Thieves : నమ్మితే నట్టేట ముంచేస్తున్నారా? బంధువుల్లో, స్నేహితులలో దొంగలు ఎందుకు ఉంటారు?
Thieves : మన ఇంట్లో ఏదైనా పార్టీనో, ఫంక్షనో చేయాలనుకున్నప్పుడు, మనకు బాగా దగ్గర బంధువులను, స్నేహితులను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానిస్తాం
Thieves
మన ఇంట్లో ఏదైనా పార్టీనో, ఫంక్షనో చేయాలనుకున్నప్పుడు, మనకు బాగా దగ్గర బంధువులను, స్నేహితులను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానిస్తాం. మన మధ్య ఉన్న ప్రేమ, అనురాగాలకు గుర్తుగా వారిని పిలవడమే కాకుండా.. మన కుటుంసభ్యుడిలా చూసుకుంటాం. అయితే కొన్ని సార్లు మనం ప్రాణప్రదంగా నమ్మిన వారే మన కళ్లు గప్పి విలువైన వస్తువులను , డబ్బులను మాయం చేసినప్పుడు కలిగే బాధ మాటల్లో చెప్పలేం. మనవాళ్లే కదా అని మనం చూపించిన ఆ నమ్మకాన్ని వారు తమ స్వార్థం కోసం వాడుకుని నమ్మకం మీదే నమ్మకం లేకుండా చేసేస్తున్నారు.
కేవలం పేదరికం,అవసరం ఉన్నవారే దొంగతనం(Thieves) చేస్తారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, సొసైటీలో మంచి హోదాలో ఉండి, ఆర్థికంగా స్థిరపడిన వారు కూడా ఇలాంటి పనులను చేయడం వెనుక అసూయ ,అదుపులేని కోరికలు ఉంటాయని సైకాలజిస్టులు అంటున్నారు. ఎదుటివారి ఎదుగుదలని చూసి ఓర్వలేకపోవడంతో పాటు, వారి సంతోషాన్ని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలనే వింతైన ఆలోచనే వారిని ఇలా సన్నిహితులు, బంధువుల ఇంట్లో దొంగతనం చేసేలా ప్రేరేపిస్తుందట.
ఇలాంటి వారు ..వీరి దగ్గర చాలా ఉంది కదా, నేను కొంచెం తీసుకుంటే వీరికి ఏమీ కాదని తమ మనసుని తామే మోసం(Thieves) చేసుకుంటారట. అంతేకాదు వీరు కేవలం ధనం మీద ఆశతోనే కాదు, అవతలి వారి మానసిక ప్రశాంతతను చెడగొట్టాలనే ఒక రకమైన పైశాచిక ఆలోచనతో కూడా ఇలా చేస్తారు.
కొంతమంది అయితే అవసరానికి మించి డబ్బు ఉన్నా కూడా దొంగతనం చేస్తారు. దీనిని సైకాలజీలో క్లెప్టోమేనియా (Kleptomania) ఒక రకమైన మానసిక జబ్బుగా పరిగణిస్తారు. వీరికి ఆ వస్తువు అవసరం కానీ డబ్బు అవసరం కానీ ఏమీ ఉండదు, కానీ దానిని దొంగతనం చేసినపుడు కలిగే ఒక రకమైన థ్రిల్ కోసం వారు అలా చేస్తారు.
అయితే ఇలా బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఇలాంటి పనులు చేసేవారు ఒక విషయాన్ని మాత్రం మర్చిపోతుంటారు. వారు దొంగిలించే ఆ కొద్దిపాటి డబ్బులు, లేదా బంగారు వస్తువులు వారి జీవితాన్ని అద్భుతంగా ఏమీ మార్చేయవు. కానీ, ఒక్కసారి కానీ ఆ విషయం బయటపడితే.. అది కేవలం ఆ వ్యక్తికే కాదు, వారి కుటుంబానికి, పిల్లలకు కూడా మాయని మచ్చను మిగులుస్తుంది.
పదిమందిలో గౌరవంగా తిరిగే వ్యక్తి, ఒక్క చిన్న పొరపాటు వల్ల నమ్మకద్రోహిగా, దొంగగా ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వారు ఎన్ని కోట్లు సంపాదించినా, పోగొట్టుకున్న ఆ పరువును, నమ్మకాన్ని మాత్రం తిరిగి పొందలేరన్న విషయాన్ని మర్చిపోతుంటారు. బంధువులందరూ వారిని మరో ఫంక్షన్లో అనుమానంగా చూస్తున్నప్పుడు బతకడమనేది నరకం కంటే దారుణంగా ఉంటుంది.

మన ఎదుగుదల ఎప్పుడూ మన కష్టంతో రావాలి తప్ప, పక్కవారి సొమ్ముతో కాదన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. బంధుత్వాలు, స్నేహాలు అనేవి నమ్మకం అనే పునాది మీదే నిలబడతాయి. ఆ పునాదిని మనమే కూల్చేస్తే ఆ తర్వాత మనకు కష్టం వచ్చినప్పుడు మన పక్కన నిలబడేవారు ఒక్కరూ ఉండరు.
ఒకరి ఐశ్వర్యాన్ని చూసి ఈర్ష్య పడటం, జెలసీగా ఫీలవడం మానేసి, ఉన్నదానిలో తృప్తిగా బతకడం నేర్చుకోవాలి. కర్మ ఎవరినీ వదలదు.
ఈరోజు ఎదుట వారి దగ్గర ఎంతయితే దోచుకున్నామో..అంతకు పది రెట్లు కోల్పోవాల్సిన రోజు వస్తుంది. అందుకే ఏ రోజైనా సరే మన కష్టార్జితమే శాశ్వతమైన ఆనందాన్నిస్తుందన్నది కలలో కూడా మర్చిపోకూడదు. ఎదుటివారి కష్టాన్ని గౌరవించడంతో పాటు, బంధాలను ప్రాణప్రదంగా కాపాడుకోవడమనే సంస్కారాన్ని కాపాడుకోవాలి.





