NEET Exam
ఇటీవలి కాలంలో నీట్ ఎగ్జామ్స్(NEET Exam) పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత దుమారాన్ని రేపిందో అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వ తీరుపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో పలు అనుభవాలు ఎదురైనా వాటి నుంచి గుణపాఠం నేర్చుకోలేదనీ, పేపర్లు లీక్ అవుతూనే ఉన్నాయంటూ విశ్లేషకులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు భారీ ఊరట లభించింది.
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం జాతీయ పరీక్షల సంస్థ (ఎన్ టీఏ) విద్యార్థులకు అనుకూలమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. జూన్ 21న ఈ రీ ఎగ్జామ్ జరగనుంది. పరీక్ష సమయంలో అభ్యర్థులకు 15 నిమిషాల అదనపు సమయాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే రఫ్ వర్క్ చేసుకునేందుకు మరిన్ని పేజీలను అందుబాటులోకి తెచ్చింది.
ప్రశ్నాపత్రం బుక్‌లెట్ లేఅవుట్‌లోనూ అనేక మార్పులు చేసింది. తాజాగా విడుదల చేసిన నోటీసులో పలు కీలక విషయాలను వెల్లడించింది. పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచుతున్నట్లు తెలిపింది.
పరీక్షా కేంద్రంలో అటెండెన్స్ మార్కింగ్, ఇన్విజిలేషన్ ఫార్మాలిటీస్ వంటి పనుల కారణంగా విద్యార్థుల సమయం వృథా కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 15 నిమిషాల అదనపు సమయం పెంచడం ద్వారా విద్యార్థులు పూర్తి సమయాన్ని సమాధానాలు రాయడానికే ఉపయోగించుకునే వీలు కలుగుతుంది.
మ్యాథ్స్, డయాగ్రామ్స్ గీసుకోవడానికి వీలుగా ప్రశ్నాపత్రంలో రఫ్ వర్క్ స్థలాన్ని ఎన్టీఏ పెంచింది. గతంలో రెండు పేజీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు వాటిని నాలుగుకు పెంచింది. అయితే దీనిలో మరో కీలక మార్పును కూాడా చేశారు. గతంలో రఫ్ పేజీలు బుక్‌లెట్ చివరన మాత్రమే ఉండేవి. దీనివల్ల ఎడమచేతి వాటం ఉన్న అభ్యర్థులకు కొంత ఇబ్బంది ఎదురవుతోందని అభిప్రాయం వ్యక్తమైంది.
దీంతో రెండు రఫ్ పేజీలను బుక్ లెట్ ప్రారంభంలో ఉంచగా.. మిగిలిన రెండు పేజీలను చివర్లో కేటాయించారు. ఇదిలా ఉంటే మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో(NEET Exam) పేపర్ లీక్ ఆరోపణలు రావడం తీవ్ర దుమారాన్ని రేపింది. అలాగే నీట్ పరీక్ష(NEET Exam) జరగడానికి రెండు రోజుల ముందు కొందరు అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు ప్రశ్నపత్రాలు చేరినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సందర్భంగా పరీక్షను రద్దు చేసి, జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించేందుకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Obesity : తల్లుల నుంచే కూతుర్లకు ఒబెసిటీ..జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ షాకింగ్ రిపోర్ట్
