RCB : ఆర్సీబీ సేల్ @ 16 వేల కోట్లు…గంటల్లోనే రాజస్థాన్ రికార్డు బ్రేక్
RCB : ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది
RCB
ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2008లో రూ.500 నుంచి 600 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని అమెరికా వ్యాపారవేత్త సోమానీ రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేయడంతో సరికొత్త రికార్డుగా నమోదైంది.
అయితే ఈ రికార్డు కేవలం కొన్ని గంటల్లోనే బద్దలయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫ్రాంచైజీ ఏకంగా రూ.16 వేల కోట్లకు అమ్ముడయింది. ఐపీఎల్ చరిత్రలోనే కాదు ఫ్రాంచైజీ క్రికెట్ హిస్టరీలోనే ఇది సరికొత్త రికార్డు. ఒక ఫ్రాంచైజీ ఇన్ని వేల కోట్లకు అమ్ముడవడం ఇదే తొలిసారి.
2008లో కేవలం రూ.446 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ ఫ్రాంచైజీ క్రమంగా తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంది. 17 ఏళ్ల పాటు ట్రోఫీ గెలవకున్నా విరాట్ కోహ్లీ, గేల్, డివీలియర్స్ వంటి స్టార్ ప్లేయర్స్ కారణంగా మిగిలిన ఫ్రాంచైజీల కంటే ఎక్కువ పాపులారిటీ సాధించింది. ప్రస్తుతం డియోజియో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఓనర్ గా ఉంది.
గత సీజన్ తో టైటిల్ గెలిచిన తర్వాత బెంగళూరు ఫ్రాంచైజీ విలువ మరింత పెరిగింది. దీంతో ఈ క్రేజ్ తగ్గకుండా కొత్త సీజన్ కు ముందే బిడ్డింగ్ ప్రక్రియ ముగిసేలా ప్రస్తుత యజమాని డియోజియో ప్రయత్నాలు ప్రారంభించింది.

మార్చి 31 లోగా ఈ విక్రయ ప్రక్రియ పూర్తయ్యేలా ముందే ప్లాన్ చేసుకున్న ఆ కంపెనీ దానికి తగ్గట్టే భారీ ఫలితాన్ని అందుకుంది. నిజానికి ముందు నుంచీ ఆర్సీబీ జట్టు అమ్మకానికి సంబంధించి రికార్డులు నమోదవుతాయని అంచనాలున్నాయి. ఒక దశలో 18 వేల కోట్ల వరకూ ధర పలుకుతుందని కూడా భావించారు.
అయితే చివర్లో దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. ఈ క్రమంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కన్సార్టియం ఆర్సీబీ(RCB) డీల్ ను పూర్తి చేసుకుంది. గత కొన్నిరోజులుగా జరిగిన చర్చలు కొలిక్కి వచ్చి రూ.16 వేల కోట్లకు ఫ్రాంచైజీని విక్రయించారు. ఈ కన్సార్టియంలో ఆదిత్య బిర్లా గ్రూప్, బ్లాక్ స్టోన్ , బోల్ట్ వెంచర్స్ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ అప్పగింత కార్యక్రమం ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాతే ఉంటుందని తెలుస్తోంది.
Rajasthan Royals : రూ.15 వేల కోట్లతో డీల్…చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్





