Just NationalLatest News

Medical Shops : దేశవ్యాప్తంగా మూతపడిన లక్షలాది మెడికల్ షాపులు..సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేనా!

Medical Shops : దాదాపు 12 లక్షల మందికి పైగా కెమిస్టులు, ఫార్మసీలు, డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ 24 గంటల సమ్మెలో పాల్గొంటున్నారు

Medical Shops

ఆన్‌లైన్‌లో మందులు అమ్మడంపై మెడికల్ షాపుల(Medical Shops )యజమానుల కోపం మే 20న పెద్ద బంద్‌కు దారితీసింది. ఇంటర్నెట్ యాప్‌ల ద్వారా మందులను డైరెక్టుగా ఇళ్లకు డెలివరీ చేయడాన్ని తప్పుబడుతూ కెమిస్టుల సంఘం ఇచ్చిన పిలుపుతో.. దేశవ్యాప్తంగా ఏకంగా 12 లక్షలకు పైగా మందుల దుకాణాలు ఈరోజు మూతపడ్డాయి.

ఒక్క తెలంగాణలోనే 25 వేలకు పైగా చిన్న, పెద్ద మెడికల్ షాపులు( Medical Shops) ఈ నిరసనలో పాల్గొనగా, అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 12 వేలకు పైగా మెడికల్ షాపులు షట్టర్లు దించేశాయి. పెద్ద పెద్ద ఆసుపత్రుల లోపల ఉండే మందుల షాపులకు మినహాయింపు ఇచ్చినా, గల్లీల్లో ఉండే షాపులన్నీ మూతపడటంతో రోజూ మందులు వాడే రోగులు, ముసలివాళ్లు, ఎమెర్జన్సీ కోసం మందులు కొనాల్సిన సామాన్యులు తెగ ఇబ్బంది పడుతున్నారు.

ఈ బంద్ కేవలం ఒక్కరోజుతో ముగిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నా, దీని వెనుక చాలా ఏళ్లుగా సాగుతున్న ఒక పెద్ద జీవనోపాధి సమస్య దాగి ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఈ గొడవకు అసలు కారణం ఏంటనే విషయాన్ని ఒకసారి చూస్తే.. ఆన్‌లైన్ మెడికల్ కంపెనీలు ఇస్తున్న భారీ ఆఫర్లు , డిస్కౌంట్లే.

పెద్ద పెద్ద యాప్‌లలో కస్టమర్లను ఆకర్షించడం కోసం మెడిసిన్ కాస్ట్‌పై 40 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నాయి. ఇంత తక్కువ ధరకు ఊర్లలో, గల్లీల్లో ఉండే చిన్న మెడికల్ షాపుల(Medical Shops )వాళ్లు మందులను అస్సలు అమ్మలేరు. ఎందుకంటే వాళ్లు రెంట్లు కట్టుకుని, తక్కువ లాభాలు వచ్చినా చాలు అనుకుని, చుట్టుపక్కల ఉండే జనాన్ని నమ్ముకుని బతుకుతుంటారు.

అయితే ఇప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీల డిస్కౌంట్ పోటీని తట్టుకోలేక చిన్న షాపుల వాళ్లు తమ బిజినెస్ సాగించలేక నష్టపోతున్నారు. కేవలం వ్యాపార నష్టాలే కాదు.. ఆన్‌లైన్‌లో కొన్నప్పుడు డాక్టర్ రాసిచ్చిన చీటీ (ప్రిస్క్రిప్షన్) సరిగ్గా లేకపోయినా కొన్ని రకాల డేంజరస్ మందులు, మత్తు ఇచ్చే టాబ్లెట్లు దొరుకుతున్నాయి. , ఇది జనాల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని సామాన్యులు కూడా ఆందోళన చెందుతున్నారు.

కాగా ఇలా ఆన్‌లైన్ అమ్మకాలకు వ్యతిరేకంగా మెడికల్ షాపుల ( Medical Shops) వాళ్లు రోడ్లపైకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2015, 2016, 2017 సంవత్సరాలలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పెద్ద పెద్ద బంద్‌లు జరిగి.. షాపులన్నీ మూతబడ్డాయి.

అప్పట్లో ఇంటర్నెట్ ద్వారా మందులు అమ్మడం చట్ట విరుద్ధమని వ్యాపారులు కోర్టులకు కూడా వెళ్లారు. ఆ సమయంలో ప్రభుత్వ అధికారులు ఆన్‌లైన్ అమ్మకాలను కంట్రోల్ చేస్తామని, గట్టి నిఘా పెడతామని మాట ఇచ్చి ఆ బంద్‌లను విరమింపజేశారు. కానీ రోజులు గడిచేకొద్దీ ఆన్‌లైన్ మెడికల్ బిజినెస్ ఇంకా పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. వీరి సమస్యకు ప్రభుత్వాలు శాశ్వతమైన పరిష్కారం చూపించకపోవడం వల్లే, మళ్లీ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మెకు దిగారు.

ఈ సడన్ బంద్ వల్ల పేషెంట్లకు మందుల కొరత రాకుండా తెలంగాణ సర్కార్ ముందుగానే అలర్ట్ అయింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులతో మాట్లాడి, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో ఉండే మెడికల్ షాపులను బుధవారం రోజంతా 24 గంటల పాటు తెరిచి ఉంచాలని ఆర్డర్ వేశారు.

అక్కడ పని చేసే ఫార్మసిస్టులంతా డ్యూటీలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే డ్రగ్ కంట్రోల్ విభాగం కూడా జనం సాయం కోసం 1800 599 6969 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అర్జంటుగా మెడిసిన్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవడానికి, ఏ జిల్లాలోనైనా ఇబ్బంది వస్తే స్థానిక డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను సంప్రదించడానికి అధికారుల ఫోన్ నంబర్లను కూడా నెట్‌లో అందుబాటులో పెట్టారు.

రెండు తెలుగు రాష్ట్రాల పరంగా చూస్తే ఈ బంద్ ప్రభావం టౌన్లలో, సిటీల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ లాంటి నగరాల్లో ప్రైవేట్ మెడికల్ దుకాణాలు అన్నీ క్లోజ్ అయిపోయాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా సుమారు 40 వేల మందికి పైగా కెమిస్టులు ఈ సమ్మెకు సపోర్ట్ చేయడంతో విజయవాడ, వైజాగ్, గుంటూరు లాంటి పెద్ద టౌన్లలో మెడిసిన్ దొరకడం ఆలస్యమవుతోంది.

కాగా పల్లెటూళ్లలో ప్రభుత్వ ఆసుపత్రులు, చిన్న ప్రైవేట్ క్లినిక్‌లు తెరిచి ఉండటం వల్ల గ్రామాల్లో ఉండే జనానికి కొంతవరకు ఊరట లభించినట్లు అయింది. సిటీల్లో ఉండే సామాన్యులు మాత్రం బీపీ, షుగర్ లాంటి రెగ్యులర్ మెడిసిన్స్ కోసం కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తోంది.

Medical Shops
Medical Shops

ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే.. టెక్నాలజీని పూర్తిగా వద్దు అనడం ఎవరి ఉద్దేశం కాదు, కానీ దానిని పద్ధతిగా ఎలా కంట్రోల్ చేయాలనేదే చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ముసలివాళ్లకు, నడవలేని పేషెంట్లకు ఆన్‌లైన్ ద్వారా ఇళ్లకు మందులు రావడం ఎంతో హెల్ప్ అవుతుందనేది నిజం.

కానీ అదే సమయంలో సరైన రూల్స్ లేకపోతే మాత్రం నకిలీ మెడిసిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ప్రాణాలకే ముప్పు వస్తుంది. మందులు ఎప్పుడైనా సరే జనానికి నమ్మకంగా, మంచి క్వాలిటీతో అందాలి. ఈ ఒక్కరోజు బంద్ ముగిసాక, భవిష్యత్తులో చిన్న దుకాణాల బతుకులను కాపాడుతూనే, ఆన్‌లైన్ మందుల రంగంలో రోగుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యాపార సంఘాలు కూర్చుని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి.

Edge Computing : క్లౌడ్ కంప్యూటింగ్ తెలుసు.. మరి ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఏంటి?

Related Articles

Back to top button