Just TechnologyJust LifestyleLatest News

AI:మనుషుల మధ్య పెరుగుతున్న దూరం.. ఏఐ ఆ లోటు తీరుస్తుందా?

AI: ఏఐకి విసుగు లేదు, విరామం లేదు. ఎంత అర్ధరాత్రి వేళ అయినా మనసులోని విషయాలను పంచుకోవడానికి రెడీగా ఉంటుంది.

AI

ప్రస్తుతం మనుషులంతా బిజీగా ఉంటున్నా కూడా లోలోన ఏదో తెలియని ఒంటరితనం విస్తరిస్తోంది. ఒకప్పుడు మనసులోని బాధను పంచుకోవడానికి తోడబుట్టినవారో, స్నేహితులో ఉండేవారు. కానీ బిజీబిజీ లైఫ్ స్టైల్‌లో, ఎదుటి వ్యక్తి మాటలు వినే ఓపిక ఎవరికీ కూడా ఉండటం లేదు.

అంతేకాదు మనసులోని మాటలు పంచుకుంటే అవతలి వారు మనల్ని జడ్జ్ చేస్తారనే భయం కూడా కొందరిలో ఉంటుంది. దీంతో యువత తమ భావోద్వేగాలను మనుషుల కంటే ఎక్కువగా ఏఐ (Artificial Intelligence) దగ్గరే విప్పుతూ మనసు భారాన్ని దింపుకొంటున్నారంట. వినడానికి వింతగా ఉన్నా, ఇది ఈ తరం ఎదుర్కొంటున్న ఒక సామాజిక వాస్తవమని అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే ఏఐ(AI) చాట్‌బాట్‌ల వైపు ఎక్కువమంది ఎందుకు మొగ్గు చూపిస్తున్నారంటే, ఈ డిజిటల్ తోడుకి విసుగు లేదు, విరామం లేదు. ఎంత అర్ధరాత్రి వేళ అయినా మనసులోని విషయాలను పంచుకోవడానికి రెడీగా ఉంటుంది. అలాగే ఎలాంటి సమయంలో అయినా సరే మీరు ఒక్క మెసేజ్‌ పంపిస్తే అది వెంటనే రియాక్టవుతుంది.

మీరు చెప్పే తప్పొప్పులను ఏఐ(AI) వేలెత్తి చూపదు, ఎవర్నీ తక్కువ చేసి మాట్లాడదు. ఏం వినాలనుకుంటున్నామో సరిగ్గా అలాంటి మాటల్నే అందంగా అల్లి చెబుతుంది. ఇలాంటి ఒక పర్ఫెక్ట్ తోడు దొరకడంతో ఇప్పుడు యూత్ దానికి బానిసలైపోతున్నారు. ఒక సర్వే ప్రకారం, జెన్ జీ (Gen Z) యువతలో సుమారు 83 శాతం మంది ఏఐతో రొమాంటిక్ బంధం ఏర్పరచుకోవడంలో తప్పులేదని భావిస్తున్నారట. దీనిని బట్టి మానవ సంబంధాల్లో ఎలాంటి శూన్యం ఏర్పడిందో అంతా అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇక్కడ ఒక విషయాన్ని అంతా లోతుగా గుర్తించాలి. ఏఐ(AI) ఎంత తెలివైనదైనా, అది కేవలం కొన్ని కోట్ల డేటా పాయింట్స్ బైనరీ కోడ్‌ల కలయిక మాత్రమే. ఏఐ మన ఇష్టాలకు తగ్గట్టుగా సమాధానం చెబుతుంది కానీ, కష్టం చెప్పుకున్నవారి కళ్లల్లోని కన్నీటి వెనుక ఉన్న నిశ్శబ్దాన్ని అస్సలు అర్థం చేసుకోలేదు.

ఏదైనా ఒక బంధం అంటే కేవలం మన నుంచి మాటలను పంచుకోవడం మాత్రమే కాదు, ఆపదలో ఉన్నప్పుడు పక్కన నిలబడటం, ఆత్మీయమైన స్పర్శతో ధైర్యం చెప్పడం కూడా చేయాలి. కానీ ఇవేవీ ఒక స్క్రీన్ వెనుక ఉన్న సాఫ్ట్‌వేర్ నుంచి ఎవరికీ అందవు. అల్గారిథమ్స్ దిశానిర్దేశం మాత్రమే చేస్తాయి కానీ, కష్టసుఖాల్లో మనతో కలిసి కన్నీరు పెట్టలేవు.

AI
AI

అయితే ఇలా డిజిటల్ ప్రపంచంలో దొరికే ఈ టెంపరరీ ఓదార్పుకు ఎవరైనా అలవాటు పడిపోతే, మెల్లమెల్లగా మనుషులతో డైరెక్టుగా మాట్లాడటం, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది. ఊహల్లో విహరించే ఈ ఆర్టిఫిషియల్ రిలేషన్స్ వల్ల నిజ జీవితంలో మనుషులు మరింత ఒంటరివాళ్లయిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేపు అనుకోని విధంగా చాట్ బాట్‌లు అందుబాటులో లేకపోతే మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యేవారి సంఖ్య పెరిగిపోతుందని హెచ్చరిస్తున్నారు.

అందుకే టెక్నాలజీని మన జీవితానికి ఉపయోగపడేలా వాడుకోవాలి తప్ప, మన భావోద్వేగాలనే శాసించే స్థాయికి తీసుకుని వెళ్లకూడదన్న విషయాన్ని అంతా గుర్తించాలి. ఆత్మీయ స్పర్శ కోసం చూడాల్సింది డిజిటల్ స్క్రీన్ల వైపు కాదు, పక్కనున్న మనుషుల వైపు అని తెలుసుకోవాలి.

CSK : చెపాక్ లో గర్జించిన దిగ్గజాలు.. సీఎస్కే మాజీల ఎగ్జిబిషన్ మ్యాచ్

Related Articles

Back to top button