Hockey World Cup : నేటి నుంచే హాకీ ప్రపంచ కప్..5 దశాబ్దాల నిరీక్షణకు తెరపడేనా ?..
Hockey World Cup : ఈసారి హాకీ ప్రపంచ కప్ కొత్త ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. క్వార్టర్ ఫైనల్ స్టేజ్‌ను తొలగించి డైరెక్టుగా సెమీస్ నిర్వహించనున్నారు.
Hockey World Cup
ప్రతిష్టాత్మక ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ శనివారం నుంచే మొదలవుతోంది. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో భారత్‌తో సహా మొత్తం 16 జట్లు పోటీ పడుతున్నాయి. 51 ఏళ్ల టైటిల్ నిరీక్షణ తెరదించడమే లక్ష్యంగా హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత పురుషుల హాకీ టీమ్ బరిలోకి దిగుతోంది.
ఇంగ్లండ్, పాకిస్తాన్, వేల్స్ టీమ్స్‌తో పాటు భారత్ గ్రూప్-డీలో ఉంది. ఆగస్ట్ 15 నుంచి 30వరకు నాలుగు దశల్లో ఈ మెగా టోర్నీ జరగనుంది. పురుషుల, మహిళల హాకీ ప్రపంచకప్(Hockey World Cup) ఏకకాలంలోనే జరగన్నాయి. హాకీ ఆసియా కప్ 2025ను గెలుచుకొని భారత్ ఈ మెగా టోర్నీకి అర్హత సాధించింది.
గ్రూప్ దశలో భారత్.. ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. దీనిలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు తర్వాత రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత పురుషుల జట్టు ఆగస్టు 15న వేల్స్‌తో తన పోరును ప్రారంభిస్తుంది.
2025 ఆసియా కప్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగుతోంది. పూల్-డి లో ఉన్న భారత్, మిడ్‌ఫీల్డ్ రాణిస్తే సెమీఫైనల్ చేరే అవకాశాలున్నాయి. 1975 తర్వాత మళ్లీ ప్రపంచకప్ ట్రోఫీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని కోచ్ ఫుల్టన్ భావిస్తున్నాడు.
మరోవైపు సలీమా టెటే కెప్టెన్సీలోని మహిళల జట్టు ఆగస్టు 16న చైనాతో తొలి మ్యాచ్ ఆడనుంది.అనేక మంది కొత్త ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు టాప్-8 లేదా అంతకంటే మెరుగైన స్థానం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదిలా ఉంటే ఈసారి హాకీ ప్రపంచ కప్ కొత్త ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. క్వార్టర్ ఫైనల్ స్టేజ్‌ను తొలగించి డైరెక్టుగా సెమీస్ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లు గ్రూప్ దశ, క్రాస్‌ఓవర్ పూల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్ దశల్లో రెండు వేదికలలో జరగనున్నాయి.
మహిళల ప్రపంచ కప్ ఫైనల్ ఆగస్టు 29న, పురుషుల ప్రపంచ కప్ ఫైనల్ ఆగస్టు 30న జరుగుతాయి. కాంస్య పతక మ్యాచ్‌లు కూడా అవే రోజుల్లో ఉంటాయి. కొంత కాలంగా అంతర్జాతీయ టోర్నీలలో భారత్ హాకీ జట్లు నిలకడగా రాణిస్తుండటంతో ఈ మెగా టోర్నీలో ఏదో ఒక మెడల్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.





