Sunrisers Hyderabad : సన్ రైజర్స్ జైత్రయాత్ర..రాజస్థాన్ పై ఘనవిజయం
Sunrisers Hyderabad : హోంగ్రౌండ్ లో హ్యాట్రిక్ విజయాలు సన్ రైజర్స్ కు తిరుగులేని ఉత్సాహాన్నిచ్చాయి. అదే జోష్ తో బయటి వేదికల్లో సైతం జైత్రయాత్ర మొదలుపెట్టింది.
Sunrisers Hyderabad
హోంగ్రౌండ్ లో హ్యాట్రిక్ విజయాలు సన్ రైజర్స్(Sunrisers Hyderabad) కు తిరుగులేని ఉత్సాహాన్నిచ్చాయి. అదే జోష్ తో బయటి వేదికల్లో సైతం జైత్రయాత్ర మొదలుపెట్టింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. 229 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ కు ఇది రెండో అత్యధిక ఛేదన.
అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ విధ్వంసంతో హైదరాబాద్ అలవోకగా గెలుపును అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఎస్ఆర్ హెచ్(Sunrisers Hyderabad) ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ కమిన్స్ తిరిగి వచ్చాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ దూకుడుగా ఆడారు. జైస్వాల్ 10 పరుగులకే ఔటైనా వైభవ్ మాత్రం రెచ్చిపోయాడు.
తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ విధ్వంసం సృష్టించాడు. మరోసారి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరంత దూకుడుగా ఆడడంతో రాజస్థాన్ స్కోరుబోర్డు టాప్ గేర్ లో సాగింది. అటు జురెల్ కూడా ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ 112 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేయగా.. వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు.
సిక్సర్ తో సెంచరీ కంప్లీట్ చేసుకున్న ఈ చిచ్చర పిడుగు పలు రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే అతను ఈ ఫీట్‌ను అందుకున్నాడు. అలాగే టీ20 క్రికెట్‌లో 1000 రన్స్ చేసిన అతి పిన్న వయస్కుడిగానూ రికార్డులకెక్కాడు. ఇక ఐపీఎల్‌లో పిన్న వయస్సులో ఎక్కువసార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. తర్వాత వికెట్లు పడినా ఫెరీరా(33) ధాటిగా ఆడడంతో రాజస్థాన్ రాయల్స్ 228 పరుగులు చేసింది.

ఛేజింగ్ లో సన్ రైజర్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ హెడ్(6) పరుగులకే ఔటయ్యాడు. అయితే ఇక్కడ నుంచి ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ రాజస్థాన్ బౌలర్లను ఆటాడుకున్నారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అభిషేక్ తన ఫామ్ కంటిన్యూ చేయగా.. ఇషాన్ కిషన్ కూడా మెరుపులు మెరిపించాడు.
వీరిద్దరూ రెండో వికెట్ కు 55 బంతుల్లోనే 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 29 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అభిషేక్ ఔటైనా ఇషాన్ కిషన్ దూకుడు కొనసాగింది.కేవలం 31 బంతుల్లోనే 74 (11 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. తర్వాత క్లాసెన్(29), నితీష్ రెడ్డి(36) ఎటాకింగ్ బ్యాటింగ్ తో జట్టును విజయానికి చేరువ చేశారు. చివర్లో అరోరా, అనికేత్ వర్మ సన్ రైజర్స్ విజయాన్ని పూర్తి చేశారు. ఫలితంగా సన్ రైజర్స్ మరో 9 బంతులు మిగిలుండగానే టార్గెట్ అందుకుంది.





