Just SportsLatest News

Delhi Capitals : ట్రోఫీ ముచ్చట తీరేనా ?..అంచనాలతో ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals : ట్రోఫీ ముచ్చట తీరేనా ?..అంచనాలతో ఢిల్లీ క్యాపిటల్స్ : ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ టైటిల్ గెలవలేకపోయిన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. ప్రతీ సీజన్ లోనూ మంచి అంచనాలతో, టాలెంటెడ్ ప్లేయర్స్ తో బరిలోకి దిగినా లీగ్ స్టేజ్ కే పరిమితమవుతోంది

Delhi Capitals

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ టైటిల్ గెలవలేకపోయిన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కూడా ఒకటి. ప్రతీ సీజన్ లోనూ మంచి అంచనాలతో, టాలెంటెడ్ ప్లేయర్స్ తో బరిలోకి దిగినా లీగ్ స్టేజ్ కే పరిమితమవుతోంది. లీగ్ చరిత్రలో 2020లో రన్నరప్ గా నిలవడమే ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) అత్యుత్తమ ప్రదర్శన. పలు సీజన్లకు కెప్టెన్లను మార్చినా, కోచ్ లను, ఆటగాళ్లను మార్చినా ఫలితం మాత్రం మారడం లేదు. నిజానికి 2025 సీజన్ ఆరంభంలో ఢిల్లీ దుమ్మురేపింది.

వరుస విజయాలతో టైటిల్ సాధించేలా కనిపించింది. అనూహ్యంగా గ్రూప్ స్టేజ్ సెకండాఫ్ లో చేతులెత్తేసింది. ఫస్టాఫ్ లో జోరును తర్వాత కొనసాగించలేక చతికిలపడింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో 19వ సీజన్ లోనైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. మినీ వేలానికి ముందు కీలక ఆటగాళ్లను రిలీజ్ చేసిన డీసీ యాజమాన్యం రూ. 21.8 కోట్లతో తమ జట్టును పటిష్టం చేసుకునే ప్రయత్నం చేసింది.

ఆసీస్ స్పీడ్ స్టార్ మిఛెల్ స్టార్క్ ను దక్కించుకున్న ఢిల్లీ కాశ్మీర్ యువ సంచలనం అకీబ్ నబీ కోసం రూ.8.4 కోట్లు వెచ్చించింది. టీ20 క్రికెట్ లో ఫినిషర్ గా పేరున్న డేవిడ్ మిల్లర్ ను అతని కనీస ధరకే దక్కించుకుంది. అటు బౌలింగ్ విభాగంలో ఎంగిడి, కైల్ జేమిసన్ లను తీసుకుంది. ఓవరాల్ గా వేలంలో తమ బలహీనతలను అధిగమించినట్టే కనిపిస్తోంది. అయితే మిఛెల్ స్టార్క్ ఫిట్ నెస్ పై సందేహాలున్నాయి. కొన్ని మ్యాచ్ లకు అతను అందుబాటులో ఉండడం అనుమానంగానే ఉంది.

టీమ్ కాంబినేషన్ విషయానికొస్తే గత సీజన్ లో అనవసరంగా ఎక్కువ ప్రయోగాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా టాపార్డర్ లో సరైన కూర్పును కొనసాగించలేదు. ఈ సారి మాత్రం అటువంటి తప్పిదాలు చేయకూడదని భావిస్తోంది. ఓపెనర్ గా సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఢిల్లీకి కీలకమని చెప్పొచ్చు.

గత సీజన్ లో రాహుల్ 539 పరుగులతో అదరగొట్టాడు. దీంతో మరోసారి అతనిపైనే ఆశలు పెట్టుకుంది. అలాగే డకెట్ , నిస్సాంక, పృథ్వీ షా, స్టబ్స్ , మిల్లర్, అభిషేక్ పోరల్, నితీష్ రాణా వంటి ఆటగాళ్ళతో బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం బ్యాట్ తో మెరుపులు మెరిపించగలడు. అటు బౌలింగ్ లో స్టార్క్ అందుబాటులో ఉండడంపైనే సస్పెన్స్ నెలకొంది.

Delhi Capitals
Delhi Capitals

స్టార్క్ కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్న నేపథ్యంలో ఎంగిడి, జేమిసన్ లపైనే భారం పడనుంది. దేశీయ బౌలర్లలో ముఖేశ్ కుమార్, కాశ్మీర్ ఎక్స్ ప్రెస్ అకీబ్ నబీ కీలకం కానున్నారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ తో పాటు కుల్దీప్ యాదవ్ ఢిల్లీకి కీలకం. ఈ సారి ఢిల్లీ ఫినిషర్ గా మిల్లర్ పైనే అంచనాలున్నాయి.

గత కొంతకాలంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్న మిల్లర్ తనదైన రోజున జట్టును ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉంది.గత సీజన్ లో 153 పరుగులే చేయగలిగిన మిల్లర్ ఈ సారి ఎలా రాణిస్తాడో చూడాలి. ఎక్కువ మంది టీ20 స్పెషలిస్టులు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కీలక మ్యాచ్ లలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుందనేది ఆ జట్టు విజయాలను ప్రభావితం చేయనుంది.

IPL : 15 నగరాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు..తెలుగు రాష్ట్రంలో ఎక్కడో తెలుసా ?

Related Articles

Back to top button