Japanese Ma Theory : ఎప్పుడూ కలిసి ఉండటమే కాదు..బంధం గట్టిపడాలంటే చిన్న దూరం కూడా అవసరమేనట..
Japanese Ma Theory : పార్ట్నర్స్ మధ్య ఎంతటి గాఢమైన ప్రేమ ఉన్నా కూడా.. ఇద్దరి మధ్య అప్పుడపుడు ఒక ఆరోగ్యకరమైన దూరం ఉండటమే .. మా థియరీ తత్వం.
Japanese Ma Theory
భార్యాభర్తలు అన్నాక ఎప్పటికప్పుడు ఒకరికొకరు అప్ డేట్ ఇచ్చుకుంటూ, రోజంతా జరిగిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ, ఎప్పుడూ ఒకరికొకరు అందుబాటులో ఉండటమే ఆ బంధంలో చాలా ముఖ్యమని చాలామంది అనుకుంటారు. కానీ స్ట్రాంగ్ అయిన, లైఫ్ లాంగ్ రిలేషన్స్‌కు పేరు గాంచిన జపనీయులు మాత్రం.. మా అనే ఒక వినూత్నమైన సూత్రాన్ని పాటిస్తారు. ఈ సూత్రం ప్రకారం దంపతుల మధ్య ఒక స్పేస్, చిన్న విరామం, నిశ్శబ్దం ఉండటం ఎంతో అవసరం.
సంసారంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావడం ఎక్కడయినా చాలా సహజం. అయితే ఒక్కోసారి ఆవేశం మాటామాటా పెరిగిపోవడం వల్ల ఇంకా మనస్పర్ధలు పెరిగి, చివరికి అవి డైవోర్స్ వరకు దారి తీస్తుంటాయి. ఇటువంటప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ తగ్గడం కంటే, ఆవేశంలో నోటి నుంచి వచ్చే పదునైన మాటలే వారి రిలేషన్‌ను దెబ్బతీస్తాయి. వాదనలు జరుగుతున్నప్పుడు బాడీలో స్ట్రెస్ హార్మోన్లు పెరిగిపోవడం వల్ల బ్రెయిన్ ఎదురుదాడి చేయడానికి ఈ ప్రాధాన్యత ఇస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
అందుకే జపనీస్ ఫాలో అయ్యే ..మా థియరీ(Japanese Ma Theory) ఈ ఆవేశానికి వెంటనే బ్రేక్ వేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.వారు సమస్య ఎదురైనప్పుడు వెంటనే ఎదురుదాడికి దిగి ఒకరితో ఒకరు వాదించకుండా ఇద్దరిలో ఎవరో ఒకరు అయినా లేదంటే ఇద్దరూ అయినా కొద్దిసేపు నిశ్శబ్దాన్ని పాటిస్తారు.
గొడవ స్టార్ట్ అవుతుందని అనిపించగానే ఫోన్లు చూడటం లేదంటే ఒకరినొకరు కళ్లలోకి చూస్తూ వాదించుకోవడం ఆపేస్తారు. ఈ చిన్న విరామం వల్ల వారి మనసు ప్రశాంతపడి, తనను తాను కరెక్ట్ అని నిరూపించుకోవాలనే తొందరపాటు తగ్గిపోతుంది. ఈ పద్ధతిని పాటించి డైవోర్స్ అంచుల వరకు వెళ్లిన దంపతులు కూడా మళ్లీ కలిసిన సందర్భాలు ఉన్నాయని అక్కడి వారు చెబుతారు.
అయితే ఈ నిశ్శబ్దం అంటే పార్ట్నర్తో మాట్లాడటం మానేసి.. మౌన యుద్ధం చేయమని చెప్పడం కాదు. కోపంలో మాటలు పెరిగి ఇద్దరి మధ్య రిలేషన్ పాడవ్వకుండా ఉండటానికి కాసేపు స్పేస్ ఇవ్వడం మాత్రమే. కోపం తగ్గాక ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే చాలా ఆవేశపూరిత నిర్ణయాలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.

ఆ గ్యాప్ ఇచ్చే సమయంలో ఒకరికి గార్డెనింగ్, మరొకరికి పుస్తకాలు చదవడం ఇష్టమైతే, ఎవరికి నచ్చిన పనుల్లో వాళ్లు కొంత సమయం గడపాలి. ఆ తర్వాత కలిసి మాట్లాడుకుని సమస్యను షార్టవుట్ చేసుకోవచ్చు.
అంతేకాదు పార్ట్నర్స్ మధ్య ఎంతటి గాఢమైన ప్రేమ ఉన్నా కూడా.. ఇద్దరి మధ్య అప్పుడపుడు ఒక ఆరోగ్యకరమైన దూరం ఉండటమే ఈ.. మా థియరీ తత్వం. దీనివల్ల ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్, నమ్మకం పెరగడమే కాకుండా స్వేచ్ఛ కూడా లభిస్తుంది. మాటల కంటే ఓపిక, శ్రద్ధతో పాటు పార్ట్నర్కి కావలసిన గౌరవాన్ని ఇవ్వడమే నిజమైన ప్రేమ అని ఈ జపనీస్ జీవన విధానం చెబుతోంది.





