RCB : అహ్మదాబాద్ లో విరాట పర్వం..ఆర్సీబీదే ఐపీఎల్ ట్రోఫీ
RCB : వరుసగా రెండోసారి టైటిల్ ను సొంతం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి సీజన్ ఆరంభం నుంచీ అద్భుతంగా ఆడిన ఆర్సీబీ తుది పోరులోనూ సత్తా చాటింది
RCB
ఐపీఎల్ 2026 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచింది. వరుసగా రెండోసారి టైటిల్ ను సొంతం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి సీజన్ ఆరంభం నుంచీ అద్భుతంగా ఆడిన ఆర్సీబీ(RCB) తుది పోరులోనూ సత్తా చాటింది. గుజరాత్ టైటాన్స్ కు వారి హోంగ్రౌండ్ లోనే చెక్ పెట్టి బ్యాక్ టూ బ్యాక్ టైటిల్స్ ను గెలుచుకుంది.
ఫైనల్లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ పటిదార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ భారీస్కోరు చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఫామ్ లో ఉన్న ఆర్సీబీ(RCB) బౌలర్లు చెలరేగిపోయారు. పేసర్లు సమిష్టిగా రాణించి గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ ను దెబ్బతీశారు. సీజన్ ఆద్యంతం సూపర్ ఫామ్ లో ఉన్న గిల్, సాయి సుదర్శన్ అసలైన పోరులో చేతులెత్తేశారు.
ఈ సీజన్ లో గుజరాత్ విజయాలకు ప్రధాన కారణం టాపార్డర్ బ్యాటర్లే. దీంతో ఆర్బీబీ బౌలర్లు వారిపైనే ఫోకస్ పెట్టారు. పవర్ ప్లే ముగిసే లోపే గిల్ (10), సాయి సుదర్శన్ (12)ను ఔట్ చేశారు. నిశాంత్ సింధు(20) పర్వాలేదనిపించగా.. ఆదుకుంటాడనుకున్న బట్లర్ (19) కూడా నిరాశపరిచాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్లో వెనకబడి పోయింది.
లీగ్ స్టేజ్ లో భారీస్కోర్లు చేసిన ఆ జట్టు బంతికో పరుగు తీసేందుకు శ్రమించింది. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ గుజరాత్ ను ఆదుకున్నాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అర్షద్ ఖాన్ తో 26 పరుగులు, తెవాటియాతో 16 , జాసన్ హోల్డర్ తో 27 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫలితంగా గుజరాత్ స్కోరు 150 దాటగలిగింది. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తెవాటియా (7), రషీద్ ఖాన్ (7), హోల్డర్ (7) పరుగులకు వెనుదిరిగారు.
దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ దార్ అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ 2 , హ్యాజిల్ వుడ్ 2 , కృనాల్ పాండ్యా 1 వికెట్ పడగొట్టారు.
ఛేజింగ్ లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడుగా ఆడింది. వెంకటేశ్ అయ్యర్ , కోహ్లీ దూకుడుగా ఆడడంతో ఆర్సీబీకి మెరుపు ఆరంభమే దక్కింది. తొలి వికెట్ కు ఓపెనర్లు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించారు. వెంకటేశ్ అయ్యర్ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులకు ఔటయ్యాడు.

తర్వాత పడిక్కల్ (1), పటిదార్ (15), కృనాల్ పాండ్యా (1) వెంటవెంటనే ఔటవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ లో టెన్షన్ కనిపించింది. అయితే విరాట్ కోహ్లీ గుజరాత్ బౌలర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా చెలరేగి ఆడాడు. టిమ్ డేవిడ్ తో కలిసి ఐదో వికెట్ కు 41 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కోహ్లీతో కలిసి దూకుడుగా ఆడిన టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 24 రన్స్ కు వెనుదిరిగాడు. తర్వాత కోహ్లీ, జితేశ్ శర్మ బెంగళూరు విజయాన్ని పూర్తి చేశారు. దీంతో వరుసగా రెండోసారి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.





