CSK vs RCB : చెన్నై గెలుపు రుచి చూసేనా ?…ఆర్సీబీతో హై వోల్టేజ్ ఫైట్
CSK vs RCB : వరుసగా రెండు పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ హై వోల్టేజ్ ఫైట్ కు సిద్ధమైంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతోంది
CSK vs RCB
వరుసగా రెండు పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ హై వోల్టేజ్ ఫైట్ కు సిద్ధమైంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో(CSK vs RCB) తలపడబోతోంది. ఈ సీజన్ లో సీఎస్కే పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తోంది. ధోనీ దూరమవడం, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ కెప్టెన్సీతో పాటు కీలక ఆటగాళ్లెవరూ రాణించకపోవడంతో చెన్నై వరుస ఓటములతో డీలా పడింది.
ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్న ఆర్సీబీని ఓడించడం ఆ జట్టుకు పెద్ద సవాలే. అది కూడా బెంగళూరు హోంగ్రౌండ్ లో విజయాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం చెన్నై జట్టు బ్యాటింగ్ లో సంజూ శాంసన్ వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. ట్రేడింగ్ లో రాజస్థాన్ నుంచి సీఎస్కేకు వచ్చిన సంజూ అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
రెండు మ్యాచ్ లలోనూ నిరాశపరిచాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇంకా గాడిన పడలేదు. అయితే గత మ్యాచ్ లో ఆయుశ్ మాత్రే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మాత్రేతో పాటు శివమ్ దూబే , సర్ఫరాజ్ ఖాన్ కూడా మెరుపులు మెరిపించారు. వీరికి మిగిలిన బ్యాటర్లు కూడా తోడైతే చెన్నై భారీస్కోరు సాధించే అవకాశముంటుంది.
బౌలింగ్ పరంగా చూస్తే సీఎస్కేను గెలిపించే బౌలర్ లేకపోవడం మైనస్ పాయింట్. అన్షుల్ కాంబోజ్ , మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్ అంచనాల మేర రాణించడం లేదు. స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా తన మ్యాజిక్ చూపించలేకపోతున్నాడు. బౌలర్ల వైఫల్యం కారణంగానే గత మ్యాచ్ లో పంజాబ్ పై 209 రన్స్ చేసినా గెలవలేకపోయింది. ప్రస్తుతం బౌలింగ్ పరంగా ఫామ్ అందుకుంటే చెన్నై తొలి విజయాన్ని అందుకునే అవకాశముంటుంది. నిజానికి ధోనీ లేకపోవడం కూడా సీఎస్కేను మానసికంగా దెబ్బతీసినట్టు కనిపిస్తోంది.
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(CSK vs RCB) తమ హోంగ్రౌండ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఆరంభ మ్యాచ్ లో సన్ రైజర్స్ ను చిత్తు చేసిన ఆర్సీబీ ఇప్పుడు రెండో విజయంపై కన్నేసింది. గత మ్యాచ్ లో ఫిల్ సాల్ట్ నిరాశపరిచినా కోహ్లీ, పడిక్కల్ , పటిదార్ అదరగొట్టారు. వీరి మెరుపు బ్యాటింగ్ తోనే బెంగళూరు భారీ టార్గెట్ ను అలవోకగా ఛేదించింది. దీంతో మరోసారి వీరందరిపైనా అంచనాలు పెరిగాయి.

ముఖ్యంగా హోంగ్రౌండ్ లో కోహ్లీ విధ్వంసం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు బౌలింగ్ లో జాకబ్ డఫీ, భువనేశ్వర్ కుమార్ పేస్ ఎటాక్ లో రాణిస్తున్నారు. గత మ్యాచ్ లో డఫీ అదిరిపోయే బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. స్పిన్ విభాగంలో కృనాల్ తో పాటు సుయాశ్ శర్మ కీలకం కానున్నారు.
గత రికార్డులు ః
ఐపీఎల్ లో చెన్నై, బెంగళూరు మధ్య 35 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో 21 సార్లు చెన్నై గెలిస్తే.. 13 మ్యాచ్ లలో బెంగళూరు విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
పిచ్ రిపోర్ట్ ః
ఐపీఎల్ లో బ్యాటర్లకు ఇష్టమైన స్టేడియాల్లో చిన్నస్వామి స్టేడియం ముందుంటుంది. ఇక్కడ అత్యధిక స్కోర్లు నమోదవుతుంటాయి. అదే సమయంలో భారీ టార్గెట్ ను సైతం అలవోకగా ఛేదించే ఫ్లాట్ వికెట్ ఇక్కడే ఉంటుంది. దీంతో మరోసారి బ్యాటర్లు చిన్నస్వామిలో పండగ చేసుకోవచ్చు.





