Shane Warne : షేన్ వార్న్ ముందుచూపు…కుటుంబానికి రూ.450 కోట్లు
Shane Warne : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ అమ్మకం ద్వారా.. ఆ జట్టు మాజీ కెప్టెన్ షేన్ వార్న్ కుటుంబానికి జాక్ పాట్ దక్కింది
Shane Warne
అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రికెటర్లందరూ ఆర్థికంగా భారీగానే సంపాదించుకుంటారు. మ్యాచ్ ఫీజులతో పాటు ఎండోర్స్ మెంట్స్ ద్వారా పెద్ద ఎత్తున ఆర్జిస్తుంటారు. అయితే ఆదాయాన్ని పొందడమే కాదు దానిని సరైన క్రమంలో ప్రణాళిక వేసుకుని సేవింగ్ చేయడం కూడా ముఖ్యమే. క్రికెటర్లలో పలువురు ఆర్థిక క్రమశిక్షణ లేక పాతాళానికి పడిపోయిన వారిని కూడా చూసాం.
అయితే భవిష్యత్తుపై సరైన ముందుచూపు ఉంటే కోట్ల రూపాయలు సంపాదించవచ్చని క్రికెట్ దిగ్గజం, దివంగత ఆసీస్ స్పిన్నర్ షేన్ వార్న్(Shane Warne) నిరూపించాడు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించినప్పుడు వార్న్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఇవాళ అతని కుటుంబానికి రూ.450 కోట్లను తెచ్చిపెట్టింది.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతలను షేన్ వార్న్(Shane Warne) కు అప్పగించారు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచినా వార్న్ జట్టును అద్భుతంగా నడిపించి ఛాంపియన్ గా నిలిపాడు. అదే సమయంలో ఫ్రాంచైజీతో ఒప్పందం విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు.
తనకు ఆఫర్ చేసిన జీతం మొత్తానికి బదులు ఫ్రాంచైజీలో 0.75 శాతం వాటా తీసుకున్నాడు. నాలుగు సీజన్ల పాటు రాజస్థాన్ కు ఆడిన వార్న్ వాటా కూడా 3 శాతానికి చేరింది. క్రమంగా ఫ్రాంచైజీ విలువ పెరగడం వార్న్ కు కోట్లు తెచ్చిపెట్టింది. వాటా విలువ కోట్లకు చేరినా దానిని అతను విక్రయించలేదు.

తాజాగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని అమెరికా వ్యాపారవేత్త సోమానీ కన్సార్టియం రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో షేన్ వార్న్ 3 శాతం వాటాకు కూడా భారీ మొత్తమే దక్కింది. ఏకంగా రూ.450 కోట్ల రూపాయలు అతని కుటుంబానికి వచ్చింది. ప్రస్తుతానికి రూ.450 కోట్ల వాటాను వార్న్ కుటుంబం ఇంకా విక్రయించలేదు. భవిష్యత్తులో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూతో పాటే ఫ్రాంచైజీ విలువ కూడా మరింత పెరగడం ఖాయం.
దీని ప్రకారం చూస్తే రానున్న రోజుల్లో ఇది రెట్టింపయినా ఆశ్చర్యం లేదు. ఇదిలా ఉంటే షేన్ వార్న్ ముందుచూపుపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. మైదానంలో ప్రత్యర్థి బ్యాటర్లను తన స్పిన్ మాయాజాలంతో ఉక్కిరిబిక్కిరి చేసిన వార్న్ కు అంతకంటే అద్భుతమైన బిజినెస్ మైండ్ ఉందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. అతని ముందుచూపు కారణంగానే ఇవాళ వార్న్ కుటుంబానికి రూ.450 కోట్లు వచ్చాయని చెబుతున్నారు.
RCB : ఆర్సీబీ సేల్ @ 16 వేల కోట్లు…గంటల్లోనే రాజస్థాన్ రికార్డు బ్రేక్





