంతోనే పాండ్యాపై చెన్నై సూపర్ కింగ్స్ దృష్టి పెట్టింది.
ఒకవేళ హార్దిక్(Hardik) పాండ్యా ముంబైని వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరితే, ఆయన సీఎస్‌కేకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సీఎస్‌కేతో చర్చలు విఫలమైతే, కోల్‌కతా నైట్ రైడర్స్ , లక్నో సూపర్ జెయింట్స్ కూడా హార్దిక్‌ను ట్రేడ్ ద్వారా దక్కించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

కాగా 2015లో కేవలం రూ. 10 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టు పాండ్యాను కొనుగోలు చేసింది. లోయర్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడి, మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జట్టు నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాత 2022 మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను రూ. 15 కోట్లకు తీసుకుని కెప్టెన్‌గా నియమించింది. మొదటి సీజన్‌లోనే గుజరాత్‌ను విజేతగా నిలిపాడు. 2024 ట్రేడ్ విండో ద్వారా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టుకు వచ్చి కెప్టెన్ బాధ్యతలను చేపట్టాడు.
Mirabai Chanu : మీరాబాయి చాను గోల్డెన్ హ్యాట్రిక్.. మూడో స్వర్ణంతో సరికొత్త చరిత్ర





