Basil Plant : తులసి మొక్కను ఏ దిశలో ఉంచాలి? రాజయోగం కలిగించే వాస్తు రహస్యాలు..
Basil Plant : తూర్పు ముఖద్వారం ఉన్న ఇళ్లకు ఈశాన్య మూల తులసిని పెంచడానికి అనుకూలంగా ఉంటుంది.
Basil Plant
హిందూ సంప్రదాయంలో తులసి కేవలం ఒక మొక్కగా మాత్రమే భావించరు.. అది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన దేవతా మొక్కగా కొలుస్తారు. ప్రతి ఇంట్లోనూ తులసికోట ఉండటం శుభప్రదంగా భావిస్తారు.
ఎందుకంటే ఇది పాజిటివ్ పవర్‌కు , పూర్తి ఆరోగ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. శాస్త్రీయంగా చూసినా తులసి మొక్క(Basil Plant) ఎక్కువ ప్రాణవాయువును (ఆక్సిజన్) రిలీజ్ చేస్తూ, గాలిని శుద్ధి చేసే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు ఆయుర్వేదంలో తులసిని అనేక వ్యాధులకు పరమౌషధంగా ఉపయోగిస్తారు.
తులసి మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచడం వల్ల పాజిటివ్ పవర్ వెల్లివిరుస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది . ముఖ్యంగా ఈశాన్యం (North-East), ఉత్తరం (North) , తూర్పు (East) దిక్కులలో తులసిని పెంచడం అత్యంత శుభప్రదంగా పురాణాలలో కూడా పరిగణించబడుతుంది.
ఈ దిశలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పెంచుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. తూర్పు ముఖద్వారం ఉన్న ఇళ్లకు ఈశాన్య మూల తులసిని పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. పడమర ముఖద్వారం ఉన్నవారు మాత్రం నైరుతి దిక్కు కాకుండా కుడివైపున తులసి మొక్కని ఏర్పాటు చేసుకోవాలి.
అయితే తులసికోట నిర్మాణం విషయంలో శుభ్రతకు పెద్దపీట వేయాలన్న విషయాన్నితెలుసుకోవాలి. తులసికోటను నేల నుంచి కనీసం రెండు అడుగుల ఎత్తులో ఉంచేలా చూడటం మంచిది. ఇలా చేస్తే పరిసరాలను శుభ్రం చేసేటప్పుడు మురికి నీరు తులసి మొక్కపై పడకుండా ఉంటుంది.
పూర్వ కాలంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మన పెద్దలు తులసికోటను నిర్మించేవారు. దీనివల్ల తులసి మొక్క (Basil Plant) మీదుగా వచ్చే శుభ్రమైన గాలి ఇంట్లోకి ప్రవేశించి ప్రాణవాయువును అందిస్తుందని వారు భావించేవారు. ఇది ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని.. అలాగే తులసి పచ్చదనం కళ్లకు ఆనందాన్ని, మెదడుకు ప్రశాంతతను ఇస్తుందని నమ్మేవారు.

ఒకవేళ ఇంటి ముందర రద్దీ ఎక్కువగా ఉండి, అపవిత్రంగా తాకే అవకాశం ఉంటే తులసికోటను ఇంటి వెనుకవైపు ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. దీనివల్ల పూజలు చేసేవారు మాత్రమే అక్కడికి వెళ్లి తులసిని పవిత్రంగా ఉంచడానికి వీలవుతుంది.
ఆధ్యాత్మికంగా చూస్తే, కృష్ణుడు రుక్మిణీ దేవి సమర్పించిన రెండు తులసి ఆకులకు తూగాడనే పురాణ గాథ ద్వారా.. తులసి పరమాత్మకు ఎంత ప్రీతికరమో అర్థమవుతుంది. అందుకే తులసి ఆకుని కేవలం అలంకరణ కోసం కాకుండా, భక్తితో, పవిత్రతతో పూజించడం వల్ల ఆ ఇంట్లో సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.





