Just SportsLatest News

Mumbai Indians : ముంబై ఓటములకు బ్రేక్ పడేనా ?..లక్నోతో పోరుకు సిద్ధం

Mumbai Indians : ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా పేరు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్ ఈసారి కూడా బోల్తా పడింది

Mumbai Indians

ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా పేరు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఈసారి కూడా బోల్తా పడింది. పేలవ ఫామ్ తో నిరాశపరిచింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగి ఇప్పటి వరకూ 9 మ్యాచ్ లలో కేవలం రెండే విజయాలను సాధించింది. ఏడింటిలో పరాజయం పాలై పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.

అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ అంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. కెప్టెన్ హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ , రికెల్టన్ , తిలక్ వర్మ ఇలా ఎవ్వరూ స్థాయికి తగినట్టు ఆడలేదు. తిలక్ వర్మ ఒకటిరెండు మ్యాచ్ లలో ఆడినా మిగిలిన మ్యాచ్ లలో మాత్రం నిరాశపరిచాడు. రోహిత్ శర్మ గాయంతో దూరమవడం కూడా ప్రభావం చూపింది.

అటు బౌలింగ్ లోనూ ఇదే పరిస్థితి. ఆశ్చర్యకరంగా స్టార్ పేసర్ బుమ్రా సీజన్ మొత్తం ఫ్లాప్ అయ్యాడు. దాదాపు ఆరు మ్యాచ్ ల వరకూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బుమ్రా వైఫల్యం కూడా ముంబై(Mumbai Indians) వరుస ఓటములకు ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఓటమితోనే ముంబై(Mumbai Indians) ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా కోల్పోయింది.

మిగిలిన అన్ని మ్యాచ్ లూ గెలిచినా కూడా ఇతర జట్ల సమీకరణాలు కలిసొస్తే ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశముంటుంది. కీలక ఆటగాళ్లు ఫామ్ లోకి వచ్చి సమిష్టిగా రాణిస్తే కానీ ముంబై వరుస ఓటములకు బ్రేక్ పడే అవకాశాలు కనిపించడం లేదు. అయితే హార్థిక్ పాండ్యా కెప్టెన్సీపైనా, అతని వ్యక్తిగత ఫామ్ పైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బౌలింగ్ మార్పుల విషయంలో పాండ్యా వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. దీంతో తుది జట్టు ఎంపికలోనూ మార్పులు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఈ సీజన్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. 8 మ్యాచ్ లు ఆడిన లక్నో రెండు విజయాలు సాధించగా.. ఆరింటిలో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. గత మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై గెలిచే మ్యాచ్ ను చేజార్చుకోవడం లక్నో అభిమానులకు షాక్ ఇచ్చింది.

Mumbai Indians
Mumbai Indians

కెప్టెన్ గానూ, బ్యాటర్ గానూ రిషబ్ పంత్ ఘోరంగా విఫలమవుతున్నాడు. మిఛెల్ మార్ష్ , మార్కరమ్, పూరన్ , ఆయుశ్ బదోనీ వంటి హిట్టర్లు ఉన్నా నిలకడ లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఒక మ్యాచ్ ఆడితే నాలుగు మ్యాచ్ లు సింగిల్ డిజిట్ కే ఔట్ అవుతున్నారు. అటు బౌలింగ్ లో షమీ రాణిస్తున్నా మిగిలిన బౌలర్ల నుంచి పూర్తి సపోర్ట్ దక్కడం లేదు.

స్పిన్ విభాగంలో దిగ్వేశ్ సింగ్ రాఠి కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమిష్టిగా రాణిస్తే తప్ప లక్నో గెలుపు సాధించే పరిస్థితి కనిపించడం లేదు. వాంఖడే స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది.

Gujarat Titans : పంజాబ్ కింగ్స్ కు షాక్..గుజరాత్ అదిరిపోయే విజయం

Related Articles

Back to top button