Just SportsLatest News

Sanju Samson : సంజూ సూపర్ శాంసన్…ఇది కదా నీ అసలు ఆట

Sanju Samson : గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. కానీ స్టేడియంలో కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటుంది... ప్రస్తుతం ఈ సినిమా డైలాగ్ భారత క్రికెటర్ సంజూ శాంసన్ సరిగ్గా సరిపోతుంది

Sanju Samson

గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. కానీ స్టేడియంలో కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటుంది… ప్రస్తుతం ఈ సినిమా డైలాగ్ భారత క్రికెటర్ సంజూ శాంసన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఎన్ని అవకాశాలిచ్చినా వృథా చేసుకుంటాడు… నిలకడ లేదు.. జట్టులో ఉంచడం కూడా వృథా.. ఇవీ సంజూ శాంసన్(Sanju Samson) పై తరచూ వినిపించే మాటలు.. నిజమే వీటిలోనూ నిజం లేకపోలేదు.

చాలా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్ కు ఎంతో విలువ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాచ్ ను గెలిపించే బ్యాటింగ్ ఆడితే ఆ ఆటగాడు ఎప్పటికీ గుర్తుండిపోతాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ దీనినే ఆస్వాదిస్తున్నాడు. వెస్టిండీస్ తో కీలక మ్యాచ్ లో సంజూ జూలు విదిల్చాడు. నాకౌట్ పోరులో దుమ్మురేపాడు. ఇది కదా నీ అసలైన ఆట అంటూ అభిమానులు కేరింతలు కొట్టేలా బ్యాటింగ్ చేశాడు.

గత మ్యాచ్ లో కూడా మంచి ఆరంభాన్ని భారీస్కోరుగా మలచలేకపోయాడు. అయితే విండీస్ పై మరో అవకాశాన్ని దక్కించుకున్న సంజూ ఈ సారి మాత్రం వదల్లేదు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్ త్వరగానే ఔటైనా ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. సంజూకు తెలుసు కొద్దిసేపు క్రీజులో నిలదొక్కుకుంటే మ్యాచ్ ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడగలనని.. దీనిని బాగా గుర్తు పెట్టుకున్న సంజూ ఔట్ ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు.

అలాగని వన్డే తరహా బ్యాటింగ్ ఏమీ ఆడలేదు. భారీ షాట్లతో ఎక్కడా సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోకుండా చూసుకున్నాడు. మధ్యలో తిలక్ వర్మ ఇచ్చిన సపోర్ట్ కూడా సంజూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లో కీలకంగా చెప్పొచ్చు. నిజానికి సంజూకు ఈ ప్రపంచకప్ లో ఎక్కువ అవకాశాలు రాకపోవడానికి అతని పేలవ ఫామే కారణం. అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నా కూడా సంజూను తుది జట్టులోకి తీసుకోలేదు.

Sanju Samson
Sanju Samson

అయితే రింకూ సింగ్ వైఫల్యాలతో ఎట్టకేలకు జింబాబ్వేతో మ్యాచ్ లో జట్టులోకి వచ్చాడు. 24 పరుగులకే వెనుదిరిగాడు. విండీస్ తో మ్యాచ్ లో ఒకవేళ ఫెయిలై ఉంటే మాత్రం ఖచ్చితంగా అతని కెరీర్ పై గట్టి ఎఫెక్ట్ పడేది. సెమీస్ కు చేరినా సంజూకు చోటు దక్కేది కాదు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన సంజూ శాంసన్ జట్టును గెలిపించడమే లక్ష్యంగా ఆడాడు.

క్రీజులో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉన్న సంజూ మొహంలో ఆ పట్టుదల కూడా కనిపించింది. మొత్తం మీద కీలక మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి హీరోగా నిలిచిన సంజూ శాంసన్(Sanju Samson) సెమీఫైనల్లో కూడా ఇదే ఫామ్ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button