Just TelanganaLatest News

Pullareddy Sweets : బ్రాండెడ్ షాపుల్లోనూ డేంజరస్ స్వీట్స్.. పుల్లారెడ్డి స్వీట్స్‌లోనూ అదే సీన్

Pullareddy Sweets : హైదరాబాద్‌లో టీజీ సేఫ్ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో స్వీట్ షాపుల అపరిశుభ్రత బయటపడింది. పురుగులు, ఎలుకలతో కూడిన కిచెన్లు, సీజ్ చేసిన టన్నుల కొద్దీ స్వీట్లతో అధికారులే షాక్ అయ్యేలాంటి పరిస్థితులు కనిపించాయి.

Pullareddy Sweets

హైదరాబాద్‌లో ఎన్ని దాడులు జరుగుతున్నా హోటల్స్, రెస్టారెంట్ల తీరు ఇంకా మారలేదనుకుంటే, ఇప్పుడు స్వీట్ షాపులు కూడా వాటికి ఏమాత్రం తీసిపోవు అన్నట్లుగా సీన్స్ కనిపిస్తున్నాయి. దీపావళి పండుగ సమీపిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న స్వీట్ తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ (TG SAFE) అధికారులు దాడుల స్పీడ్ పెంచారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో చిన్నచిన్న షాపుల నుంచి ఏకంగా బడా బ్రాండెడ్ షాపుల వరకు అన్నీ డొల్లేనని తేలిపోవడంతో వినియోగదారులు నివ్వెరపోతున్నారు.

ముఖ్యంగా సనత్‌నగర్‌లోని ప్రఖ్యాత జి. పుల్లారెడ్డి స్వీట్స్(Pullareddy Sweets) షాపుతో పాటు మొత్తం 16 ప్రాంతాల్లో అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ తనిఖీల్లో కిచెన్లలో యథేచ్ఛగా ఎలుకలు, బొద్దింకలు పరుగులు పెట్టడం, ఈగలు మూగడం వంటి అత్యంత దారుణమైన వాతావరణం దర్శనమిచ్చింది.

కొన్ని చోట్ల జీడిపప్పులో నుంచి పురుగులు రావడం అధికారులనే విస్మయానికి గురిచేసింది. అంతేకాకుండా స్వీట్లపై న్యూస్‌పేపర్లు కప్పడం, ఫంగస్ పట్టిన అలాగే గడువు ముగిసిన పదార్థాలను కొత్త వాటిలో కలపడం, లేబుల్స్ లేని కల్తీ తినుబండారాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

ఈ దాడుల్లో ఏకంగా రూ.16.86 లక్షల విలువైన 3,546 కిలోల డేంజరస్‌ స్వీట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలను గాలికి వదిలేసిన 5 స్వీట్ షాపులను వెంటనే మూసివేయడంతో పాటు వాటి ఫుడ్ లైసెన్సులను సస్పెండ్ చేశారు. మరో 7 సంస్థలకు షోకాజ్ నోటీసులను కూడా జారీ చేశారు.

ప్రజారోగ్యంతో ఆటలాడితే ఎలాంటి బ్రాండెడ్ సంస్థలైనా సరే ఉపేక్షించేది లేదని, మరోసారి రూల్స్ ఉల్లంఘిస్తే డైరెక్టుగా కేసులు నమోదు చేస్తామని టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి గట్టిగా హెచ్చరించారు. పండుగ పూట కల్తీ స్వీట్లు కొని మోసపోకుండా ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.దీంతో ఏం తిందామన్నా, ఏం కొందామన్నా ఇలాంటి పరిస్థితులే ఉంటే ఏం చేయాలి.. ఇకపైన అయినా గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటూ ఉంటే ఇలాంటివాటికి పూర్తిగా చెక్ పెట్టొచ్చని అంటున్నారు సిటీ జనులు.

Maturity : నిజమైన మెచ్యూరిటీ అంటే ఏంటి? ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉంటుంది?

Related Articles

Back to top button