Just NationalJust PoliticalLatest News

Sonia – Anna Lezhneva : ఇది ఇద్దరు పొలిటికల్ బ్రైడ్స్ అంతరంగం.. అన్నా ,సోనియా జీవితం ఎవరికి గుణపాఠం..

Sonia - Anna Lezhneva : స్త్రీ ఎవరి కోసమో త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒక స్వతంత్ర వ్యక్తి (Individual). అభిప్రాయాలు కలవకపోతే, తనకంటూ ఒక స్పేస్ లేకపోతే.. ఎంతటి మహా వృక్షం నీడ నుంచైనా సరే, ప్రేమగా, హుందాగా తప్పుకోవడమే సరైన నిర్ణయం.

Sonia – Anna Lezhneva

ది పర్సనల్ ఈజ్ పొలిటికల్ అంటూ దశాబ్దాల క్రితమే గొంతు పెకిలించిన నినాదం గుర్తొచ్చి నా ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది. ప్రజా జీవితంలో ఉన్న భర్తల నీడలో కరిగిపోయిన వ్యక్తిగత జీవితాల తాలూకు అంతులేని శూన్యతను ఎత్తి చూపడమే నా మాటల ముఖ్య ఉద్దేశం.

సప్త సముద్రాలు దాటి, పుట్టిన గడ్డను, కన్నవారిని వదిలి, ప్రేమించిన వాడి చిటికెన వేలు పట్టుకుని నడిచి వచ్చిన ఇద్దరు విదేశీ వనితలు.. భారతీయ రాజకీయ కురుక్షేత్రంలో నిలబడ్డారు. ఒకరు ఇటలీ ఆడపడుచు సోనియా గాంధీ, మరొకరు రష్యా అమ్మాయి అన్నా లెజినోవా(Sonia – Anna Lezhneva)! కాలాలు వేరు, ప్రాంతాలు వేరు.. కానీ వారిద్దరి గుండెల్లో రగిలిన వేదన ఒక్కటే! ప్రజా జీవితంలో ఉన్న భర్తల నీడలో కరిగిపోయిన వ్యక్తిగత జీవితాల తాలూకు అంతులేని శూన్యత అది.

అయితే, ఆ శూన్యాన్ని సోనియా తన కన్నీళ్లతో నింపుకుని ‘త్యాగమూర్తి’గా మిగిలిపోతే, అన్నా లెజినోవా(Sonia – Anna Lezhneva) మాత్రం ఆ శూన్యాన్ని బద్దలుకొట్టి తన ‘స్వయం నిర్ణయాధికారాన్ని’ ప్రకటించుకున్నారు. నేటి ఆధునిక సమాజానికి అసలైన ప్రశ్న ఇక్కడే పుడుతుంది. మనకు కావాల్సింది కన్నీటిని దిగమింగే సోనియాలా? లేక ఆత్మగౌరవంతో అడుగు బయటపెట్టే అన్నా లెజినోవాలా?

భారతీయ భూస్వామ్య, పితృస్వామ్య సమాజం స్త్రీకి ఎప్పుడూ ఒక ‘త్యాగపు శిలువ’ను బహుమతిగా ఇస్తుంది. స్త్రీని దేవతగా కొలుస్తూనే, ఆమె రెక్కలు విరిచేయడం ఈ వ్యవస్థకు వెన్నతో పెట్టిన విద్య. తొంభైల నాటి సామాజిక, రాజకీయ నిర్బంధాలలో సోనియా గాంధీ ఇదే ఉచ్చులో చిక్కుకున్నారు. భర్తను కోల్పోయి, పిల్లల్ని రెక్కల కింద దాచుకునే కోడి పెట్టలా మారి, ఒక మహా సామ్రాజ్యపు వారసత్వాన్ని భుజాన మోశారు. ఆమె ఆత్మకథలోని ప్రతి పేజీ ఒక కన్నీటి సముద్రం. కానీ, ఆ త్యాగాలకు ఈ దేశం, ఈ చరిత్ర ఇచ్చిన విలువ ఏమిటి? ఇప్పటికీ ఆమెపై చెరగని ‘విదేశీ’ ముద్ర, వ్యక్తిగత దూషణలు, రాజకీయ విమర్శలు.

ఒక స్త్రీ తన యవ్వనాన్ని, సంతోషాన్ని, ఆఖరికి తన ఉనికిని దేశం కోసమో, కుటుంబం కోసమో బలిపెడితే.. అంతిమంగా ఆమెకు మిగిలేది ఒంటరితనమేనా? త్యాగాలను గుర్తించాల్సింది ఎవరు? సొంత వాళ్లా, పరాయి వాళ్లా? అసలు గుర్తించినా తిరిగి రాని జీవితానికి ఆ గుర్తింపు ఏపాటి ఊరటనిస్తుంది? ఇక్కడే సోనియా గాంధీ జీవితం మనకు ఒక చేదు నిజాన్ని తట్టి చెబుతుంది.వ్యవస్థ కోసం స్త్రీ చేసే ఏ త్యాగమూ ఆమెకు విముక్తిని ప్రసాదించదు. అది ఆమెను మరింత అందమైన పంజరంలో బంధిస్తుంది.

కానీ, ఇరవై ఒకటో శతాబ్దపు నూతన పోకడకు అన్నా లెజినోవా ఒక తిరుగుబాటు ప్రతీక. మార్క్సిస్టు-కమ్యూనిస్టు భావజాలం పురుడుపోసుకున్న గడ్డ నుంచి వచ్చినందుకేమో, ఆమెలో ‘వ్యక్తిగత స్వేచ్ఛ’ (Individuality), ఆత్మగౌరవం అణువణువునా కనిపిస్తాయి. భౌతిక పరిస్థితులు మారినప్పుడు మానవ సంబంధాలు కూడా మారతాయనే గతితార్కిక సూత్రాన్ని ఆమె ఆచరణలో పెట్టారు.

సమయం ఇవ్వలేని భర్త, ఇమడలేని సాంస్కృతిక వాతావరణం, నిరంతరం ప్రజల మధ్యే ఉండే రాజకీయ అధినేత నీడలో తన అస్తిత్వం కొట్టుకుపోతుంటే.. ఆమె సోనియాలా మౌనంగా కుమిలిపోలేదు. భారతీయ సంప్రదాయాలను గౌరవించి, మెడలో మంగళసూత్రం వేసుకుని, పిల్లలకి జన్మనిచ్చి తన వంతు ప్రయత్నం చేశారు. కానీ, తన ఆత్మను చంపుకుని బతకాల్సిన అవసరం లేదని గ్రహించిన మరుక్షణం, ఇది నా జీవితం కాదు అంటూ ప్రత్యామ్నాయ మార్గంలోకి ధైర్యంగా అడుగుపెట్టారు.

అన్నా లెజినోవా తీసుకున్న నిర్ణయం వెనుక అంతులేని మానసిక సంఘర్షణ (Mental Trauma) ఉండొచ్చు. అడవి మధ్యలో ఆగిపోయిన రైలు బండిలా తన వైవాహిక జీవితం నిలిచిపోయినప్పుడు, వెనక్కి తిరిగి చూస్తే కనిపించేది కోల్పోయిన కాలానికి సంబంధించిన శూన్యమే. కానీ, ఆ శూన్యంలోనే ఉండిపోవడం కంటే, ఆ బండి దిగి సొంతంగా నడవడమే అసలైన ఆధునికత అని ఆమె నిరూపించారు.

ఈ నాటి సమాజానికి, ముఖ్యంగా ఆధునిక స్త్రీలకు అన్నా లెజినోవా ఒక మేలుకొలుపు. రాజకీయ కుటుంబం అనో, సమాజంలో పరువు పోతుందనో, లేక పిల్లల భవిష్యత్తు అనో.. జీవితాంతం కన్నీళ్లను మూటగట్టుకుని, భర్త ఇచ్చే కానుకలను, ఖరీదైన ఒంటరితనాన్ని భరిస్తూ బతకడం పాతివ్రత్యం కాదు; అది పచ్చి మానసిక, సామాజిక బానిసత్వం. ఆ బానిసత్వాన్ని ప్రశ్నించడమే అసలైన విప్లవం.

నాలుగు గోడల మధ్య స్త్రీ అనుభవించే మౌనం, రాజీ, వంటింటి శ్రమ ఏవీ యాదృచ్ఛికాలు కావు; అవన్నీ వ్యవస్థాగత పితృస్వామ్యం మోపిన అదృశ్య సంకెళ్లు. ఆమె శరీరంపై, సమయంపై, భావోద్వేగాలపై సమాజం చెలాయించే ప్రతి ఆంక్షకు అసలైన మూలం పురుషాధిక్య అధికార దాహమే. పడకగది నుంచి పార్లమెంటు దాకా జరిగే ఆధిపత్య పోరాటంలో వ్యక్తిగతమైన ప్రతి నిర్ణయం ఒక తిరుగుబాటే; అందుకే స్త్రీ తన ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛను ఎంచుకోవడమే అతిపెద్ద విప్లవాత్మక రాజకీయం.

స్త్రీ ఎవరి కోసమో త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒక స్వతంత్ర వ్యక్తి (Individual). అభిప్రాయాలు కలవకపోతే, తనకంటూ ఒక స్పేస్ లేకపోతే.. ఎంతటి మహా వృక్షం నీడ నుంచైనా సరే, ప్రేమగా, హుందాగా తప్పుకోవడమే సరైన నిర్ణయం. ఆనాటి పరిస్థితులకు సోనియా గాంధీ సహనం గొప్పది కావొచ్చు, కానీ ఈనాటి ప్రపంచానికి అన్నా లెజినోవా తెగువే ఆదర్శం.

పరువు, ప్రతిష్టలనే సంప్రదాయ సంకెళ్లను తెంచుకుని, స్త్రీ తన సొంత అస్తిత్వం కోసం గళం విప్పినప్పుడే.. కుటుంబం అనే వ్యవస్థలో నిజమైన ప్రజాస్వామ్యం, సమానత్వం సాధ్యమవుతాయి. చరిత్ర పుటల్లో మనకు కావాల్సింది కన్నీటితో తడిసిన త్యాగమూర్తుల గాథలు కాదు.. స్వేచ్ఛా గగనంలో ఎగిరే స్వతంత్ర స్త్రీల విజయ పతాకాలు.
The Cross or the Skies: A Tale of Two Political Brides
– Kranthi.G

Pen And Book Trend : డిజిటల్ యుగంలోనూ చేతిలో పెన్ను, అందమైన నోట్‌బుక్ ..ఈ ట్రెండ్ వెనుక ఉన్న సైకాలజీ రీజన్‌ ఏంటి?

Related Articles

Back to top button