Nagarjuna Yadav Arrest : లైవ్ డిబేట్ కామెంట్స్ ఎఫెక్ట్.. నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు
Nagarjuna Yadav Arrest : తాజాగా ఒక న్యూస్ ఛానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున యాదవ్ .. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు.
Nagarjuna Yadav Arrest
తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.. ఒక టీవీ లైవ్ డిబేట్లో చేసిన వివాదాస్పద కామెంట్ల కేసులో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను(Nagarjuna Yadav Arrest) తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న నాగార్జున యాదవ్ ఇంటికి ఆదివారం వెళ్లిన హైదరాబాద్ బేగంబజార్ పోలీసులు..ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
తాము తెలంగాణ నుంచి వచ్చినట్లు కుటుంబ సభ్యులకు ప్రాథమిక సమాచారం అందించిన పోలీసు టీమ్, ఈ అరెస్ట్ తాలూకు వివరాలను స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఎంటర్ చేస్తామని చెప్పి నాగార్జునను తమతో పాటు తీసుకుని వెళ్లారు. అయితే తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇలా ఎలా అరెస్ట్ చేస్తారంటూ నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఒక న్యూస్ ఛానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున యాదవ్ .. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్‌తో పోల్చడమే కాకుండా.. ఆయనకు కనీసం ప్రభుత్వ జీవోలు కూడా సరిగా చదవడం రాదని ఎద్దేవా చేశాడు. అంతేకాదు రేవంత్ రెడ్డి అసలు ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా పనికిరాడంటూ ఏకవచనంతో సంబోధించారు.
న్యూస్ ప్రజెంటర్ వారించినా నాగార్జున యాదవ్ వెనక్కి తగ్గకుండా విమర్శలు కొనసాగించడమే కాదు..అసలు డెలివరీ బాయ్స్‌ను తాను సీఎం రేవంత్ రెడ్డితో పోల్చడం వాళ్లను అవమానించడమే అవుతుందంటూ మరింత ఘాటుగా కామెంట్స్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ కామెంట్లపై టీపీసీసీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా..ఈ కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగారు.
నిజానికి నాగార్జున యాదవ్ వైసీపీ తరఫున టీవీ చర్చల్లో చాలా యాక్టివ్‌గా మాట్లాడే నేత అయినా, గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల విషయంలోనూ అప్పట్లో ఆయనపై అరెస్ట్ ప్రచారం జరిగింది.
కాకపోతే ఇప్పుడు ఒక రాష్ట్రానికి చెందిన పొలిటికల్ పార్టీ ప్రతినిధిని పొరుగు రాష్ట్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడమనేది ఎప్పుడూ ఇంటర్-స్టేట్ పోలీస్ కోఆర్డినేషన్, ప్రొటోకాల్ , చట్టపరమైన అంశాలపై పెద్ద చర్చకు దారితీస్తుంది.
ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం నుంచి ఈ ఘటనపై ఎలాంటి అధికారిక స్పందన రాకపోయినా, ముందస్తు సమాచారం, పోలీస్ ప్రొటోకాల్స్ ఉల్లంఘనలపై క్లారిటీ కోరే అవకాశం ఉండొచ్చు. అయితే మాటలు జారే వ్యక్తిగా పేరు బడ్డ నాగార్జున యాదవ్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ పరిణామం వల్ల రాబోయే రోజుల్లో కోర్టు పిటిషన్లు, పొలిటికల్ ప్రతిస్పందనలతో మరింత వేడెక్కనుండగా.. టీవీ డిబేట్లలో వాడే భాష, వ్యక్తిగత దూషణ హద్దులపై ఒక పెద్ద డిబేట్‌కు తెరలేపినట్లు అయింది.
YSRCP Spokesperson Nagarjuna Yadav Arrested Over Remarks Against Revanth Reddy
రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యల కేసులో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను గుంటూరులోని ఆయన… pic.twitter.com/xoBKCWe1FZ
— Congress for Telangana (@Congress4TS) July 12, 2026





