Just SportsLatest News

MS Dhoni : సీఎస్కే ఫ్యాన్స్ కు బిగ్ షాక్…ధోనీ రెండు వారాలు ఔట్

MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. సీఎస్కే స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రెండు వారాల పాటు మ్యాచ్ లకు దూరం కానున్నాడు

MS Dhoni

ఐపీఎల్ 19 సీజన్ ఇవాల్టి నుంచే మొదలవుతోంది. ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతున్నాయి. ఈ సీజన్ కోసం మిగిలిన జట్లు కూడా వ్యూహాలతో సిద్ధమయ్యాయి. అయితే సీజన్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది.

సీఎస్కే స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) రెండు వారాల పాటు మ్యాచ్ లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని చెన్నై ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. కండరాల నొప్పి కారణంగా ధోనీ దూరమైనట్టు తెలిపింది. ఐపీఎల్ 19వ సీజన్ కోసం ధోనీ చెన్నై క్యాంపులో చేరినప్పటి నుంచే కాస్త అసౌకర్యంగా కనిపించాడు.

నెట్స్ లో భారీ షాట్లు కొట్టినా కాస్త ఇబ్బంది పడ్డాడు. సీజన్ ఆరంభ సమయానికి కోలుకుంటాడని అంతా అనుకున్నారు. ఇప్పుడు కండరాల నొప్పి ఇంకా తగ్గకపోవడంతో రెండు వారాలు తప్పుకున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తొలి నాలుగు మ్యాచ్ లకు ధోనీ(MS Dhoni) అందుబాటులో ఉండడు. అతని స్థానంలో సంజూ శాంసన్ కీపింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు.

సంజూను చెన్నై ఫ్రాంచైజీ ట్రేడింగ్ లో జడేజా, సామ్ కరన్ లను ఇచ్చేసి తీసుకుంది. అయితే ఉర్విల్ పటేల్ రూపంలో మరో యువ కీపర్ కూడా చెన్నై జట్టులో ఉన్నాడు. సంజూ, ఉర్విల్ లలో ఒకరికి కీపింగ్ బాధ్యతలు దక్కొచ్చు.

ఇదిలా ఉంటే ధోనీ దూరమవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. అసలు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి ఉండే ఫాలోయింగ్ అంతా ధోనీ కోసమే. ఏకంగా ఐదుసార్లు సీఎస్కేను ఛాంపియన్ గా నిలబెట్టిన ధోనీ వయసు పెరిగినా ఫ్యాన్స్ కోసమే ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. గత మూడు, నాలుగు సీజన్లుగా రిటైరవుతాడని వార్తలు వచ్చినా వాటిని కొట్టిపారేశాడు.

MS Dhoni
MS Dhoni

అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుగానే కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్ కు బాధ్యతలు అప్పగించాడు. కానీ గత సీజన్ లో ధోనీ అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దింపినా అంత ప్రభావం చూపించలేదు. మునుపటి ధోనీ తరహా విధ్వంసకర షాట్లు ఆడలేకపోతున్నాడు.

అయితే మైదానంలో అతను ఉంటే మాత్రం వ్యూహాల పరంగా సీఎస్కేకు కలిసొచ్చే అంశం. ఇప్పుడు ధోనీ లేకపోవడం ఖచ్చితంగా చెన్నైకి ఎదురుదెబ్బగానే చెప్పాలి. కండరాల నొప్పి నుంచి కోలుకున్న వెంటనే జట్టుతో కలుస్తాడని సీఎస్కే ఫ్రాంచైజీ తెలిపింది. ధోనీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసింది.

RCB vs SRH : ఆరంభ పోరులో అదరగొట్టేదెవరు ?…ఇవాళ ఆర్సీబీతో సన్ రైజర్స్ ఢీ

Related Articles

Back to top button