T20 World Cup : ఒక్క దెబ్బతో సెంటిమెంట్లన్నీ బ్రేక్..అహ్మదాబాద్ లో భారత్ అదుర్స్
T20 World Cup : టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు ముందు టీమిండియా విషయంలో చాలా మంది అభిమానులు సెంటిమెంట్ ఫీలయ్యారు.
T20 World Cup
టీ20 ప్రపంచకప్(T20 World Cup) ఫైనల్ కు ముందు టీమిండియా విషయంలో చాలా మంది అభిమానులు సెంటిమెంట్ వెంటాడుతుందేమోనని భయపడ్డారు. అహ్మదాబాద్ మనకు కలిసి రాని గ్రౌండ్ అనీ, పైగా న్యూజిలాండ్‌పై నాకౌట్ మ్యాచ్ లలో గెలిచిన సందర్భాలే లేవనీ, టాస్ గెలిస్తేనే మ్యాచ్ అంటూ ఇలా చాలా సెంటిమెంట్ల గురించి మాట్లాడుకున్నారు. అటు భారత జట్టు కూడా ఈ సారి పట్టుబట్టి మరీ హోటల్ రూమ్ మార్చుకుని, డ్రెస్సింగ్ రూమ్ మార్చుకుని ఫైనల్ కు సిద్ధమైంది.
అయితే తీరా గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్క విజయంతో సెంటిమెంట్లన్నీ బ్రేక్ అయ్యాయి. మొట్టమొదటగా భారత్ టాస్ ఓడిపోయింది. ఒక విధంగా ఇదే మంచిదైందన్న అభిప్రాయం చాలా మందిలో కనిపించింది. ఎందుకంటే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై టాస్ ఓడిపోయి మ్యాచ్ గెలవడం ఇక్కడ చాలా మంది ఉదాహరణగా చెప్పారు.
అయితే న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ భారత బౌలింగ్ ను చాలా తక్కువ అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఒకవేళ భారత్ టాస్ గెలిచి ఉంటే ఏం నిర్ణయం తీసుకునేదో తెలీదు కానీ టాస్ ఓడిపోవడమే కలిసొచ్చిందన్నది ఇప్పుడు చాలా మంది అభిప్రాయం.
అలాగే న్యూజిలాండ్ పై ఓవరాల్ రికార్డుల్లో పైచేయి ఉన్నా సరే ఐసీసీ టోర్నీల్లో మాత్రం దారుణమైన రికార్డుంది. ఒక్కటంటే ఒక్కసారి కూడా నాకౌట్ మ్యాచ్ లలో కివీస్ పై భారత్ ఇప్పటి వరకూ గెలవలేదు. మూడుసార్లు తలపడితే మూడుసార్లు పరాజయం పాలైంది. ఈ సారి మాత్రం ఆ రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది.

న్యూజిలాండ్ పై తొలిసారి నాకౌట్ ఫైట్ లో అదరగొట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఇక అహ్మదాబాద్ లో ఫైనల్ జరుగుతుందని ప్రకటించినప్పటి నుంచీ చాలా మంది ఇండియాకు కలిసిరాని గ్రౌండ్ లో టైటిల్ పోరు పెట్టారేంటని ప్రశ్నించారు. తుది పోరుకు చేరిన తర్వాత కూడా చాలామందికి ఈ స్టేడియం సెంటిమెంట్ కారణంగానే ఇండియా టైటిల్ గెలవడం కష్టమే అని ఫిక్స్ అయిపోయారు.
పైగా అదృష్టవశాత్తూ సూపర్ 8 స్టేజ్ నుంచి ముందంజ వేసిన న్యూజిలాండ్.. సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై ఆడిన తీరు చూసిన తర్వాత కూడా చాలా మందికి భారత్ విజయంపై నమ్మకం లేదు. అయితే స్టేడియం సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసిన భారత జట్టు సగర్వంగా మూడోసారి టీ20 ప్రపంచకప్(T20 World Cup) ను సొంతం చేసుకుంది. సొంతగడ్డపై టైటిల్ సాధించిన జట్టుగా నిలిచింది. అలాగే వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీంగానూ చరిత్రకెక్కింది.





