Latest News

Rajasingh:రాజాసింగ్ షాక్ తర్వాత బీజేపీ వ్యూహం వర్కవుట్ అవుతుందా?

Rajasingh:ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజాసింగ్ వ్యవహారం తర్వాత, ఈ నియోజకవర్గంపై పట్టు కోల్పోకూడదని కమలం పార్టీ దృఢ నిశ్చయంతో ఉంది.

Rajasingh: గోషామహల్… గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కమలం పార్టీకి కంచుకోటలాంటి నియోజకవర్గం. వరుసగా మూడుసార్లు బీజేపీ జెండా రెపరెపలాడిన ప్రాంతం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పరువు నిలబెట్టిన ఏకైక స్థానం. అలాంటి కీలకమైన గోషామహల్‌( Goshamahal)పై ఇప్పుడు తెలంగాణ బీజేపీ(BJP) పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అనూహ్యంగా ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజాసింగ్ వ్యవహారం తర్వాత, ఈ నియోజకవర్గంపై పట్టు కోల్పోకూడదని కమలం పార్టీ దృఢ నిశ్చయంతో ఉంది. ఇది కేవలం ఒక స్థానం కోసమే కాదు, పాతబస్తీలో తమ ఉనికిని, హిందుత్వ అజెండాను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగం.

గోషామహల్ విజయాల వెనుక ఎవరు? రాజాసింగా? బీజేపీయా?

నా వల్లే బీజేపీ గెలిచింది,” – రాజీనామా సమయంలో రాజాసింగ్ (Raja Singh)పరోక్షంగా చెప్పిన మాట ఇది. అలాగే ఆయన హిందుత్వ అజెండా, ఎంఐఎంపై పాతబస్తీలో చేసిన పోరాటం వల్లే గోషామహల్ బీజేపీ కంచుకోటగా మారిందని ఆయన వర్గం బలంగా నమ్ముతోంది. గత గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో గోషామహల్ పరిధిలోని అన్ని కార్పొరేటర్ స్థానాలను బీజేపీ గెలుచుకోవడంలో రాజాసింగ్ కృషిని తక్కువ అంచనా వేయలేమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడతారు.

అయితే, బీజేపీ అధిష్టానం దీన్ని అంత తేలికగా తీసుకోదలచుకోలేదు. “గోషామహల్‌లో ఉన్నది రాజాసింగ్ బలం కాదు, బీజేపీ బలం!” అని పార్టీ వర్గాలు బలంగా వాదిస్తున్నాయి. వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు పార్టీ క్యాడర్, సంస్థాగత బలం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, జాతీయ నాయకత్వం కలిసికట్టుగా కృషి చేయడం వల్లే హ్యాట్రిక్ విజయం సాధ్యమైందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ ‘వ్యక్తి-కేంద్రిత’ వాదనను తుడిచిపెట్టి, పార్టీ బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.

బీజేపీ వ్యూహ చక్రం..పట్టు నిలుపుకునే ప్రయత్నం

గోషామహల్ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అభినందన సభను గోషామహల్‌లో ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు బీజేపీ బలం ఇంకా చెక్కుచెదరలేదని సందేశం ఇవ్వడం, రాజాసింగ్ లేని లోటును పూడ్చగలమని భరోసా కల్పించడం లక్ష్యం. రాంచందర్‌రావు తన ప్రసంగంలో లక్షలాది మంది కార్యకర్తల కృషిని, పార్టీ వ్యవస్థాగత బలాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీకి తెలంగాణలో అధికారం తేవడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇది రాజాసింగ్ రాజీనామాకు పరోక్ష సమాధానం ఇచ్చినట్లే.

పాతబస్తీలో ఎంఐఎంకు కంచుకోటలాంటి ప్రాంతంలో, బీజేపీ తన హిందుత్వ అజెండాతో ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తోంది. గోషామహల్ విజయం ఆ లక్ష్యానికి ఒక కీలకమైన పునాది. రాబోయే ఎన్నికల్లో అదే ఉత్సాహంతో పనిచేసి, పాతబస్తీలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు రాంచందర్‌రావు దిశానిర్దేశం చేశారు.

బీజేపీకి గోషామహల్ ఎందుకు కీలకం?

గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీకి బలమైన నాయకత్వం, భారీ క్యాడర్ ఉన్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ప్రస్తుత రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు వంటి కీలక నేతలు భాగ్యనగరం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 40 మందికి పైగా కార్పొరేటర్లతో బీజేపీ గ్రేటర్‌లో ఎంఐఎం తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఈ బలాన్ని మరింత పెంచుకోవాలని, పాతబస్తీలో ఎంఐఎంకు దీటుగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. గోషామహల్ విజయం గ్రేటర్ వ్యాప్తంగా పార్టీకి మరింత ఊపునిస్తుందని, తద్వారా రాబోయే ఎన్నికల్లో మంచి పట్టు సాధించవచ్చని లెక్కలు వేసుకుంటోంది.

సవాళ్లు, వ్యూహాల మధ్య ఆ కొత్త ముఖం ఎవరు?

రాజాసింగ్ రాజీనామా, ఆ తర్వాత ఆయన చేసిన ప్రకటనలు గోషామహల్ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఒకవైపు రాజాసింగ్ వ్యక్తిగత ప్రభావం, మరోవైపు ఎంఐఎం బలం – ఈ రెండింటినీ ఎదుర్కొని గోషామహల్‌లో బీజేపీ తన పట్టును నిలుపుకోవాలంటే పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలి. పార్టీకి బలమైన, కొత్త ముఖాన్ని పరిచయం చేయాల్సి ఉంటుంది. ఆ ముఖం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటంతో పాటు, రాజాసింగ్ లేని లోటును భర్తీ చేయగలిగే సమర్ధవంతమైన నాయకుడై ఉండాలి.

మరి ఈ కీలకమైన గోషామహల్ స్థానంలో రాజాసింగ్ ప్రభావాన్ని చెరిపేసి, ఎంఐఎంకు దీటుగా నిలబడగల ఆ ‘నయా నేత’ ఎవరు? రాబోయే రోజుల్లో తెలంగాణ కమలం పార్టీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో చూడాలి. గోషామహల్ రాజకీయాలు రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపోటములకు ఓ సంకేతంగా మారే అవకాశం లేకపోలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button