TVK Vijay : తమిళనాట విజిల్ మోత..విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం
TVK Vijay : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి చూపు తమిళనాడు వైపే నిలిచింది
TVK Vijay
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి చూపు తమిళనాడు వైపే నిలిచింది. వారి ఆసక్తికి తగ్గట్టే తమిళనాడులో సంచలన ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ నటుడు విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార డీఎంకే , విపక్ష ఏఐడీఎంకేలను వెనక్కి నెట్టి విజయం దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే 100కు పైగా సీట్లతో స్పష్టమైన ఆధిక్యంలో విజయ్(TVK Vijay) పార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ 118 కు అత్యంత చేరువలో ఉంది. తొలిసారి పార్టీ పెట్టి ఈ స్థాయిలో విజయ్ విజయం(TVK Vijay) సాధించడం సాధారణ విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి ఈ ఎన్నికలకు ముందు విజయ్ కు అంత సీన్ లేదనీ, కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కొన్నింటిని సాధిస్తాడేమో తప్ప డీఎంకేనే అధికారంలోకి వస్తుందని చాలా మంది భావించారు.
ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ సైతం విజయ్ కు 7 నుంచి 18 సీట్లు మాత్రమే వస్తాయంటూ అంచనా వేశాయి. కేవలం యాక్సిస్ మై ఇండియా మాత్రం విజయ్ టీవీకే (TVK Vijay)పార్టీ 120 సీట్ల వరకూ గెలుస్తుందని అంచనా వేసింది. చివరికి ఆ సర్వే నిజమవుతూ విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ సాధించకున్నా స్వతంత్ర అభ్యర్థులు లేదా డీఎంకే , అన్నాడీఏంకే కూటమిలో ఉన్న ఇతర చిన్న పార్టీల అభ్యర్థుల మద్ధతుతో విజయ్ సీఎం కావడం దాదాపుగా ఖాయమైంది.
దీంతో విజయ్ పార్టీని సంప్రదించేందుకు అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే కూటములతో పాటు ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసానికి పోలీసులు భద్రతను భారీగా పెంచారు. విజయ్ పార్టీ విజయం దాదాపుగా ఖాయమవడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆయన నివాసానికి చేరుకున్నారు.

ప్రోటోకాల్ ప్రకారం విజయ్(TVK Vijay) ఇంటికి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో విజయ్ నివాసం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. అటు ఆయన కుటుంబసభ్యులు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు విజయ్ పార్టీ తరపున పోటీచేసి ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులతో విజయ్ కాసేపట్లో సమావేశం కానున్నారు.
మరోవైపు డీఎంకే పార్టీ కార్యాలయం బోసిపోయింది. అసలు ఇలాంటి ఫలితాలు ఊహించలేదని ఆ పార్టీ శ్రేణులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఇక ఏఐడీఎంకే పార్టీ కార్యాలయంలోనూ సందడి వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే మూడో స్థానానికే పరిమితమవుతుందనుకున్న ఏఐడీఏంకే రెండో స్థానంలో నిలిచింది.
Cervical Cancer : మహిళల నిశ్శబ్ద శత్రువు.. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాల్సిందే..





