ICC Rankings : మనోళ్లే ర్యాంకింగ్స్..దూసుకొచ్చిన భారత ఆటగాళ్లు
ICC Rankings : టీ20 ప్రపంచకప్ గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న భారత క్రిెకెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ దుమ్మురేపారు. బ్యాటింగ్ విభాగంలో పూర్తి ఆధిపత్యం కనబరిచారు
ICC Rankings
టీ20 ప్రపంచకప్ గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న భారత క్రిెకెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్(ICC Rankings) లోనూ దుమ్మురేపారు. బ్యాటింగ్ విభాగంలో పూర్తి ఆధిపత్యం కనబరిచారు. టాప్ 2లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ చోటు దక్కించుకుంటే టాప్ 10లో మొత్తంగా నలుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ 875 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు.
నిజానికి ఈ మెగాటోర్నీలో అభిషేక్ విఫలమయ్యాడు. కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. వరుసగా ఫెయిలవుతున్నా కోచ్ గంభీర్ అతనికే అవకాశాలు ఇచ్చాడు. అయితే టైటిల్ పోరులో అభిషేక్ శర్మ ఆకట్టుకున్నాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి భారత్ భారీస్కోరుకు పునాది వేశాడు. ఈ ప్రదర్శనతో అతని నెంబర్ వన్ ర్యాంకు నిలబెట్టుకోగలిగాడు.
ఇదిలా ఉంటే మరో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండో స్థానానికి దూసుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ లో అత్యంత నిలకడగా రాణించిన ఇషాన్ కిషన్ తన విధ్వంసకర బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. 9 మ్యాచ్ లలో 317 పరుగులు చేసి భారత్ తరపున సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో రెండు స్థానాలు ఎగబాకి టాప్ 2లో నిలిచాడు. ఇషాన్ కిషన్ కెరీర్ లో ఇదే బెస్ట్ ర్యాంక్.
మరోవైపు టాప్ 10లో మరో ఇద్దరు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో స్థానం మారినా కూడా మెరుపులు మెరిపించిన తిలక్ వర్మ 742 పాయింట్లతో ఏడోస్థానంలో కొనసాగుతున్నాడు. అటు కెప్టెన్ గా ఆకట్టుకున్నా , వ్యక్తిగతంగా ఫెయిలైన సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు దిగజారి 722 పాయింట్లతో 9వ ప్లేస్ లో నిలిచాడు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఓపెనర్ సంజూ శాంసన్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకాడు. ఆరంభంలో నిరాశపరిచిన సంజూ టోర్నీ చివర్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. కేవలం 5 మ్యాచ్ లలోనే 80కి పైగా సగటుతో 321 పరుగులు చేసిన సంజూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఏకంగా 18 స్థానాలు దూసుకొచ్చిన సంజూ శాంసన్ 22వ స్థానంలో నిలిచి కెరీర్ బెస్ట్ ర్యాంకును సాధించాడు.

మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో మాత్రం భారత్ కు నిరాశే మిగిలింది. వరుణ్ చక్రవర్తి అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పరిమితమయ్యాడు. తాజా జాబితాలో వరుణ్ 740 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిస్తే , ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 753 పాయింట్లతో టాప్ ప్లేసులోకి దూసుకొచ్చాడు. అయితే టీ20 ప్రపంచకప్ భారత్ తరపున నిలకడగా రాణించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగై ఆరో ర్యాంకులో నిలిచాడు.
ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 702 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టాప్ 10లో కేవలం ఇద్దరు భారత బౌలర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. మిగిలిన భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 16వ ర్యాంకులో కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్ ఆరు స్థానాలు మెరుగై 17వ ర్యాంకులో నిలిచాడు. ఇక ఆల్ రౌండర్ల విభాగంలో జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా అగ్రస్థానంలో ఉండగా.. భారత్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా రెండో స్థానంలో నిలిచాడు. మరో భారత ఆల్ రౌండర్ శివమ్ దూబే 11వ ర్యాంకులో నిలిచాడు.





