Just SpiritualLatest News

Nagula Chavithi : ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడు? శుభ ముహూర్తం, చేయాల్సిన పూజా విధానం ఏంటి?

Nagula Chavithi : 2026 నాగుల చవితి తేదీ, సమయం, పూజా ముహూర్తం , పాటించాల్సిన ముఖ్యమైన నియమాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Nagula Chavithi

హిందూ సంప్రదాయంలో తెలుగువారంతా చాలా భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుపుకునే పండుగలలో నాగుల చవితికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను మహిళలు ఎంతో భక్తితో ఆచరిస్తారు. ఈ ఏడాది నాగుల చవితి(Nagula Chavithi) పండుగ నవంబర్ 13వ తేదీ శుక్రవారం రోజు వచ్చింది.

పంచాంగం ప్రకారం నవంబర్ 12 సాయంత్రం 6:09 గంటలకు చవితి తిథి ప్రారంభమయ్యి.. నవంబర్ 13వ తేదీ రాత్రి 8:42 గంటల వరకు ఉంటుంది. అలాగే ఉదయం 11:36 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు అభిజిత్ ముహూర్తం అత్యంత శుభప్రదంగా ఉంది కాబట్టి, నవంబర్ 13వ తేదీనే నాగేంద్రుని పూజించడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు.

హిందూ పురాణాల ప్రకారం శివుడి మెడలో నాగాభరణంగా, విష్ణుమూర్తికి పాన్పుగా ఆదిశేషుడిగా కొలువై ఉండే నాగులకు దైవికమైన ప్రాధాన్యత ఉంది. అటువంటి నాగదేవతలను ఈ పర్వదినాన ప్రత్యేక పూజలు చేసి ఆరాధించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయని బలమైన నమ్మకం ఉంది. పిల్లల ఆయుష్షు, ఆరోగ్యం కోసం మహిళలు ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి నాగేంద్రుడిని కొలుస్తారు.

ఈ పవిత్రమైన నాగుల చవితి(Nagula Chavithi) రోజు ఆచరించాల్సిన పూజా విధానం విషయం గురించి చూస్తే..ఆరోజు తెల్లవారుజామునే తలస్నానం ఆచరించాలి. అయితే ఆరోజు షాంపూలు , కుంకుడుకాయలు, సబ్బులతో తల రుద్దుకోకూడదు. ముందు రోజే వీటితో తల రుద్దుకుని నాగుల చవితి రోజు మాత్రం ఒట్టి నీళ్లతో మాత్రమే తలస్నానం చేయాలి. ఆ తర్వాత దగ్గరలోని పుట్ట లేదంటే నాగదేవత విగ్రహం ఉంటే అక్కడకు వెళ్లి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి భక్తితో పూజించాలి.

ముఖ్యంగా చలిమిడి, నువ్వుల చిమ్మిలి, వడపప్పు, అరటిపండ్లు , కొబ్బరికాయను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి హారతినివ్వాలి. కుటుంబ సభ్యులందరి క్షేమం కోరుకుంటూ భక్తితో నమస్కరించుకోవాలి. ఈ పండుగ రోజు కొన్ని నియమాలను కచ్చితంగా పాటిస్తే మంచిదని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ఈరోజు పాములకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. పర్యావరణాన్ని, జీవరాశులను గౌరవించాలి.

అలాగే పుట్టలో పాలు పోసే విషయంలో కూడా ఈ కాలంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని, డైరెక్టుగా పుట్టలో పాలు పోయడానికి బదులు విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూజలు చేయడం ఆరోగ్యకరమైన పద్ధతిగా నిపుణులు చెబుతున్నారు.

ఈరోజు పేదలకు అన్నదానం లేదంటే వస్త్రదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. కుటుంబ ఆచారాలను, సాంప్రదాయాలను గౌరవించేలా భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకొంటే నాగేంద్రుని కృపతో జీవితంలో సకల సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతారు.

Pawan Kalyan Divorce : పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా డైవోర్స్..2 తెలుగు రాష్ట్రాలలో వైరల్ అవుతున్న పవన్ విడాకులు

Related Articles

Back to top button