Rose Plants:గులాబీ మొక్కలు పెంచుతున్నారా.. ఏడాదంతా పూలు పూయాలంటే ఇలా చేయండి..
Rose Plants: గులాబీ మొక్కలకు రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల పాటు అయినా డైరెక్టుగా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
Rose Plants
ఇంట్లో పూల మొక్కలు పెంచుకోవడం చాలామందికి ఇష్టం. ముఖ్యంగా గులాబీ మొక్కలను పెంచుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ తమ ఇంట్లో గులాబీ మొక్కలు సరిగ్గా పెరగడం లేదని, పూలు పూయడం లేదని చాలా మంది బాధపడుతుంటారు.
అయితే గులాబీ మొక్కలు(Rose Plants) ఏపుగా పెరగడానికి కేవలం నీళ్లు పోస్తే సరిపోదని.. వాటికి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరమని అంటున్నారు నిపుణులు. ముందుగా మొక్కను ఎక్కడ ఉంచుతున్నామనేది చాలా ముఖ్యం. గులాబీ మొక్కలకు రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల పాటు అయినా డైరెక్టుగా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ఎండ సరిగ్గా తగిలితేనే అవి మొగ్గలు తొడుగుతాయని తెలుసుకోవాలి.
అంతేకాకుండా మట్టి నాణ్యత కూడా గులాబీ చెట్టుకు చాలా ముఖ్యం. మట్టిలో తేమ ఉండాలి కానీ నీళ్లు నిలిచి ఉండకూడదు. కోకోపీట్ వాడటం వల్ల మట్టిలో పోషకాలు బాగా అందుతాయి. మనం వంటింట్లో పారేసే వస్తువులను కూడా ఎరువుగా వాడుకోవచ్చు. ముఖ్యంగా వాడేసిన టీ పొడిని ఎండబెట్టి.. గులాబీ మొక్క మొదట్లో వేస్తే అది అద్భుతమైన ఎరువుగా పనిచేస్తుంది.
అలాగే కోడిగుడ్డు పెంకులను మెత్తగా పొడి చేసి వేయడం వల్ల ఆ గులాబీ మొక్కల(Rose Plants)కు క్యాల్షియం అందుతుంది. పల్చని మజ్జిగను నెలకు ఒకసారి అయినా పోయడం వల్ల కూడా పూలు బాగా పూస్తాయి. అంతేకాదు కలబంద ముక్కలను ఎరువుగా వాడితే మొక్క వేర్లు బలంగా పెరుగుతాయి.

గులాబీ మొక్కలు సరిగ్గా పెరగడంలో మరో ముఖ్యమైన విషయం ప్రూనింగ్ (Pruning) అని నిపుణులు చెబుతున్నారు. అంటే ఎండిపోయిన గులాబీ కొమ్మలను, పండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండటం వల్ల కొత్త కొమ్మలు వచ్చి ఎక్కువ పూలు పూస్తాయి. నీళ్లు పోసేటప్పుడు ఆకులపై పోయడం కాదు, నేరుగా మొక్క మొదట్లో పోయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆకులపై నీరు నిలిచి ఉంటే ఫంగస్ వచ్చే ప్రమాదముంటుంది.
ఒకవేళ పురుగులు కానీ ఫంగస్ కానీ కనిపిస్తే వేప నూనెను నీటిలో కలిపి ఆకులపై స్ప్రే చేయాలి. 15 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉన్నప్పుడు గులాబీ పూలు బాగా పూస్తాయి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంటిలో గులాబీలతో ఏడాదంతా కళకళలాడుతుంది .
RCB : ఆర్సీబీ సేల్ @ 16 వేల కోట్లు…గంటల్లోనే రాజస్థాన్ రికార్డు బ్రేక్





