5 States Elections : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్..బెంగాల్,తమిళనాడుపై భారీగా పందాలు
5 States Elections : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమి, ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పార్టీలు అన్ని చోట్లా గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నించాయి
5 States Elections
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల(5 States Elections) ఫలితాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమి, ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పార్టీలు అన్ని చోట్లా గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నించాయి. ఓటింగ్ శాతం కూడా గతం కంటే ఎక్కువగా భారీస్థాయిలో నమోదవడంతో అన్ని పార్టీలకు టెన్షన్ మామూలుగా లేదు.
అటు ఎగ్జిట్ పోల్స్ సైతం కొన్ని రాష్ట్రాల్లో ఫలితాలు బాగానే అంచనా వేసినా తమిళనాడు, బెంగాల్ పై భిన్నమైన ఫలితాలను వెల్లడించాయి. ముఖ్యంగా బెంగాల్ లో ఈసారి మమతా బెనర్జీకి షాక్ తప్పదన్న ప్రచారం ఉత్కంఠను తారాస్థాయికి చేర్చింది. అటు తమిళనాడులో డీఏంకే అధికారం నిలబెట్టుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినా, ఒకట్రెండు సర్వేలు మాత్రం నటుడు విజయ్ టీవీకే పార్టీ గెలుస్తుందంటున్నాయి.
దీంతో అందరి చూపు ఇప్పుడు సోమవారం తేలే ఫలితాలపైనే నెలకొంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల(5 States Elections) ఫలితాలపై బెట్టింగ్ మార్కెట్లు జోరందుకున్నాయి. బెట్టింగ్ రాయుళ్ళు భారీగా పందాలు కాస్తున్నారు. కొందరు తమ అభిమాన పార్టీల మీద పందాలు కాస్తుంటే మరికొందరు మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఆధారంగా చేసుకుని బెట్టింగ్ కు సిద్ధమయ్యారు. దీంతో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతోంది. దేశంలో బెట్టింగ్ , గ్యాంబ్లింగ్ లపై నిషేధం ఉన్నా వాట్సాప్ , టెలిగ్రామ్ వంటి వాటిలో గ్రూపులు క్రియేట్ చేసి పందాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు వీటిపై దృష్టి సారించే లోపు తమ పని కానిచ్చేస్తున్నారు.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అందరినీ ఉత్కంఠకు గురి చేస్తున్నవి రెండే. అవే బెంగాల్ ఇంకా తమిళనాడు. ముఖ్యంగా బెంగాల్ లో తిరుగులేని నేతగా పేరున్న మమతా బెనర్జీకి ఈ సారి ఓటమి తప్పదన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని ఎగ్టిట్ పోల్స్ బీజేపీకి విజయాన్ని కట్టబెట్టేశాయి. మమత మాత్రం తన విజయంపై ధీమాగా ఉన్నారు.

దీంతో బెంగాల్ లో ఎవరు గెలుస్తారన్న దానిపై కొన్ని ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్ళు బెంగాల్ పై భారీగా పందాలు కాస్తున్నారు. మమతా బెనర్జీ టీఏంసీ గెలుస్తుందని ఒకటికి రెండు, బీజేపీకి గెలుస్తుందని ఒకటికి రెండు చొప్పున పందాలు జరుగుతున్నాయి. అటు తమిళనాడులో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
కొన్ని సర్వేలు డీఏంకే అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చెబుతున్నా నటుడు విజయ్ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో తమిళనాడులో విజయ్ పార్టీ గెలుస్తుందని పందాలు జోరుగా సాగుతున్నాయి. విజయ్ పార్టీపై ఒకటికి మూడు రెట్లు మొత్తం ఆఫర్ చేస్తున్నారు. అటు డీఎంకేపై ఒకటికి ఒకటి చొప్పున పందాలు కాస్తున్నారు. ఏదేమైనా ఈ ఉత్కంఠకు సోమవారం ఉదయం 10 గంటలకల్లా తెరపడనుంది.
Photo:కాలం చెరిపేయలేని ఓ తండ్రి జ్ఞాపకం.. మూడు తరాలను కలిపిన ఒకే ఒక్క ఫోటో..





