Goa Train : ప్రతీరోజు హైదరాబాద్ టు గోవాకు రైలు.. ఏ రోజు ఏ ట్రైన్‌ వెళ్తుందో తెలుసుకోండి

Goa Train: తాజాగా హైదరాబాద్ - బెలగావి మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడంతో వారంలోని ఏడు రోజులు కూడా గోవాకు కనెక్టివిటీ ఏర్పడింది.

Goa Train

హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లాలనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకూ ట్రైన్‌లో గోవా వెళ్లాలంటే వారంలో కేవలం కొద్ది రోజులు మాత్రమే రైళ్లు అందుబాటులో ఉండేవి. దీనివల్ల ప్రయాణికులు ఏ తేదీలో ట్రైన్ ఉందో దాని ప్రకారం తమ టూర్ ప్లాన్ చేసుకునేవారు.

కానీ ఇకపై అలాంటి ఇబ్బందులేమీ లేకుండా వారంలో ప్రతిరోజూ హైదరాబాద్ నుంచి గోవాకు ట్రైన్‌లో (Goa Train)ప్రయాణించే అవకాశం కలిగింది. గోవాను సందర్శించే వారిలో తెలుగు రాష్ట్రాల వారే సుమారు 20 శాతం ఉండటంతో దీనిని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

గతంలో కాచిగూడ – యలహంక ట్రైన్ ద్వారా ప్రయాణించి గుంతకల్ వద్ద బోగీలు మారాల్సి వచ్చేది, దీనివల్ల జర్నీలోనే చాలా టైమ్ వేస్ట్ అయ్యేది. అయితే 2024 అక్టోబర్‌లో డైరెక్టుగా సికింద్రాబాద్ – వాస్కోడిగామా రైలు (17039) అందుబాటులోకి వచ్చినా సరే, ఇది కేవలం బుధ, శుక్రవారాల్లో మాత్రమే నడుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా పర్యాటకుల డిమాండ్‌తో హైదరాబాద్ – బెలగావి మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడంతో వారంలోని ఏడు రోజులు కూడా గోవాకు కనెక్టివిటీ ఏర్పడింది.

ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం వారంలో ప్రతిరోజు కూడా ఏదొక రైలు అందుబాటులో ఉంటుంది.

బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ – వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ డైరెక్టుగా గోవా (Goa Train) వరకు వెళ్తుంది. జస్డీ – వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ (17322) సికింద్రాబాద్ (చర్లపల్లి) నుంచి మంగళవారం అందుబాటులో ఉంటుంది.
ఇక సోమ, గురు, శనివారాల్లో బెలగావి వెళ్లే రైళ్ల ద్వారా గోవాకు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉండే లోండా స్టేషన్ వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి ప్రైవేటు వెహికల్స్ ద్వారా ఈజీగా గోవా చేరుకోవచ్చు.

Goa Train

రిటర్న్ జర్నీలో కూడా ఇలాగే రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వాస్కోడిగామా – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ గురు, శనివారాల్లో, అలాగే వాస్కోడిగామా – జస్డీ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం డైరెక్టుగా గోవా నుంచి బయల్దేరుతాయి.

మిగిలిన రోజుల్లో బెలగావి నుంచి హైదరాబాద్ వచ్చే రైళ్ల ద్వారా లోండా స్టేషన్ నుంచి ప్రయాణం సాగించొచ్చు. కాగా ఇకపై వీకెండ్ ప్లాన్స్ కోసం తేదీల టెన్షన్ లేకుండా.. ఎప్పుడంటే అప్పుడు గోవా వెళ్లిపోవచ్చని గోవా ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version