Chutney : ఇడ్లీ, దోసల్లోకి కమ్మటి పల్లీ చట్నీ..హోటల్ స్టైల్‌లో ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోండి..
Chutney : పల్లీలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకును ఆయిల్‌లో వేయించి రుబ్బడం వల్ల టిఫిన్ రుచి నెక్స్ట్ లెవెల్‌కు వెళుతుంది.
Chutney
మనం రెగ్యులర్‌గా టిఫిన్ బండి దగ్గరో, ఫేమస్ హోటల్లోనో వేడివేడి ఇడ్లీ తింటున్నపుడు వారిచ్చే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. అక్కడ ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే చట్నీని ఇంట్లో చేస్తే మాత్రం ఆ రుచి రాదు. కానీ ఒక చిన్న ట్రిక్‌తో హోటల్‌ను మించిన కమ్మటి పల్లీ చట్నీని నిమిషాల్లో ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. పల్లీలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకును ఆయిల్‌లో వేయించి రుబ్బడం వల్ల చట్నీ రుచి నెక్స్ట్ లెవెల్‌కు వెళుతుంది.
ఒక కప్పు పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు, ఒక టీస్పూన్ జీలకర్ర, రెండు రెమ్మల కరివేపాకు, 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, సరిపడా నూనె తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
అలాగే పచ్చడి రెడీ అయ్యాక తాళింపు కోసం ఒక టేబుల్ స్పూన్ నూనె, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, రెండు ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి , కరివేపాకు తీసి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక ఒక కప్పు పల్లీలను వేసి మంటను పూర్తిగా సిమ్‌లో ఉంచి నిదానంగా వేయించాలి. హై ఫ్లేమ్‌లో వేయిస్తే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి, కాబట్టి లోఫ్లేమ్‌లోనే వేయించి పొట్టు విడిపోయే టైమ్‌లో ప్లేట్‌లోకి తీసుకోవాలి.

అదే కడాయిలో పచ్చి శనగపప్పు, మినపప్పు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించి పల్లీలలో వేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి వేగాక జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, చింతపండు కడాయిలో వేసి దోరగా వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లి, కరివేపాకులను పచ్చిగా కాకుండా ఇలా ఆయిల్‌లో వేయించడమే ఈ చట్నీకి అసలైన హోటల్ టేస్ట్‌ను ఇస్తుంది.
ఇలా వేయించినవాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి.. అందులో రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి నీళ్లు పోసుకోవచ్చు. చివరిగా ఒక చిన్న కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, జీరా, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టి చట్నీలో కలుపుకుంటే చాలు.. హోటల్ స్టైల్ పల్లీ చట్నీ(Chutney) రెడీ అయిపోతుంది. వేడివేడి ఇడ్లీ, దోస, ఉప్మా, వడల్లోకి ఈ చట్నీ నంజుకుని తింటే టిఫిన్ కాకుండా ముందు చట్నీయే ఖాళీ అయిపోతుందంటే నమ్మండి.





