KKR vs GT: కోల్ కథ మారేనా ?…గుజరాత్ తో కీలక మ్యాచ్
KKR vs GT : ఐపీఎల్ 2026 సీజన్ మొదలై మూడు వారాలవుతోంది. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లు గెలుపును రుచి చూసాయి
KKR vs GT
ఐపీఎల్ 2026 సీజన్ మొదలై మూడు వారాలవుతోంది. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లు గెలుపును రుచి చూసాయి. కానీ ఒకే ఒక జట్టు మాత్రం ఇప్పటి వరకూ విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ టీమ్ మరేదో కాదు కోల్ కతా నైట్ రైడర్స్. కీలక ఆటగాళ్లంతా సమిష్టిగా విఫలమవుతున్న వేళ కేకేఆర్ ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్ లలో నాలుగు ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్లను పంచుకుంది.
ఈ పరాజయాల పరంపరకు తెరదించాలనుకుంటున్న కోల్ కతా శుక్రవారం గుజరాత్ టైటాన్స్(KKR vs GT) తో తలపడబోతోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. నిజానికి కోల్ కతా జట్టు పేపర్ పై బలంగానే ఉన్నా గ్రౌండ్ లో మాత్రం తేలిపోతోంది. ఏకంగా రూ.25.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న గ్రీన్ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచ్ లోనూ సరిగ్గా ఆడలేదు.
బంతితో కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో అతని స్థానంలో మరొక ప్లేయర్ ను ఆడించాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో కెప్టెన్ రహానే , ఫిన్ అలెన్ కూడా నిరాశపరుస్తున్నారు. రఘువంశీ పర్వాలేదనిపిస్తున్నా మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ రాణించడం లేదు. రింకూ సింగ్ ఒక్క మ్యాచ్ లోనూ తన సత్తా చాటలేకపోయాడు.
రమణ్ దీప్ సింగ్, రోవమన్ పావెల్ పై అంచనాలున్నాయి. అటు బౌలింగ్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి మిస్టరీ అంతా హిస్టరీలో కలిసిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైభవ్ అరోరా, అనుకుల్ భారీగా పరుగులు ఇచ్చేస్తుండగా కార్తీక్ త్యాగీ పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలర్లు కూడా పూర్తిగా గాడిన పడితేనే కోల్ కతా తొలి విజయాన్ని అందుకునే అవకాశముంటుంది. ప్రస్తుతం కోల్ కతా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయి ఒత్తిడిలో పడిన గుజరాత్ తర్వాత అద్భుతంగా పుంజుకుంది,. వరుసగా రాజస్థాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ పై విజయాలు నమోదు చేసింది. గుజరాత్ బ్యాటింగ్ లో బట్లర్ , కెప్టెన్ గిల్ ఫామ్ లో ఉన్నారు.

గత మ్యాచ్ లో లక్నోపై సాయి సుదర్శన్ నిరాశపరిచినా బట్లర్ , గిల్ మాత్రం అదరగొట్టారు. వీరిద్దరి విధ్వంసంతోనే మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. తెవాటియా, వాషింగ్టన్ సుందర్ చివరి ఓవర్లలో హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్నవారే. అటు బౌలింగ్ లో రబాడ, సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణ పేస్ భారాన్ని మోస్తుండగా.. స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ కీలకంగా ఉన్నాడు.
వాషింగ్టన్ సుందర్ తో పాటు రషీద్ ఖాన్ కూడా రాణిస్తే తిరుగుండదు. కాగా గత రికార్డులను చూస్తే గుజరాత్ దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు నాలుగుసార్లు తలపడితే మూడు మ్యాచ్ లలో గుజరాత్(KKR vs GT) గెలిచింది.ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది.





