Comfort Zone
మనందరం కూడా ఒక సురక్షితమైన ప్రపంచంలోనే ఉండటానికి అలవాటు పడిపోయాం. రోజువారీగా చేసే పనులు, చుట్టూ మనకు తెలిసిన వ్యక్తులు, ఎప్పటి నుంచో మనకు అలవాటైన వాతావరణం.. ఇవన్నీ కలిపి మనకు తెలీకుండానే మనల్ని ఒక రకమైన భద్రతా భావంలో ఉంచుతాయి. దీనినే సైకాలజీలో కంఫర్ట్ జోన్ (Comfort Zone) అంటారు.
నిజానికి ఈ కంఫర్ట్ జోన్‌లో(Comfort Zone) ఉంటే భయం ఉండదు, ఒత్తిడి అసలే ఉండదు. అంతా మనకు తెలిసినట్లే, మనకు అనుకూలంగా జరుగుతుంది కాబట్టి చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ, ఇక్కడే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని సైకాలజీ చెబుతోంది. అదేంటంటే ఈ కంఫర్ట్ జోన్(Comfort Zone) అనేది మన ఎదుగుదలని ఆపేసే ఒక మత్తు మందు వంటిది.
దీనికి చిన్న ఉదాహరణగా విత్తనం గురించి చెప్పుకోవచ్చు. నేల లోపల విత్తనం చీకటిలో ఉన్నప్పుడు చాలా సురక్షితంగా ఉంటుంది. కానీ అది అక్కడే అలాగే ఉండిపోతే ఎప్పటికీ కూడా ఒక మహా వృక్షం కాలేదు. అది మట్టిని చీల్చుకుని, బయటకు వచ్చి ఎండను, వానను తట్టుకుని నిలబడితేనే దానికి ఒక గుర్తింపు ఉంటుంది. అచ్చంగా ప్రతీ ఒక్కరి జీవితం కూడా అంతే.
అయితే చాలామంది తమ కంఫర్ట్ జోన్(Comfort Zone) నుంచి బయటకు రాలేరు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం భయం అని సైకాలజిస్టులు అంటారు. కొత్త పని మొదలుపెడితే ఎక్కడ ఓడిపోతామో, నలుగురూ చూసి నవ్వుతారేమో, ఆ పని మనం చేయలేమేమోననే ఆందోళన వెనక్కి లాగుతుంది. ఎందుకంటే మన మెదడు ఎప్పుడూ సురక్షితంగా ఉండటానికే మొదటి ప్రాధాన్యత ఇస్తుందట.
అందుకే ఏదైనా కొత్త ప్రయత్నం చేయడానికి రెడీ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇది అవసరమా, ఉన్నదానితో తృప్తి పడొచ్చు కదా అని మనల్ని ఆపేస్తుంది. కానీ నిజం ఏంటంటే, ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన వారందరూ తమకు అప్పటివరకూ అలవాటైన ప్రపంచాన్ని వదిలి, తెలియని కొత్త దారిలో ప్రయాణించిన వారే. ఇంకా చెప్పాలంటే రిస్క్ లేని చోట ఎదుగుదల ఉండదన్న విషయం తెలుసుకోవాలి. అంతేకాదు ఎంత కాలమయితే మనకు తెలిసిన పరిధిలో కంఫర్ట్ జోన్‌లో ఉంటామో, అంత కాలం కూడా మనలోని అసలైన శక్తి మనకే తెలియకుండానే పోతుంది.
నిజం చెప్పాలంటే కంఫర్ట్ జోన్‌లో ఉండటం వల్ల మన క్రియేటివిటీ చనిపోతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఇంట్రస్ట్ అసలే తగ్గిపోతుంది. ఒకే రకమైన పనులే ఎప్పుడూ చేస్తూ ఉంటే మెదడు మొద్దుబారిపోతుంది. అదే మనం ఒక కొత్త సవాలును స్వీకరించినప్పుడు, మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది, కొత్త దారులను వెతుకుతుంది.
రిస్క్ తీసుకున్నప్పుడు ఓటమి ఎదురైనా సరే, అది జీవితంలో ఎదగడానికి ఒక పాఠంగా మారుతుంది. గెలిస్తే చరిత్ర సృష్టిస్తాం, ఓడితే అనుభవాన్ని సంపాదించుకుంటాం. కానీ రిస్క్ తీసుకోకుండా కంఫర్ట్ జోన్‌లో ఉండిపోతే మాత్రం ఏమీ మిగలదు. మనలో సామర్థ్యం ఏంటో మనకు పూర్తిగా తెలియాలంటే, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. సముద్రపు ఒడ్డున కూర్చుంటే అలల అందం మాత్రమే కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తేనే కదా ముత్యాలు దొరికేది అన్న ఆలోచన మనమందరం పెంచుకుంటే చాలు .
అయితే కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం ఎలా అన్న ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది. దీనికోసం ఎవరూ కూడా ఒకేసారి పెద్దపెద్ద సాహసాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ మనం చేసే పనుల్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోవాలి. తెలియని ఒక కొత్త విషయాన్ని చదవడం, భయం అనిపించే వ్యక్తితో మాట్లాడటం, మనకు ఏ మాత్రం టచ్ లేని చిన్న చిన్న పనులను నేర్చుకోవడం వంటివి స్టార్ట్ చేయాలి. ఇలా చిన్న చిన్న అడుగులు వేస్తూ పోతే, మనలోని భయం పోయి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది.
అయితే అద్భుతాలన్నీ కంఫర్ట్ జోన్‌కు అవతలే జరుగుతాయన్న విషయాన్ని ఒకటే గుర్తుంచుకోండి. ఈ రోజు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నారో, ఎవరూ ఊహించని ఎత్తుకు వెళ్లాలనుకుంటున్నారో అనేది కేవలం మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు. అందుకే ఇప్పుడే కంఫర్ట్ జోన్‌కు బై చెప్పేసి అద్భుతాలు సృష్టించడానికి రెడీ అవండి.
