RCB : ఫైనల్లో బెంగళూరు..చిత్తుగా ఓడిన గుజరాత్

RCB : గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఫైనల్లో ప్రవేశించింది

RCB

ఐపీఎల్ 19వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫైనల్ కు దూసుకెళ్ళింది. ధర్మశాల వేదికగా ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన ఆర్సీబీ గుజరాత్ ను చిత్తు చేసింది. బ్యాటింగ్ లో పటిదార్ విధ్వంసానికి కోహ్లీ, కృనాల్ మెరుపులు తోడవగా…బౌలింగ్ లో డఫీ, రసిక్ సలామ్ దార్ టైటాన్స్ ను దెబ్బకొట్టారు. ఈ విజయంతో ఆర్సీబీ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టగా.. ఓడిన గుజరాత్ ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫైయర్ 2లో తలపడుతుంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరు(RCB) తన తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సాల్ట్ బెంచ్ కే పరిమితమవగా వెంకటేశ్ అయ్యర్, కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించారు. వీరిద్దరూ తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడారు. అయ్యర్ 7 బంతుల్లో 19 (3 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులకు ఔటవగా.. కోహ్లీ, పడిక్కల్ ఇన్నింగ్స్ కొనసాగించారు.

పవర్ ప్లేలో బెంగళూరు 76 పరుగులు చేసింది. కోహ్లీ (43), పడిక్కల్(30) రెండో వికెట్ కు 72 పరుగులు జోడించారు. అయితే జాసన్ హోల్డర్ ఒకే ఓవర్లో వీరిద్దరినీ ఔట్ చేశాడు. కానీ ఆర్సీబీ జోరు మాత్రం ఆగలేదు. పటిదార్, కృనాల్ పాండ్యా దుమ్మురేపారు. నాలుగో వికెట్ కు 45 బంతుల్లోనే 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 43 (5 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. పటిదార్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు.

గుజరాత్ బౌలర్లను ఉతికారేసిన పటిదార్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 93 (5 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగులు చేయగా.. చివర్లో జితేశ్ శర్మ (5 బంతుల్లో 15) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఫలితంగా ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో రబాడ 2, హోల్డర్ 2 , ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీసారు.

ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే తడబడింది. ఈ సీజన్ లో గుజరాత్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ నిరాశపరిచారు. టాప్ 3 ఆడని మ్యాచ్ లలో టైటాన్స్ ఓడిపోతున్న సంప్రదాయం క్వాలిఫైయర్ 1లోనూ కొనసాగింది. సాయి సుదర్శన్ 14, గిల్ 2 , బట్లర్ 29 , నిశాంత్ సంధు 5 , హోల్డర్ డకౌటయ్యారు.

RCB

గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేలోనే సగం వికెట్లు కోల్పోయింది. ఇక్కడే ఆ జట్టు ఓటమి ఖాయమైపోయింది. వాషింగ్టన్ సుందర్ (8), రషీద్ ఖాన్ (8), రబాడ (9) పరుగులకే ఔటవగా కనీసం 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే విజయంపై ఆశలు లేకపోయినా సరే తెవాటియా మెరుపులు మెరిపించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

దీంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆర్సీబీ(RCB) బౌలర్లలో డఫీ 3 , రసిక్ సలామ్ దార్ 2 , హ్యాజిల్ వుడ్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో బెంగళూరు ఫైనల్ కు చేరుకోగా, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ 2లో సన్ రైజర్స్ లేదా రాజస్థాన్ తో తలపడుతుంది.

TTD : శ్రీవారి భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..2 నుంచి 4 గంటల్లోనే స్వామివారి దర్శనం

Exit mobile version