Just SportsLatest News

T20 World Cup : మన షెడ్యూల్ మనదే..పాక్ ఆడకున్నా కొలంబోకు భారత్

T20 World Cup : బంగ్లాదేశ్ పై అతి ప్రేమతో, భారత్ అంటే ఉన్న పగతో పాక్ జట్టు చేస్తున్న ఓవరాక్షన్ చివరికి వాళ్ళకే నష్టం చేకూర్చనుంది.

T20 World Cup

ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్(T20 World Cup) ను ఆస్వాదించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వార్మప్ మ్యాచ్ ల హడావుడి మొదలైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. మిగిలిన జట్లలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి వాటిపై అంచనాలున్నాయి. అయితే ఈ సారి వరల్డ్ కప్ లో భారత్, పాక్ మ్యాచ్ పైనే అందరి దృష్టి ఉంది.

నిన్నటి వరకూ ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్న అంచనాలుంటే , ఇప్పుడు భారత్ తో మ్యాచ్ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడంతో సీన్ మారిపోయింది. ఈ విషయంలో తమ ప్రభుత్వ ఆదేశాలనే పాక్ బోర్డు పాటిస్తోంది. భారత్ తో మ్యాచ్ తప్పిస్తే మిగిలిన మ్యాచ్ లు ఆడేందుకు పాక్ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించింది. దీనిపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. ప్రస్తుతానికి పాక్ బోర్డు నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు.

గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం భారత్, పాక్ మ్యాచ్ తటస్థ వేదికపైనే జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ కొలంబో వెళ్లాలి. ఇప్పుడు పాక్ బాయ్ కాట్ నిర్ణయంతో ఇక కొలంబో వెళ్లదేమోనని చాలా మంది అనుకుంటున్నారు. కానీ బీసీసీఐ దీనిపై క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్ ఆడినా, ఆడకున్నా భారత క్రికెట్ జట్టు కొలంబోకు వెళుతుంది. ఐసీసీ మ్యాచ్ రిఫరీ అధికారికంగా పాక్ బహిష్కరణ తర్వాత వాకోవర్ నిర్ణయం ప్రకటించే వరకూ అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తుంది.

T20 World Cup
T20 World Cup

పాక్ తో మ్యాచ్ కోసం షెడ్యూల్ ప్రకారమే టీమిండియా కొలంబో చేరుకుని ప్రాక్టీస్, మీడియా సమావేశంలో పాల్గొంటుంది. టీ ట్వంటీ ప్రపంచకప్(T20 World Cup) మ్యాచ్ రోజు సూర్యకుమార్ యాదవ్ టాస్ కోసం గ్రౌండ్ లోకి కూడా వెళతాడు. టాస్ కు ప్రత్యర్థి పాక్ జట్టు కెప్టెన్ రాకపోయిన పక్షంలో అధికారకంగా వాకోవర్ రిఫరీ ప్రకటిస్తాడు. అప్పటి వరకూ ఐసీసీ ప్రోటోకాల్స్ ను భారత జట్టు అనుసరించాల్సి ఉంటుంది. అంటే పాక్ జట్టు బాయ్ కాట్ చేసినా భారత్ షెడ్యూల్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.

వాకోవర్ నిబంధనల ప్రకారం టాస్ సమయంలో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ రాకుంటే భారత్ ను విజేతగా ప్రకటిస్తూ 2 పాయింట్లు కేటాయిస్తారు. అటు పాక్ జట్టు పాయింట్లు కోల్పోవడంతో పాటు సూపర్ 8 అవకాశాలను క్లిష్టం చేసుకుంటుంది. బంగ్లాదేశ్ పై అతి ప్రేమతో, భారత్ అంటే ఉన్న పగతో పాక్ జట్టు చేస్తున్న ఓవరాక్షన్ చివరికి వాళ్ళకే నష్టం చేకూర్చనుంది.

ICC : ఇదేమైనా గల్లీ టోర్నీనా ?..పాక్ బోర్డుకు ఐసీసీ వార్నింగ్

Related Articles

Back to top button