Just PoliticalJust TelanganaLatest News

Budget : తెలంగాణ బడ్జెట్ .. సామాజిక న్యాయమే లక్ష్యంగా కేటాయింపులు జరిగాయా?

Budget : అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ, ప్రతి పౌరుడికి సామాజిక , ఆర్థిక న్యాయం అందించడమే ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశమని భట్టి విక్రమార్క వివరించారు.

Budget

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను(Budget )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఈరోజు అంటే మార్చి 20న ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3,24,234 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర పద్దును ప్రవేశపెట్టారు.

అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ, ప్రతి పౌరుడికి సామాజిక , ఆర్థిక న్యాయం అందించడమే ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశమని భట్టి విక్రమార్క వివరించారు.

ఈ బడ్జెట్‌లో(Budget) రెవెన్యూ వ్యయం కోసం ఏకంగా 2,34,406 కోట్ల రూపాయలు కేటాయించగా, మూలధన వ్యయం కోసం 47,267 కోట్ల రూపాయలను కేటాయించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 రూపాయలుగా నమోదవ్వడం విశేషం.

ఇక ఆదాయ వనరుల విషయానికి వస్తే, తెలంగాణ స్వంత పన్నుల ద్వారా 1,48,185 కోట్ల రూపాయలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

శాఖల వారీగా కేటాయింపులను గమనిస్తే, విద్య, వ్యవసాయ రంగాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. విద్యాశాఖకు 26,674 కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగానికి 23,179 కోట్ల రూపాయలను కేటాయించారు.

అలాగే గ్రామీణ డెవలప్మెంట్ దృష్టిలో ఉంచుకుని.. పంచాయతీరాజ్ శాఖకు 33,688 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని కేటాయించారు. వైద్యారోగ్య శాఖకు 13,679 కోట్లు, విద్యుత్ రంగానికి 21,285 కోట్లు అలాగే నీటిపారుదల శాఖకు 22,615 కోట్ల రూపాయలను కేటాయించారు.

సంక్షేమ రంగంలో భాగంగా బీసీ సంక్షేమానికి 12,511 కోట్ల రూపాయలు, ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్ల రూపాయలు, అలాగే ఎస్టీ సంక్షేమానికి 7,934 కోట్ల రూపాయలను కేటాయించి సామాజిక సమతుల్యతను కాపాడే ప్రయత్నం చేశారు.

యువత , మౌలిక సదుపాయాల కల్పనపై కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాజీవ్ యువవికాసం స్కీమ్‌ కోసం 6,000 కోట్లు, గృహ నిర్మాణ రంగం కోసం 7,430 కోట్ల రూపాయలను కేటాయించారు.

Budget
Budget

పట్టణాభివృద్ధి కోసం పురపాలక శాఖకు 17,907 కోట్లు, శాంతిభద్రతల పరిరక్షణకొరకు హోం శాఖకు 11,907 కోట్లు కేటాయించారు. పరిశ్రమల అభివృద్ధికి 3,490 కోట్ల రూపాయలు అలాగే రవాణా, ఆర్ అండ్ బీ శాఖకు 12,789 కోట్ల రూపాయలను కేటాయిస్తూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రత్యేకంగా గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం 500 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్‌లో కేటాయించారు. మొత్తం మీద తెలంగాణ అప్పులు, ఆదాయాల మధ్య సమతుల్యత పాటిస్తూ.. ప్రజా సంక్షేమమే పరమావధిగా ఈ నూతన బడ్జెట్ రూపకల్పన జరిగినట్లు కనిపిస్తోంది.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశంసలు

Related Articles

Back to top button