Just SpiritualLatest News

Govinda:గోవింద నామ వైభవం గురించి తెలుసా? ఈ స్మరణ వెనుక ఉన్న ఆధ్యాత్మిక పరమార్థం ఇదే..

Govinda: వారం రోజుల పాటు ఆ గిరి కింద సకల జీవరాశులను రక్షించిన కృష్ణుడి మహిమ చూసి ఇంద్రుడి అహంకారం అణిగిపోతుంది.

Govinda

ఏడుకొండలవాడా..వేంకటరమణా..గోవిందా.. గోవిందా.. ఈ నామస్మరణ వినపడగానే పులకించని భక్తులు ఉండరు. తిరుమల పావన గిరుల పైన నిత్యం ప్రతిధ్వనించే ఈ గోవింద నామం భక్తులకు ఒక కొండంత అండ. అయితే, అందరికీ సుపరిచితమైన ఈ గోవింద నామం ఎలా ఆవిర్భవించిందని.. దీని వెనుక ఉన్న అసలు అంతరార్థం ఏమిటనేది తెలుసుకోవాలి.

ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ లీలతో గోవింద(Govinda) నామ ఆవిర్భావం ముడిపడి ఉందని పండితులు చెబుతారు. ప్రతి ఏటా వర్షాల కోసం గోకులంలో ఇంద్రుడిని పూజించడం ఆనవాయితీగా వచ్చేది. అయితే గోపాల కృష్ణుడు మాత్రం.. మనం ప్రకృతిని, మనకు ఆహారాన్నిచ్చే గోవులను, మన జీవనాధారమైన గోవర్ధన పర్వతాన్ని పూజించాలని ప్రజలకు బోధించడంతో.. కృష్ణుడి మాట విని గోకులవాసులు ఇంద్రయాగాన్ని ఆపివేస్తారు. ఈ పనితో ఆగ్రహించిన దేవేంద్రుడు అహంకారంతో.. గోకులంపై ప్రళయ వర్షాన్ని కురిపిస్తాడు.

ఆ ఆపద నుంచి ప్రజలను, మూగజీవాలను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై గొడుగులా ఎత్తి పట్టుకుంటాడు. వారం రోజుల పాటు ఆ గిరి కింద సకల జీవరాశులను రక్షించిన కృష్ణుడి మహిమ చూసి ఇంద్రుడి అహంకారం అణిగిపోతుంది. అప్పుడు ఇంద్రుడు కృష్ణుడి పాదాల చెంత చేరి క్షమాపణలు కోరుతాడు.

ఆ సమయంలోనే గోమాత ఐన కామధేనువు పాలాభిషేకాన్ని చేసి, ఇంద్రుడు ఆ గంగాజలంతో అభిషేకించి.. నేను కేవలం దేవతలకే మాత్రమే ఇంద్రుడిని, కానీ మీరు గోవులకు, భూమికి, సమస్త జీవకోటికి ప్రభువు అని ఒప్పుకుంటాడు. అందుకే మీరు గోవిందుడని పిలువబడతారని కొనియాడాడు. ఆరోజు నుంచి కృష్ణ పరమాత్మకు గోవింద నామం స్థిరపడిపోయింది.

Govinda
Govinda

గోవింద(Govinda) అనే పదంలోని అద్భుత అర్థం ఏంటి.. ఆధ్యాత్మికంగా “గో” అనే పదానికి అనేక గంభీరమైన అర్థాలున్నాయి. వేదాల ప్రకారం ‘గో’ అంటే గోవులు, భూమి, వేదాలు, ఇంద్రియాలని అర్థం. అలాగే “వింద” అంటే రక్షించేవాడు లేదా తెలుసుకున్నవాడు అని అర్థం. అంటే గోవులను రక్షించినవాడు.. భూమిని ఉద్ధరించినవాడు..వేదాల సారాన్ని తెలిసినవాడు. మన ఇంద్రియాలను నియంత్రించి మనకు మోక్షాన్నిచ్చేవాడని ఈ నామానికి సమగ్రమైన అర్థం వస్తుంది.

అయితే ద్వాపర యుగంలో గోవర్ధనగిరిని ఎత్తిన ఆ కృష్ణుడే.. కలియుగంలో తన భక్తులను కాపాడటానికి వేంకటాద్రిపై వెలిశాడని భక్తుల నమ్ముతారు. తిరుమల కొండల్లో అడుగుపెట్టిన ప్రతీ భక్తుడు అందుకే తనను తాను మర్చిపోయి గోవింద నామాన్ని స్మరిస్తాడు. అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు గోవిందా అని ఆర్తితో పిలిస్తే, ఆ ఏడుకొండల స్వామి మనల్ని ఆదుకుంటాడనే బలమైన నమ్మకం కోట్లాది మందిలో ఉంది. అందుకే, భక్తికి నిదర్శనం.. ముక్తికి మార్గం ఈ గోవింద నామమే అంటారు .

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button