RR vs DC : రాజస్థాన్ కు ఢిల్లీ టెన్షన్..ఓడితే ప్లే ఆఫ్స్ కు కష్టమే
RR vs DC : రాజస్థాన్ రాయల్స్ కీలక పోరుకు సిద్ధమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడబోతోంది
RR vs DC
ఐపీఎల్ 19వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(RR vs DC) తో తలపడబోతోంది. వరుసగా రెండు ఓటములతో ఒత్తిడిలో ఉన్న రాజస్థాన్ కు ఇప్పుడు విజయం తప్పనిసరి. ఓడితే మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలు ప్రమాదంలో పడతాయి.
తర్వాత మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలవాలని రాజస్థాన్ పట్టుదలగా ఉంది. పంజాబ్ కింగ్స్ పై గెలిచిన తర్వాత వరుసగా ఢిల్లీ, గుజరాత్ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
బ్యాటింగ్ పరంగా వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ అద్భుత ఆరంభాలను ఇస్తున్నా మిగిలిన బ్యాటర్లు నిలకడలేమి మైనస్ గా మారింది. హెట్ మెయిర్, జురెల్, తెవాటియా వంటి వాళ్లు స్థాయికి తగినట్టు ఆడడం లేదు. ఫెరీరా, శుభమ్ దూబే కూడా ఫినిషింగ్ లో అదరగొట్టలేకపోతుండడం కూడా రాయల్స్ కు ఇబ్బందిగా మారింది. కీలక బ్యాటర్లు గాడిన పడితే తప్ప రాజస్థాన్ గెలుపు బాట పట్టే పరిస్థితి కనిపించడం లేదు. బౌలింగ్ లో ఆర్చర్, తుషార్ దేశ్ పాండే పేస్ విభాగంలో కీలకం కానుండగా.. స్పిన్ విభాగంలో జడేజా సత్తా చాటుతున్నాడు.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ప్లే ఆఫ్ రేసులో నిలిచే ఉంది. 12 మ్యాచ్ లలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఢిల్లీ మిగిలిన రెండింటిలో గెలవాల్సిందే. అప్పుడు కూడా ఇతర జట్ల ఫలితాలు కలిసొస్తేనే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. అదే సమయంలో రన్ రేట్ ను కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.

గత మ్యాచ్ లో ఊహించని విధంగా పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది. బ్యాటర్లు అదరగొట్టడంతో 218 పరుగుల టార్గెట్ ను అలవోకగా ఛేదించింది. సీజన్ ఆరంభంలో ఆకట్టుకున్న ఢిల్లీ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడింది. కీలక ఆటగాళ్లు అంచనాల మేర రాణించకపోవడం ఆ జట్టు ఓటములకు కారణంగా చెప్పొచ్చు.
బ్యాటింగ్ లో ఓపెనర్ల నిలకడ లేమితో పాటు రిజ్వీ, స్టబ్స్ , మిల్లర్ లాంటి బ్యాటర్లున్నా అంచనాలు అందుకోలేకపోతున్నారు. బౌలింగ్ లో మిఛెల్ స్టార్క్ ఎంట్రీతో బలం పెరిగినా సరే మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చేస్తున్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కీలక సమయాల్లో వికెట్లు తీయలేకపోతుండడం కూడా ఢిల్లీకి ఇబ్బందిగా మారింది.
PBKS vs RCB : పంజాబ్ కు చావోరేవో..ప్లే ఆఫ్ బెర్తుపై ఆర్సీబీ కన్ను





