MS Dhoni : అన్ని మ్యాచ్ లు ఆడనున్న ధోనీ.. సీఎస్కే సీఈవో ప్రకటన
MS Dhoni : అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై ఐదేళ్లు దాటిపోయినా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు
MS Dhoni
ఐపీఎల్ వస్తుందంటే చాలు కొంతమంది స్టార్ ఆటగాళ్లపైనే అభిమానుల చూపు ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై ఐదేళ్లు దాటిపోయినా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రతీ ఐపీఎల్(IPL) సీజన్ లోనూ ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉన్నాడు. అయితే కొంతకాలంగా ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు దీనిపై మహి మాట దాటవేస్తూ వస్తున్నాడు.
గత ఏడాది మోకాలికి సర్జరీ తర్వాత మునుపటి వేగం ధోనీలో కనిపించలేదు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ ఆడతాడో లేదోనని చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ధోనీ(MS Dhoni) ఆడతాడని గతంలోనే స్పష్టం చేసింది. అదే సమయంలో సంజూ శాంసన్ ను ట్రేడింగ్ ద్వారా తీసుకోవడంతో ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్ గా, అది కూడా కొన్ని మ్యాచ్ లే ఆడతాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చాడు.
ఐపీఎల్ 2026 సీజన్ లో అన్ని మ్యాచ్ లూ ధోనీ ఆడతాడని స్పష్టం చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ గా ఆడతాడా లేక ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే ఆడతాడా అనే దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దానిపై టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కానీ ధోనీ సీజన్ మొత్తం బరిలోకి దిగుతాడని మాత్రం తేల్చి చెప్పేశారు. కాగా ఐపీఎల్ షెడ్యూల్ ఆలస్యంపైనా విశ్వనాథన్ స్పందించారు. తాము కూడా షెడ్యూల్ కోసమే ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

తమిళనాడులో ఎన్నికలు జరుగబోతుండడం, మిగిలిన రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉండడంతో షెడ్యూల్ ఆలస్యమవుతోందన్నారు. చెన్నైలో జరిగే మ్యాచ్ లకు సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని చెప్పారు. తమిళనాడు అభిమానులు మ్యాచ్ లు ఎక్కడ జరిగినా మద్ధతిస్తారని, ఫైనల్ గా ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమన్నారు.
కాగా ధోనీ ఫ్యూచర్ పై సీఎస్కే సీఈవో ఇచ్చిన క్లారిటీతో చాలామంది అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగితే సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకుంటాడని సమాచారం. సంజూ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జడేజా, సామ్ కరన్ లను రాజస్థాన్ రాయల్స్ కు వదిలేసింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి మొదలుకానుంది.





