Vijay :విజయ్‌కు పెరుగుతున్న మద్దతు.. గవర్నర్ తీరుపై సెలబ్రెటీల ఫైర్
Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏకంగా 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే పార్టీ, మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరంలో మాత్రమే ఉంది.
Vijay
తమిళనాడు రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న ఉత్కంఠభరిత పరిస్థితులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకున్న తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్(Vijay )కు.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ నుంచి వరుస ఆటంకాలు ఎదురవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది.
దీనిపై ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు ద్వారా ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసేలా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు వ్యవహరించడం అసలు సరైంది కాదంటూ అటు రాజకీయ వర్గాలు, ఇటు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏకంగా 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే పార్టీ, మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరంలో మాత్రమే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ అండతో విజయ్ బలం మెజారిటీ మార్కును దాటినా కూడా.. సంపూర్ణ మెజారిటీ లేదనే సాకుతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఈ నిర్ణయం పట్ల సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ప్రజా మద్దతు లభించిన విజయ్‌కు తనకున్న బలాన్ని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకునే అవకాశాన్ని ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పుకొచ్చారు.
మరోవైపు హీరో విశాల్ కూడా దీనిపై రియాక్ట్ అవుతూ గతంలో జరిగిన కొన్ని ఉదంతాలను గుర్తు చేశారు. గోవా, కర్ణాటక, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన పార్టీకి.. ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాన్ని ఇచ్చి, ఆ తర్వాత సభలో మెజారిటీ నిరూపించుకోమని అడిగిన సంప్రదాయాన్ని తమిళనాడులో ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు.

తమిళనాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పిన విశాల్.. తమకు గవర్నర్ పాలన కంటే తాము ఎన్నుకున్న ప్రభుత్వం కావాలని వారు కోరుకుంటున్నారని విశాల్ అన్నారు. విజయ్‌కు ఒక ఓటరుగా తన మద్దతును ఇస్తున్నానని, ఆయన తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కూడా గవర్నర్ నిర్ణయం అప్రజాస్వామికమని మండిపడింది. ప్రజల తీర్పును కాలరాసే ఇలాంటి అధికారం ఎవరికీ లేదని, మెజారిటీ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏర్పాటుకు సహకరించాల్సిన బాధ్యత గవర్నర్‌పైన ఉందని గుర్తు చేసింది. మొత్తానికి విజయ్‌కు మద్దతుగా వస్తున్న మద్దతుతో తమిళనాడులో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరుగుతోంది.
Salt:సాయంత్రం పూట ఉప్పు కొంటున్నారా? ఉప్పుతో వాస్తు చిట్కాలు





