TTD : శ్రీవారి భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..2 నుంచి 4 గంటల్లోనే స్వామివారి దర్శనం
TTD : తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండే భక్తుల కోసం టీటీడీ ప్రయోగాత్మకంగా 'రీ-ఎంట్రీ' విధానాన్ని ప్రవేశపెట్టింది
TTD
తిరుమల ఏడుకొండలవాడిని దర్శించుకోవాలని ఆశపడే సామాన్య భక్తులకు..టీటీడీ(TTD) ఒక అద్భుతమైన తీపి కబురు అందించింది. ప్రస్తుతం సమ్మర్ హాలీడేస్ కావడం వల్ల తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రతి రోజూ సుమారు ఎనభై వేల మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తుండటంతో, టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి ఏకంగా ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది.
తీవ్రమైన ఎండల్లో చిన్న పిల్లలు, వృద్ధులు క్యూలైన్లలో, కంపార్ట్‌మెంట్లలో గంటల తరబడి నిలబడలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు పడుతున్న ఈ కష్టాలను చూసి చలించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు..వారి కోసం రీ ఎంట్రీ అనే ఒక సరికొత్త , చక్కటి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
అయితే ఈ కొత్త సదుపాయం అందరికీ వర్తించదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కేవలం ఉచిత సర్వదర్శనం టోకెన్లు అంటే టైం స్లాట్ టోకెన్లు తీసుకున్న భక్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీనివల్ల భక్తులు తమ దర్శన సమయం వచ్చే వరకు క్యూలైన్లలోనే కూర్చోవాల్సిన అవసరం లేదు. కాసేపు బయటకు వెళ్లి, తమ గదుల్లో విశ్రాంతి తీసుకుని కానీ తిరుమలలోని ఇతర ప్రాంతాలను చూసుకుని కానీ, మళ్లీ దర్శన సమయానికి క్యూలైన్లలోకి వచ్చేయొచ్చు.
ఈ రీ ఎంట్రీ అవకాశాన్ని పొందాలనుకునే భక్తులు ముందుగా సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠం-2 కాంప్లెక్స్‌కు చేరుకోవాలి. అక్కడ తమ గుర్తింపు కార్డును (Aadhaar Card వంటివి) చూపించి దర్శన టోకెన్ తీసుకోవాలి. ఆ తర్వాత క్యూలైన్ నుంచి టెంపరరీగా బయటకు వెళ్లాలనుకునే భక్తుల కోసం అధికారులు పదిహేడవ కంపార్ట్‌మెంట్ వద్ద ప్రత్యేకంగా రీ ఎంట్రీ పాస్‌లు ఇస్తారు.
అక్కడే ఉన్న బయట దారి నుంచి వెళ్లేటప్పుడు భక్తులు తమ టోకెన్‌ను కచ్చితంగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా బయటకు వచ్చిన వారు కాసేపు తమ రూములకు వెళ్లి హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు.
బయటకు వెళ్లిన భక్తులు తమకు కేటాయించిన దర్శన సమయానికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల ముందు నిర్ణీత ప్రాంతానికి చేరుకోవాలి. అయితే, తిరిగి లోపలికి వెళ్లేటప్పుడు మాత్రం లడ్డూ కౌంటర్ల వైపు నుంచి కాకుండా.. మ్యూజియం పక్కన ఉన్న డబ్ల్యూ-4 గేట్ మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.అక్కడే రీ ఎంట్రీ కేంద్రం ఉంటుంది.
భక్తులకు టీడీటీ(TTD) సిబ్బంది చెప్పిన టైమ్‌కు లోపలికి ప్రవేశిస్తే చాలు, కంపార్ట్‌మెంట్లు తెరిచిన తర్వాత కేవలం రెండు నుంచి నాలుగు గంటల లోపే ఏడుకొండలవాడి దర్శనం ఎంతో సులువుగా పూర్తవుతుంది.

బయటకు వచ్చి మళ్లీ దర్శనానికి లోపలికి వెళ్లడానికి అధికారులు ఇచ్చే టోకెన్ చాలా చాలా ముఖ్యం. ఒకవేళ ఆ టోకెన్‌ను పోగొట్టుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి లోపలికి అనుమతించరు.
టీటీడీ(TTD) అధికారులు చెప్పిన సమయం కంటే కొంచెం ముందే రీ ఎంట్రీ పాయింట్‌కు చేరుకోవడం మంచిది.
మొబైల్ ఫోన్లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను శ్రీవారి దర్శనానికి అనుమతించరు కాబట్టి, వాటిని ముందుగానే భక్తులు వారి గదులలో కానీ లగేజీ కౌంటర్లలో కానీ జాగ్రత్త చేసుకోవాలి. ఈ రీ ఎంట్రీ గేట్ దగ్గర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను దాచడానికి ఎలాంటి కౌంటర్లు ఉండవు.
Ebola : కరోనా కష్టాలను గుర్తుంచుకుని ముందే అప్రమత్తం.. ఎబోలాపై పాత మందులు పనిచేయవా?





