Tamil Nadu
తమిళనాడు ఎన్నికల మహా సంగ్రామంలో మేజర్ ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 234 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే పార్టీ , ఏఐఏడీఎంకే పార్టీల మధ్య సాగే పోరులో, ఈసారి ఎన్నికలలో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (TVK) అడుగుపెట్టడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి.
పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడాల్సి ఉండగా.. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతుండటంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడిపై నిషేధం కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో చివరి విడత పోలింగ్ ముగియనున్న ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 6:30 గంటల తర్వాతే.. తమిళనాడులో కూడా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడనున్నాయి.
ప్రస్తుత తమిళనాడులోని రాజకీయ వాతావరణాన్ని విశ్లేషిస్తే, అధికార డీఎంకే కూటమి కొంత వరకూ పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అమలు చేసిన సంక్షేమ పథకాలలో, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ,ఆర్థిక సాయం వంటివి గ్రామీణ ఓటర్లలో స్టాలిన్ పట్ల సానుకూలతను పెంచాయి.
అయితే, ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే తన పట్టున్న ప్రాంతాల్లో ప్రధాన పార్టీ అయిన డీఎంకే గట్టి పోటీని ఇచ్చింది. కానీ ఈ సారి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ పార్టీ ఈ రెండు ప్రధాన పార్టీల ఓట్ల బ్యాంకుకు ఎంతవరకు గండి కొడుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. యువతలో విజయ్‌కు ఉన్న క్రేజ్ కనుక ఓట్లుగా మారితే మాత్రం, అది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీయవచ్చు.
రాజకీయ నిపుణుల ప్రాథమిక అంచనా ప్రకారం, డీఎంకే కూటమికి మెజారిటీ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే, ఏఐఏడీఎంకే, విజయ్ పార్టీలు సాధించే ఓట్ల శాతం గెలుపోటముల అంతరాన్ని చాలా వరకూ ప్రభావితం చేయనున్నాయి. శాంతియుతంగా జరిగిన ఈ పోలింగ్ ప్రక్రియలో భారీగా ఓటింగ్ శాతం నమోదవ్వడంతో విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు .
మొత్తంగా మే 4వ తేదీన వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. తమిళనాడు పీఠం ఎవరికి దక్కుతుందో తేల్చిచెప్పబోతున్నాయి. అప్పటివరకు ఈ పొలిటికల్ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.
Weather : అటు ఎండలు ఇటు వానలు.. ఏపీ, తెలంగాణలో ఈ 3 రోజులు వెదర్ అప్‌డేట్ ఇదే
