Just SportsLatest News

IND vs SL : లంక గడ్డపై స్పిన్ ఛాలెంజ్.. మరి భారత బ్యాటర్లు సిద్ధమేనా ?

IND vs SL : ఐపీఎల్, వైట్ బాల్ క్రికెట్ ఎక్కువైన తర్వాత భారత బ్యాటర్లకు స్పిన్ ఆడడం బలహీనతగా మారింది. ముఖ్యంగా రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ మ్యాచ్‌లలో టీమిండియా స్టార్ ప్లేయర్స్ ఎవరూ ఆడడం లేదు.

IND vs SL

భారత క్రికెట్ జట్టు శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌లో భారత్ 2-0తో గెలవాల్సి ఉంటుంది. లంక బలమంతా స్పిన్నర్లే కావడం ఇక్కడ భారత్ బ్యాటర్లకు అతి పెద్ద పరీక్షగా చెప్పొచ్చు.

ఎందుకంటే కొంతకాలంగా భారత బ్యాటర్లు స్పిన్నర్లను ఆడలేక చేతులెత్తేస్తున్నారు. స్వదేశంలో స్పిన్ వ్యూహంతో ప్రత్యర్థులను దెబ్బ కొడదామని ప్రయత్నించి చివరికి ఆ ఉచ్చులో తామే చిక్కుకున్నారు. గతేడాది సౌతాఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో ఓటములకు స్పిన్ ఆడలేకపోవడమే కారణం.

ఒకప్పుడు స్పిన్ ఆడడంలో తిరుగులేని భారత్ ఇప్పుడు బంతి గింగిరాలు తిరుగుతుంటే పెవిలియన్‌కు క్యూ కట్టేస్తున్నారు. కానీ ఐపీఎల్, వైట్ బాల్ క్రికెట్ ఎక్కువైన తర్వాత భారత బ్యాటర్లకు స్పిన్ ఆడడం బలహీనతగా మారింది. ముఖ్యంగా రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ మ్యాచ్‌లలో టీమిండియా స్టార్ ప్లేయర్స్ ఎవరూ ఆడడం లేదు.

ఇక లంక పిచ్‌లన్నీ కూడా పూర్తిగా స్పిన్‌కే స్వర్గధామంగా ఉంటాయి.  దీంతో భారత బ్యాటర్లకు కఠిన సవాల్ ఎదురుకాబోతోంది. లంక పిచ్‌లపై బాల్ విపరీతంగా టర్న్ అవుతుంది. అలాంటి బంతులను ఆడడం అంత ఈజీ కాదు. టెస్ట్ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలింగ్‌తో పోలిస్తే స్పిన్‌ను ఎదుర్కోవడం ఇంకా సవాల్ అనే చెప్పాలి.

ముఖ్యంగా గాలే పిచ్‌పై ప్రభాత్ జయసూర్య వంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను తట్టుకోవడం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టుకు పెద్ద పరీక్షగా చెబుతున్నారు. యువ బ్యాటర్లు స్పిన్‌కు వ్యతిరేకంగా డిఫెన్స్ ఆడటంలో ఇటీవల తడబడుతున్నారు. స్పిన్ పిచ్‌లపై స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో పాటు కచ్చితమైన ఫుట్‌వర్క్ ఉంటే క్రీజులో నిలదొక్కుకునే అవకాశముంటుంది.

IND vs SL
IND vs SL

మరి ఇలాంటి పిచ్‌లపై మన బ్యాటర్లు ఎంతవరకూ నిలదొక్కుకుని లంక స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. పైగా ఎనిమిదేళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై భారత్ టెస్ట్ ఆడుతోంది. దీంతో అక్కడి వాతావరణ పరిస్థితులకు, పిచ్‌లకు వీలైనంత త్వరగా అలవాటు పడితే తప్ప సిరీస్ విజయంపై ఆశలు పెట్టుకోలేం.

అయితే స్పిన్ బలహీనతను అధిగమించడానికి , లంక స్పిన్ ఉచ్చులో పడకుండా ఉండటానికి టీమిండియా ప్రస్తుతం ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమవుతోంది. లంక స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోవడానికి బీసీసీఐ నలుగురు యువ స్పిన్నర్లను  నెట్ బౌలర్లుగా శ్రీలంకకు పంపింది. ఆఫ్ స్పిన్నర్ తనుష్ కోటియన్ , లెగ్ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్, స్పిన్ ఆల్ రౌండర్ హర్ష్ దూబే, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.

Cortisol : అర్థరాత్రులు మెలకువ వస్తుందా? మీ బాడీని శాసిస్తున్న ఆ ఒక్క హార్మోన్ సీక్రెట్ అదే..

Related Articles

Back to top button