Just LifestyleLatest News

Help : 99 సాయాలు పొంది ఒక్కదానికి నో చెబితే ఫీలవుతున్నారా? ఈ విషయంలో ఎవరిది తప్పు?

Help : కేవలం ఆ ఒక్కసారి నో అన్న మాటని మాత్రమే పట్టుకుని, అన్నిసార్లు సాయం చేసిన వ్యక్తిని నిందిస్తుంటారు.

Help

సొసైటీలో ఎవరికైనా కష్టం వస్తే అడగ్గానే సాయం చేసే అలవాటు కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అయితే అలా ఉన్నవాళ్లకు చాలాసార్లు ఒక చేదు అనుభవం ఎదురవుతూ ఉంటుంది.

అవతలి వాళ్లు అడిగినప్పుడల్లా వారికి సాధ్యమైనంత వరకు సహాయం(Help) చేసి.. ఏదైనా ఒక సందర్భంలో మాత్రం తమ పరిస్థితి బాగోకనో , కుదరకనో ఒక్కదానికి నో చెబితే మాత్రం అవతలి వాళ్లు అప్పటివరకు పొందిన సాయాలన్నింటినీ ఆ క్షణంలోనే మర్చిపోతారు.కేవలం ఆ ఒక్కసారి నో అన్న మాటని మాత్రమే పట్టుకుని, అన్నిసార్లు సాయం చేసిన వ్యక్తిని నిందిస్తుంటారు.

నిజానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి రెండు వైపులా కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముందుగా సాయం పొంది కూడా ఒక్కసారి మాత్రం వారికి సాయం అందలేదని…. అంత వరకూ పొందిన సాయాలన్నిటిని మర్చిపోయి మరీ నిందించే వాళ్ల మనస్తత్వాన్ని సైకాలజీలో ‘ఎన్‌టైటిల్‌మెంట్ మెంటాలిటీ’ (Entitlement Mentality) అంటారు.

అంటే, ఒక వ్యక్తి వారికి పదే పదే సహాయం(Help) చేస్తుంటే.. అది వాళ్ల మంచితనమని అనుకోకుండా అది వాళ్ల బాధ్యత లేదా మన హక్కు అని ఫీలవుతుంటారు. దీంతో పాటు మనుషుల్లో నెగెటివిటీ బయాస్ (Negativity Bias) అనే లక్షణముంటుంది.

దీనివల్ల వంద మంచి విషయాలు జరిగినా.. మనుషుల మనసు కేవలం ఆ ఒక్క నెగెటివ్ విషయాన్ని మాత్రమే బాగా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే సహాయం చేయలేమని ఒక్కసారి చెప్పినా సరే వాళ్లలో ఒక రకమైన నిరాశ, కోపం వచ్చి.. ఎదుటి వ్యక్తిని చెడ్డవాడిగా చెప్పడానికి ప్రయత్నిస్తారు.

ఇక రెండో వ్యక్తి వైపు చూస్తే.. ఎప్పుడూ హెల్ప్ చేసే వాళ్లలో కూడా తెలీకుండానే ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. దీనిని సైకాలజీలో పీపుల్ ప్లీజింగ్ (People Pleasing) లేదా ‘డోర్‌మ్యాట్ సిండ్రోమ్’ అంటారు.

అంటే, అవతలి వాళ్ల దృష్టిలో తామెప్పుడూ మంచిగా ఉండాలనో, లేదా నో చెబితే వాళ్లు ఎక్కడ బాధపడతారో , లేదా దూరం అవుతారనే భయంతో తమ పనులను, తమ పరిమితులను పక్కన పెట్టి మరీ సాయం చేస్తూ ఉంటారు.

దీనివల్ల అవతలి వ్యక్తికి ఈయన ఎప్పుడు అడిగినా కాదనడనో లేదా వీళ్లకు పెద్దగా పనులుండవనో అనే ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. ఎప్పుడైతే సాయం చేసే వ్యక్తి తన లైఫ్‌లో హెల్తీ బౌండరీస్ (limits) పెట్టుకోడో, అప్పుడు అవతలి వాళ్లు అతని మంచితనాన్ని ఒక బలహీనతగా అనుకుని తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు.

చివరగా చూస్తే.. ఇక్కడ తప్పు ఇద్దరిలోనూ ఉంటుంది . అయినా సరే చేసిన సాయాన్ని మర్చిపోయి నిందించే వాళ్ల ప్రవర్తన మాత్రం కచ్చితంగా తప్పే అవుతుంది. ఇక మనుషులుగా మనం ఒకరికొకరు సాయం చేసుకోవాలి. కానీ సాయం చేసే వాళ్లు కూడా అవతలి వాళ్లకు ఎనీ టైమ్ అవైలబుల్‌ అనేలా, పూర్తిగా తమపైనే డిపెండ్ అయ్యేలా, లేదా తమమీదే అలవాటు పడేలా ఉండకూడదు.

Help
Help

తమ శారీరక, మానసిక, ఆర్థిక పరిమితులను దాటి ఎప్పుడూ సాయం చేయకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవసరమైనప్పుడు స్పష్టంగా నో ఇప్పుడు చేయలేను అనో, లేదంటే నాకు చాలా ఇంపార్టెంట్ పనులున్నాయని చెప్పడం అలవాటు చేసుకుంటే.. అవతలి వాళ్లకు కూడా వారి పరిస్థితులపై ఒక క్లారిటీ ఉంటుంది.

లేదంటే 99 సాయాలు చేసినా.. చివరికి ఆ ఒక్క నో అనే మాటతో ఎప్పటికీ వారి దృష్టిలో విలన్‌గా మిగిలిపోవాల్సి వస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

Tirumala:తిరుమల కొండపై ఏఐ టెక్నాలజీ..క్యూలైన్ల రద్దీని అంచనా వేస్తూ వేగంగా దర్శనాలు

Related Articles

Back to top button