Abhishek Banerjee : గంటలో రాజీనామా చేస్తా ..రెబల్స్‌కు మమత మేనల్లుడు సవాల్
Abhishek Banerjee : తనపై వస్తున్న విమర్శలకు అభిషేక్ బెనర్జీ స్పందించారు. వారికి కౌంటర్ ఇస్తూ సవాల్ విసిరారు.
Abhishek Banerjee
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎదురైన ఘోరపరాభవం ఇప్పటికీ ఆమె అనుచరులకు మింగుడుపడడం లేదు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు దీదీ ఓటమికి చాలా కారణాలున్నాయి. కానీ ఎక్కువ మంది టీఎంసీ నేతలు, కార్యకర్తలు మాత్రం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీనే కారణమంటూ చాలా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
అభిషేక్ తీరుతో విసిగిపోయిన కీలక నేతలు పార్టీని వీడిపోయారు. వారిలో ప్రస్తుత బెంగాల్ సీఎం సువేందు అధికారి సైతం ఉన్నారు. కానీ అప్పట్లో దీదీ మేనల్లుడిని వెనకేసుకొచ్చారు. కిందిస్థాయి నేతలు, కార్యకర్తల మాటలను ఆమె నమ్మలేదు. పార్టీ నుంచి వెళ్లిపోయిన చాలా మంది ఇటీవల చాలా సందర్భాల్లో అభిషేక్ బెనర్జీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
తాజాగా తనపై వస్తున్న ఈ విమర్శలకు అభిషేక్ బెనర్జీ స్పందించారు. వారికి కౌంటర్ ఇస్తూ సవాల్ విసిరారు. పార్టీని వదిలిపెట్టి తనను నిందిస్తున్న వారంతా తిరిగి దీదీ దగ్గరకు రావాలని కోరారు. అలా వారు తిరిగొస్తే గంటలోపే తాను పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే వెళ్లిపోయిన వారిలో ఒక్కరు కూడా అలా చేయరని, తిరిగి రారని కూడా అభిషేక్ తేల్చి చెప్పారు.
టీఎంసీ రెబల్స్‌తో బీజేపీ ఒప్పందం కుదుర్చుకుందనీ, పార్టీని వీడడంతో పాటు ఈడీ, సీబీఐ వంటి సంస్థల బారి నుంచి రక్షణ పొందడమే ఈ ఒప్పందంలో కీలక ఘట్టమన్నారు. ఎలాగూ పార్టీ నుంచి వెళ్లిపోయారు కాబట్టి ప్రతీరోజూ దీదీ లేదా తనపై విమర్శలు చేయడమే వారు అజెండాగా మార్చుకున్నారంటూ విమర్శించారు. ఈ రెబల్ నేతల బెదిరింపులకు తాను భయపడనంటూ వ్యాఖ్యానించారు.
మరోవైపు రెబల్ నేతలు మాత్రం అభిషేక్ వాదనను కొట్టిపారేస్తున్నారు. అభిషేక్ బెనర్జీ వ్యవహరించిన తీరు టీఎంసీలో చిన్నస్థాయి కార్యకర్తకు కూడా తెలుసంటున్నారు. మమతా బెనర్జీని కలవకుండా, ఈ విషయాలు ఏవీ ఆమెకు చేరకుండా చేయడంలో అభిషేక్ కీలకంగా వ్యవహరించాడంటూ గుర్తు చేసారు.

ఐ-ప్యాక్ సంస్థతో కలిసి అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) చేసిన వ్యూహాలు, డబ్బు ప్రభావంతో టిక్కెట్ల పంపిణీ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఇది క్షేత్రస్థాయి కార్యకర్తలను, సీనియర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎన్నికల ఓటమి తర్వాత రితబ్రత బెనర్జీ నేతృత్వంలో దాదాపు 60 మందికి పైగా ఎమ్మెల్యేలు, 20 మంది లోక్‌సభ ఎంపీలు మమతా బెనర్జీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు.
టీఎంసీ ఓటమికి కేవలం ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయలేకపోయినా సరే, పార్టీలో వారసత్వ పగ్గాలు చేపట్టేటపుడు అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) అనుసరించిన కార్పొరేట్ శైలి వ్యూహాలు, పార్టీ సీనియర్లలో వచ్చిన అసంతృప్తి టీఎంసీ పతనానికి దారితీశాయని విశ్లేషకులు అంచనా వేశారు.
Trump : ట్రంప్ ఫ్యామిలీ శవపేటికలతో బ్యానర్..బ్లడ్ ఫర్ బ్లడ్ అంటూ ఇరాన్ మరోసారి వార్నింగ్





