Just Andhra Pradesh

hill stations:ఆంధ్రప్రదేశ్‌లో అదిరే హిల్ స్టేషన్లు..ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే వారికి ది బెస్ట్ ప్లేసులివే..

hill stations:ప్రకృతి అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. చాలా మంది ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చదనంతో కూడుకున్న ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటారు.

hill stations:ప్రకృతి అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. చాలా మంది ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చదనంతో కూడుకున్న ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటారు. ఎత్తైన కొండలపై విహారం మరపురాని అనుభవంగా ఉంటుంది. అయితే ఇలాంటి విహారం మీకూ చేయాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఈ అద్భుతమైన హిల్ స్టేషన్లను చుట్టేయండి.

hill stations:

1. లంబసింగి: ప్రకృతి ప్రేమికులు ఒక్కసారైనా తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. లంబసింగి హిల్స్‌(Lambasingi Hills)పై నిలబడితే మేఘాల్లో తేలిన అనుభూతి కలుగుతుంది. లంబసింగి చుట్టుపక్కల కూడా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. చలికాలంలో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. మంచు అందాలను ఆస్వాదిస్తూ పరవశించిపోతుంటారు. దీనిని ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఈ గ్రామం సముద్రమట్టానికి 4 వేల అడుగుల ఎత్తులో ఉంది.

2. అరకులోయ: అరకులోయ హిల్ స్టేషన్ (Araku Valley Hill Station) సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మైమరపిస్తాయి. పచ్చదనం కప్పుకుని కనిపించే ఇక్కడి కొండలు టూరిస్టులను కనువిందు చేస్తాయి. ఈ ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. అరకులోయలో ప్రయాణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. విశాఖపట్నం నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

3. హార్సిలీ హిల్స్: ఈ హిల్ స్టేషన్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఉంది. సముద్రమట్టానికి 1314 మీటర్ల ఎత్తులో ఈ ప్రదేశం ఉంది. సమ్మర్ క్యాంప్‌గా పిలుచుకునే ఈ ప్రాంతం వింటర్‌లో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. చిత్తూరుకు 72 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఈ హిల్ స్టేషన్ ఉంది. అడ్వెంచర్ జోన్‌లతో పాటు బ డ్జెట్‌కు అనుగుణంగా రిసార్ట్స్ కూడా ఉన్నాయి.

4. పాపికొండలు: చుట్టూ ఎత్తైన కొండలు, చిక్కని అడవులు.. మధ్యలో గోదారమ్మ ఒడిలో మెలికలు తిరుగుతూ జలవిహారం చేయాలంటే పాపికొండల దగ్గరికి వెళ్లాల్సిందే. రాజమండ్రి గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఈ పాపికొండలు(Papikondalu) ఉన్నాయి. ఉదయం రాజమండ్రి నుంచి బోటులో వెళ్లి తనివితీరా పాపికొండల అందాలను చూసి సాయంత్రం కల్లా మళ్లీ రాజమండ్రి చేరుకోవచ్చు.

5. తిరుమల: చిత్తూరు జిల్లాలోని తిరుమల క్షేత్రం సముద్ర మట్టానికి 976 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రం ఏడాది పొడవునా భక్తులు, టూరిస్టులతో రద్దీగా ఉంటుంది. వింటర్ సీజన్‌లో ఈ ప్రాంతం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. తిరుమలలోని పర్యాటక ప్రాంతాలైన జలపాతాలు, చారిత్రక ప్రదేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. చాలా మంది ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తిరుమల కొండపైకి నడుస్తూ వెళ్తుంటారు.

6. శ్రీశైలం: కర్నూలు జిల్లాలోని నల్లమల ఫారెస్ట్‌లో ఉన్న శ్రీశైలం సముద్ర మట్టానికి 457 మీటర్ల ఎత్తులో ఉంది. ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన ఈ ప్రదేశానికి కూడా పర్యాటకులు అధికంగానే వస్తుంటారు. ఇక్కడ ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకంగానూ ఎన్నో ఆకర్షణలు కనిపిస్తాయి. రాత్రి బస చేసేందుకు హోటళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. విజయవాడ నుంచి 264 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం ఉంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button