Photo:కాలం చెరిపేయలేని ఓ తండ్రి జ్ఞాపకం.. మూడు తరాలను కలిపిన ఒకే ఒక్క ఫోటో..
Photo: తన తండ్రిని తలచుకుంటూ, ఆయన వారసత్వాన్ని తన బిడ్డకు కూడా పరిచయం చేయాలని అనుకుంటూ ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.
Photo
ప్రేమకు, ఇష్టానికి మరణం ఉండదు. వాటి తాలూకా జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. దీనిని నిరూపించేలా హృదయాన్ని కదిలించే ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. విధి ఆడిన నాటకంలో తండ్రిని కోల్పోయిన ఓ కొడుకు, దశాబ్దాల తర్వాత అతని తండ్రికి ఇచ్చిన అపురూపమైన నివాళి అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ ఫోటో(Photo) వెనుకున్న స్టోరీని చూస్తే.. చాలా ఏళ్ల క్రితం తీసిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఒక తండ్రి తన మూడు నెలల పసిబిడ్డను భుజం మీద బజ్జో పెట్టి, ఎంతో ప్రశాంతంగా వార్తాపత్రిక చదువుతున్నట్లుగా ఉంది. ఆ ఫోటో చూడటానికి చాలా సాదాసీదాగా అనిపించినా, అందులో తండ్రీకొడుకుల మధ్య ఉన్న స్వచ్ఛమైన అనుబంధాన్ని విధి విడదీయడంతో అంత స్పెషల్‌గా మారింది. ఆ ఫోటో తీసిన కొన్ని వారాలకే ఆ తండ్రి ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడమే ఎంతో మందిని కదిలిస్తోంది.

కాలం గడిచింది.. ఆ పసిబిడ్డ పెరిగి పెద్దవాడయ్యి తానూ ఒక తండ్రి అయ్యాడు. అప్పుడే అతడికి తన తండ్రి జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. తన తండ్రిని తలచుకుంటూ, ఆయన వారసత్వాన్ని తన బిడ్డకు కూడా పరిచయం చేయాలని అనుకుంటూ ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన తండ్రి ఆ ఫోటోలో ఏ పోజ్‌లో కూర్చున్నారో, ఎలాంటి డ్రెస్ ధరించారో, సరిగ్గా అదే సెట్టింగ్‌ను, సీన్‌ను మళ్లీ రీక్రియేట్ చేశాడు. తన మూడు నెలల కొడుకును భుజాన పడుకోబెట్టుకుని , సరిగ్గా తన తండ్రిలాగే ఫోటో దిగాడు.
అలా తన తండ్రి, బిడ్డ, తానూ దిగిన ఆ ఫోటో(Photo)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి..అది అమెరికా, యూకే సహా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కదిలించింది. గతాన్ని, వర్తమానాన్ని ఒకే ఫ్రేమ్‌లో చూస్తున్నట్లు ఉన్న ఈ దృశ్యంలో ఆ ఇద్దరి తండ్రుల మధ్య పోలికలు నెటిజన్ల హృదయాన్ని తాకాయి. పెద్దయ్యాక తన తండ్రిని చూడలేకపోయినా, ఈ ఫోటో ద్వారా తండ్రి ప్రేమను ఆ కొడుకు తిరిగి పొందాడు. అదే సమయంలో తన బిడ్డకు ఒక గొప్ప వారసత్వాన్ని బహుమతిగా ఇచ్చాడు.





