CSK : చెన్నై జోరుకు గుజరాత్ బ్రేక్ వేస్తుందా ?..చెపాక్ వేదికగా కీలక మ్యాచ్
CSK : ఐపీఎల్ 19వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది
CSK
ఐపీఎల్ 19వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) మరో కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది. వరుస పరాజయాల నుంచి కోలుకుని గెలుపు బాట పట్టిన చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకోకుండా ఉండాలంటే ఇకపై జరిగే మ్యాచ్ లన్నీ కూడా సీఎస్కేకు కీలకమే.
పైగా హోంగ్రౌండ్ కావడంతో ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న చెన్నైకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా రుతురాజ్ చెన్నైకి రాలేదు. అతను ఎప్పుడు వస్తాడనే దానిపై ఫ్రాంచైజీ కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ధోనీ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి.
ఒకవేళ రుతురాజ్ వచ్చినా ఈ మ్యాచ్ లో ధోనీ రీఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. కీపర్ గా ధోనీ బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. దీంతో సంజూ శాంసన్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడతాడు. ఇదిలా ఉంటే చెన్నై ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. బ్యాటింగ్ లో సంజూ శాంసన్ గత మ్యాచ్ లో శతక్కొట్టాడు.
అటు బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో ముంబైని వారి హోంగ్రౌండ్ లోనే చిత్తు చేసింది. ఈ విజయంతో సీఎస్కే కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఇప్పుడు చెపాక్ స్టేడియంలో తమ ఆధిపత్యం కొనసాగిస్తే మరో విజయాన్ని అందుకోవడం ఖాయం. పైగా ధోనీ రాక ఖచ్చితంగా చెన్నైకి భారీ అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉంది. హ్యాట్రిక్ విజయాల తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోవడం గుజరాత్ కు షాక్ గానే చెప్పాలి. గత మ్యాచ్ లో బెంగళూరుపై భారీస్కోరు చేసినా ఓడిపోయింది. సాయి సుదర్శన్, గిల్ ఫామ్ లో ఉండగా.. తర్వాత బ్యాటర్లలో బట్లర్ , వాషింగ్టన్ సుందర్, హోల్డర్ పై అంచనాలున్నాయి.
అటు బౌలింగ్ లో రబాడ, సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణ సమిష్టిగా రాణించడంలో విఫలమవుతున్నారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. బౌలర్లు గాడిన పడితే తప్ప గుజరాత్ టైటాన్స్ కు గెలుపు దక్కడం కష్టమే. కాగా మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న చెపాక్ స్టేడియం గత కొన్ని సీజన్లుగా బ్యాటర్లకు అనుకూలిస్తోంది. అయితే ఈ సారి స్లో పిచ్ ను రెడీ చేసే అవకాశముందని సమాచారం. ఇక గత రికార్డుల విషయానికొస్తే ఇరు జట్లు 8 మ్యాచ్ లలో తలపడితే సగం సగం గెలిచాయి.
Diet Plan:16:8 డైట్ ప్లాన్ అంటే ఏంటి? ఎవరెవరు ఈ డైట్ చేయకూడదో తెలుసా





